అవినీతి కొండలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:31 AM
కొండలను పిండి చేశారు.. భూములను ఆక్రమించేశారు.. చెరువులను చెరపట్టారు.. మామిడి తోటలను సైతం మాయం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఆయన అనుచరులు చేసిన అరాచకాలివి. అధికారం అనే అంధకారంలో.. అధికారులను కొనేసి సాగించిన అక్రమాల్లో రూ.కోట్లకు పడగలెత్తారు. నాటి వీరి పాపాలకు సాక్ష్యంగా నేడు గన్నవరంలో ఎటుచూసినా కరిగిపోయిన కొండలు.. తవ్వేసిన భూములే కనిపిస్తాయి.

గన్నవరంలో వంశీ అనుచరుల అక్రమాలు
వైసీపీ హయాంలో విచ్చలవిడిగా అవినీతి
కొండలన్నింటినీ బోడిగుండ్లుగా మార్చేశారు
లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వేశారు
చెరువులను చెరపట్టి మట్టిని తరలించారు
గ్రావెల్ ఉన్న మామిడి తోటలనూ వదల్లేదు
ఇన్నాళ్లకు పండిన పాపాల చిట్టా
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అనుయాయులు బినామీ పేర్లపై కొండలను, చెరువులను, వాగులను, తోటలను చెరబట్టి మరీ ఈ మైనింగ్ చేపట్టారు. వీటిపై అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించింది. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా కొండలు, చెరువులు, మామిడి తోటలు, పేదల భూములు.. అన్నింటినీ తమ అక్రమాల కోసం వాడుకున్నారు.
వెదురుపావులూరులో పేలుళ్లు
వెదురుపావులూరు కొండ ప్రాంతంలో అక్రమ క్వారీయింగ్ భారీగా జరిగింది. వెదురుపావులూరు, కొండపావులూరులో 300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కొండ ప్రాంతాన్ని భారీ పేలుళ్లతో పిండి చేశారు. దీనికోసం డ్రిల్లింగ్ మెషీన్లను తెప్పించి కొండకు ఐదారు మీటర్ల లోతున రంధ్రాలు చేసి, అందులో పేలుడు పదార్థాలను నింపి బ్లాస్టింగ్‌లు చేశారు. ఈ బ్లాస్టింగ్‌లతో పురుషోత్తపట్నం, కొండపావులూరు ప్రాంతాలు దద్దరిల్లాయి. దుమ్మూధూళి రేగటంతో స్థానికులు గగ్గోలు పెట్టారు. రాత్రిపూట వందలాది భారీ టిప్పర్లు తిరిగాయి. ఇందులో నాటి రెవెన్యూ అధికారుల హస్తం కూడా ఉంది. ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. అప్పట్లో రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులకు కూడా ఈ పాపంలో వాటాలు ఉండటంతో.. అడ్డుకున్న వారు లేకుండాపోయారు. ఇక్కడ జరిపిన తవ్వకాల ద్వారా కోట్ల రూపాయలను వంశీ అనుయాయులు సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
సూరంపల్లి తోకతిప్పను పిండేశారు
సూరంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 526లోని 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తోకతిప్పను కూడా వంశీ అనుయాయులు వదల్లేదు. గ్రామస్థులు అడ్డుపడినా, అడ్డుకునే ప్రయత్నాలు చేసినా లెక్క చేయలేదు. వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని తోకతిప్పను తవ్వేశారు. ఏడాది పాటు ఏకబిగిన తవ్వేయటం ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించారు.
మల్లవల్లిని మింగేశారు
మల్లవల్లిలోని సర్వే నెంబర్ 11లో వంశీ అనుయాయులు 175 ఎకరాలను అడ్డగోలుగా తవ్వేశారు. మల్లవల్లి గ్రావెల్‌ను గుడివాడ, బందరుకు భారీ ఎత్తున తరలించారు. పోర్టు పనుల పేరుతో భారీ ఎత్తున గ్రావెల్‌ను తవ్వుకుపోయారు.
ముస్తాబాద, చనుపల్లివారిగూడెం కొండలపై కన్ను
గన్నవరం మండలం పరిధిలోనే ముస్తాబాద, చనుపల్లివారిగూడెం కొండలను కూడా వంశీ అనుయాయులు అనధికారికంగా చేజిక్కించుకున్నారు. ఈ కొండల తవ్వకాలపై స్థానికులు అభ్యంతరాలను వ్యక్తంచేసినా పెడచెవిన పెట్టారు. అర్ధరాత్రి సమయంలోనే కొండలను పిండిచేశారు. లక్షల క్యూబిక్ మీటర్ల మేర గ్రావెల్‌ను తన్నుకుపోయారు.
మామిడి తోటలను మాయం చేశారు
గ్రావెల్ నిక్షేపాలు కలిగిన మామిడి తోటలను కూడా వంశీ అనుచరులు వదల్లేదు. రంగన్నగూడెం, సింగన్నగూడెం గ్రామాల్లోని మామిడి తోటల నేలలు గ్రావెల్‌తో కూడుకుని ఉండటం వల్ల వాటిని కూడా వంశీ అనుయాయులు వాటాల ప్రాతిపదికన చేజిక్కించుకుని తవ్వేశారు. దాదాపు 15 మీటర్ల మేర గ్రావెల్‌ను తవ్వేసి సొమ్ము చేసుకున్నారు.
డీ పట్టాలనూ వదల్లేదు
గన్నవరం నియోజకవర్గంలో పేదలకు ఇచ్చిన సాగు పట్టాలను, ప్రజలు ఆక్రమించుకున్న భూములు ఏమైనా ఉంటే వాటిని కూడా తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. ఇలా తీసుకున్న భూముల్లో మట్టిని అడ్డగోలుగా తవ్వేశారు. కొండపావులూరులో సర్వే నెంబర్ 33, 34, 62లో పెద్దసంఖ్యలో భూములను లీజుకు తీసుకుని 35 మీటర్ల లోతున మట్టిని తరలించారు. మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు.
చెరువులను చెరపట్టారు
గన్నవరం నియోజకవర్గంలోని అనేక చెరువులను వంశీ అనుయాయులు చెరపట్టారు. నాలుగు మండలాల పరిధిలో 80 శాతానికి పైగా చెరువులను ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వారు. కొండపావులూరులోని సర్వే నెంబర్ 144లోని ఎర్రచెరువు, బాపులపాడు మండలంలోని బిళ్లనపల్లి, రేమల్లెలోని ఊరచెరువు, వేలేరులోని ఊరచెరువు, కుంటలను 150 ఎకరాలకు పైగా తవ్వేశారు. గ్రామస్థులు అడ్డుకున్నా తవ్వకాలు ఆగలేదు. ఉంగుటూరులోని ఏ సీతారామపురం చెరువును రాత్రికి రాత్రే తవ్వేశారు. బాపులపాడు మండలంలోని కానుమోలులో ఉన్న 12 ఎకరాల చెరువును అడ్డగోలుగా తవ్వేశారు. గ్రామస్థులు పోరాడినా వదల్లేదు.