Share News

జగన్‌ పాలనంతా ఆర్థిక అరాచకం

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:08 AM

గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన లక్షల కోట్ల అప్పులన్నీ వైసీపీ నాయకులు, జగన్‌ కుటుంబ విలాసాలకే ఖర్చు చేశారని ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 జగన్‌ పాలనంతా ఆర్థిక అరాచకం

రూ.8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు

కూటమి ప్రభుత్వంపై ఏడాదికి రూ.71వేల కోట్ల భారం

ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ధ్వజం

పెనమలూరు, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్‌రెడ్డి ఆర్థిక అరాచకాన్ని సృష్టించారు. రాష్ర్టాన్ని అధోగతి పాల్జేశాడు. కూటమి ప్రభుత్వంపై జగన్‌రెడ్డి దోపిడీ ప్రభావం తీవ్రంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన లక్షల కోట్ల అప్పులన్నీ వైసీపీ నాయకులు, జగన్‌ కుటుంబ విలాసాలకే ఖర్చు చేశారు.’ అని ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పోరంకి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గత వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసింది. దీనివల్ల కూటమి ప్రభుత్వం అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.71వేల కోట్ల చెల్లింపులు చేస్తోంది. దీంతో ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏడు నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రీయింబర్సుమెంటు లాంటి జగన్‌ ప్రభుత్వ బకాయిలు రూ.22వేల కోట్లను చెల్లించింది. గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా రూ.1.40 లక్షల కోట్ల బకాయిలను జగన్‌ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఉద్యోగులకు రూ.20వేల కోట్ల బకాయిలు, ఇరిగేషన్‌ కాంట్రాక్టర్లకు రూ.19వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. జగన్‌రెడ్డి విలాసాలు, జల్సాలకు రూ.20వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుబారా చేశారు. సెంటు పట్టాల పేరుతో రూ.7 వేల కోట్లు, రేషన్‌ బియ్యం దోపిడీలో రూ.7 వేల కోట్లు, సచివాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి రూ.3 వేల కోట్లు, తాడేపల్లి ప్యాలెస్‌ సెక్యూరిటీకి వెయ్యి కోట్లు, సర్వేరాళ్లపై జగన్‌ ఫొటోలకు ఏడువందల కోట్లు, రుషికొండపై విలాసవంతమయిన భవన నిర్మాణానికి రూ.600 కోట్లు దుబారా చేసి ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు. ఐదేళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.8లక్షల కోట్ల ప్రజాధనాన్ని జగన్‌రెడ్డి కొల్లగొట్టారు. లిక్కర్‌పై కమీషన్ల రూపంలోనే రూ.లక్ష కోట్లు వెనకేసుకున్నారు. విశాఖ భూముల కుంభకోణం, టీడీఆర్‌ బాండ్ల కుంభకోణం, ఇసుక దోపిడీ, ఎర్రచందనం దోపిడీ..ఏ రంగం చూసినా జగన్‌రెడ్డి దోపిడీ స్పష్టంగా కనిపిస్తోంది. జగన్‌ పత్రికకు ప్రకటనల రూపంలో రూ.1600 కోట్ల దోపిడీ జరిగింది. గ్రావెల్‌, సిలికా, గంజాయి, డ్రగ్స్‌, భారతీసిమెంటు, కొవిడ్‌ మందులు, కిట్లు, స్మార్ట్‌ మీటర్లు, విద్యార్థులకు ట్యాబులు, నాడు-నేడు..ప్రతి రంగంలో జగన్‌ దోపిడీ ప్రస్ఫుటమవుతోంది.’ అని బోడె ప్రసాద్‌ ఆరోపించారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు అనుమోలు ప్రభాకరరావు, పార్టీ పెనమలూరు మండలాధ్యక్షుడు కోయ ఆనంద్‌ప్రసాద్‌, పీతా గోపీచంద్‌, బోడె సురేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 01:08 AM