Share News

కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు!

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:11 AM

కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై ఎంతటి వారైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడిపందేలు నిర్వహించకుండా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.

కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు!
అధికారులతో కలిసి పోస్టరు ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ లక్ష్మీశ

కృష్ణలంక, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై ఎంతటి వారైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడిపందేలు నిర్వహించకుండా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. కోడిపందేల నిషేధంపై రాష్ట్ర పశుసంవర్థకశాఖ రూపొందించిన పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జంతుహింస నివారణ చట్టం ప్రకారం.. కోడిపందేలను నిషేధించడం జరిగిందన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

గ్రామ, మండలాల వారీగా తనిఖీ బృందాలు..

హైకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. గ్రామస్థాయి బృందంలో వీఆర్వో, కానిస్టేబుల్‌, పశుసంవర్థకశాఖ సిబ్బంది, మండలస్థాయి బృందంలో తహసీల్ధార్‌, ఎస్‌హెచ్‌వో, మండల పశుసంవర్థక అధికారి, జిల్లాస్థాయి బృందంలో ఆర్డీవో/సబ్‌కలెక్టర్‌, డీఎస్పీ/ఏసీపీ, పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరక్టర్‌ సభ్యులుగా వుంటారన్నారు. ఈ బృందాలు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, చట్టాల్లోని అంశాలను వివరించాలన్నారు. ఎవరైనా కోడిపందేలు నిర్వహించినా, పాల్గొన్నా చట్టప్రకారం నేరమేనని పేర్కొన్నారు. ఎక్కడా బరులు ఏర్పాటు కాకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వుండాలని, నిబంధనల మేరకు తహసీల్దార్లు, ఆర్డీవోలు వారి పరిధిలోని పంచాయతీలకు నోటిఫికేషన్లు జారీచేయాలని కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశించారు.

14 నుంచి జంతు సంక్షేమ పక్షోత్సవాలు

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 14 నుంచి 31వ తేదీ వరకు జంతు సంక్షేమ పక్షోత్సవాలు జరుగనున్నాయని కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు. పశుసంవర్థకశాఖ, జంతు సంరక్షణ సంఘాలు, రెవెన్యూ, విద్య, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొంటూ ఈ పక్షోత్సవాలు నిర్వహించాలని సూచించారు. పక్షోత్సవాల సందర్భంగా చర్చలు, నిపుణులతో ఇంటర్వ్యూలు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్‌ తదితర పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికేట్లు, బహుమతులు అందించనున్నట్టు తెలిపారు. జంతు సంక్షేమ చట్టాలు, నిబంధనలు తదితరాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కైండ్‌నెస్‌క్లబ్‌లు ఏర్పాటు చేయడం జరుగుతోందని, అధికారులు, సిబ్బంది కీలక భాగస్వామ్యంతో పక్షోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా పశుసంవర్థక అధికారి ఎం.హనుమంతరావు, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీపీవో పి.లావణ్యకుమారి, గ్రామ, వార్డు, సచివాలయాల ప్రత్యేక అధికారి పి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 01:11 AM