Share News

పసిపాప చేసిన పెళ్లి

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:38 AM

పండంటి పాప పుట్టి పుట్టగానే ఆ తల్లిదండ్రులకు ఒక్కటి చేసింది. ప్రేమ సాక్షిగా ఒక్కటైన తన అమ్మానాన్నలను తానే కలిపింది. ప్రేమికుల దినోత్సవం రోజు జరిగిన ఈ సంఘటన కాకతాళీయమే అయినా నవజాత శిశువును చంకనేసుకుని ఆ దంపతులు దండలు మార్చుకోవడం అందరినీ ఆనందానికి గురిచేసింది.

పసిపాప చేసిన పెళ్లి

ప్రేమికులను కలిపిన జగ్గయ్యపేట పోలీసులు

ప్రేమించి, బిడ్డ పుట్టాక కాదన్న యువకుడు

పోలీసులను ఆశ్రయించిన యువతి బంధువులు

ఇరువర్గాల చర్చలతో సమస్య కొలిక్కి

నవజాత శిశువును చంకనేసుకుని ఒక్కటైన జంట

జగ్గయ్యపేట, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : పండంటి పాప పుట్టి పుట్టగానే ఆ తల్లిదండ్రులకు ఒక్కటి చేసింది. ప్రేమ సాక్షిగా ఒక్కటైన తన అమ్మానాన్నలను తానే కలిపింది. ప్రేమికుల దినోత్సవం రోజు జరిగిన ఈ సంఘటన కాకతాళీయమే అయినా నవజాత శిశువును చంకనేసుకుని ఆ దంపతులు దండలు మార్చుకోవడం అందరినీ ఆనందానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. జగ్గయ్యపేటలోని విలియంపేటకు చెందిన ఓ యువతి (19), అనుమంచిపల్లికి చెందిన యువకుడు (21) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ యువకుడు బంధువుల ఇంటికి సమీపంలో యువతి నివాసం ఉండటంతో పరిచయం కాస్త ప్రేమ.. ఆ తర్వాత శారీరక సంబంధానికి దారితీసింది. కొన్నిరోజులకు యువతి గర్భం దాల్చింది. కానీ, ఆ విషయం ఆమెకు తెలియలేదు. కడుపునొప్పి ఎక్కువ కావడంతో రెండు రోజుల క్రితం ఆమె స్థానిక ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంకు వెళ్లింది. అక్కడ వాష్‌రూమ్‌లోకి వెళ్లిన యువతి ఓ పాపకు జన్మనిచ్చింది. దీంతో నర్సింగ్‌ హోమ్‌ వారు ఐసీడీఎస్‌కు సమాచారమిచ్చారు. ఈ వ్యవహారమంతా యువతి బంధువులకు తెలియడంతో ప్రేమించిన యువకుడిని నిలదీశారు. తొలుత అతడు పెళ్లికి అంగీకరించకపోవడంతో గురువారం యువతి బంధువులు జగ్గయ్యపేట పోలీసులను ఆశ్రయించారు. యువకుడి బంధువులకు కూడా విషయం తెలియడం, ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావటంతో చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని పోలీసులు నచ్చజెప్పారు. దీంతో శుక్రవారం ఇరుపక్షాల వారు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. యువకుడు నూతనంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణం పూర్తయ్యాక పెళ్లికి అంగీకరించాడని, వివాహం నిశ్చయం చేసుకున్నామని పోలీసులకు చెప్పారు. అయితే, పోలీసులు అక్కడే నిశ్చయ తాంబూలాలు ఇచ్చి ఇద్దరితో దండలు మార్పించడంతో ప్రేమకథ సుఖాంతమైంది.

Updated Date - Feb 15 , 2025 | 12:39 AM