Jaggayyapeta Protest: దారుణం.. ఆర్టీసీ డ్రైవర్లపై దాడి..
ABN , Publish Date - Nov 25 , 2025 | 07:59 AM
జగ్గయ్యపేటలోని ఆర్టీసీ ప్రాంగణంలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లపై దాడి చేసినందుకు నిరసనగా.. డ్రైవర్లు బస్సులు ఆపేసి ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 25: జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లపై దాడికి పాల్పడినందుకు గానూ.. డ్రైవర్లంతా మూకుమ్మడిగా నిరసనకు దిగారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్‌పై ఓ రౌడీ షీటర్ దాడి చేశాడు. మరోవైపు ఆర్టీసీ డిపోలో మరో డ్రైవర్‌పై కొందరు ఆటో డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు. బాధిత డ్రైవర్లకు మద్దతుగా హైర్ బస్ ఓనర్లు, ఆర్టీసీ కార్మికులంతా బస్ సర్వీసులు నిలిపివేసి నిరసనకు దిగారు.
ఆర్టీసీ కార్మికులంతా ఒక్కసారిగా నిరసనకు దిగడంతో.. సుమారు 32 బస్ సర్వీసులు ఆగిపోయాయి. జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో హైర్ బస్సులు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, పల్లెవెలుగు బస్సులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ ఘటనపై స్థానిక డిపో మేనేజర్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్టీసీ డిపో సహా బస్టాండ్ ఏరియా అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులంతా అసహనానికి గురయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేందుకు వెళ్తే బస్సులు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కలుగజేసుకుని పరిస్థితి సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి:
బాలుడిపై శునకం దాడి.. తెగిపడిన చెవి
దేవుడా ఎంతపని చేశావయ్యా.. చుట్టపు చూపుగా వచ్చి..