cricket betting:ఆట మొదలైంది
ABN , Publish Date - Mar 09 , 2025 | 01:08 AM
ఇండియా-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఏమో కానీ, నగరంలో మాత్రం క్రీడాభిమానుల కంటే బెట్టింగ్ బాబుల్లో ఉత్కంఠ పతాకస్థాయికి చేరింది. ఈ మ్యాచ్‌లు క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుండగా, బెట్టింగ్ రాయుళ్లకు మాత్రం కాసుల పంట పండిస్తున్నాయి. ఉత్తరాది బుకీలతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులు ఆదివారం జరగబోయే తుది మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. నగరం మొత్తంగా రూ.కోటి మేర బెట్టింగ్‌లు నిర్వహించడానికి, పోలీసులకు చిక్కకుండా ఉండటానికి పక్కా ప్రణాళిక వేసుకున్నారు.
నగరంలో భారీగా క్రికెట్ బెట్టింగ్‌లు
నేటి ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్‌కు రూ.కోట్లలో..
శివారు ప్రాంతాల్లో వెలిసిన డెన్‌లు
మెట్ల మాదిరిగా నెట్‌వర్క్ నడుపుతున్న బుకీలు
సాధారణ ప్రజల్లా టీవీ చూస్తూ ఫోన్లలో బెట్టింగ్‌లు
పోలీసులకు చిక్కకుండా ఎక్కడికక్కడ ప్రణాళికలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలోని లోటస్ ల్యాండ్‌మార్క్‌కు చెందిన పరి‘పూర్ణ’మైన బుకీ కనుసన్నల్లో బెట్టింగ్ బాగోతాలు నడుస్తున్నాయి. వరల్డ్ చాంపియన్ ట్రోఫీ తుది మ్యాచ్ ఆదివారం జరగనుండగా, ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్‌లు నిర్వహించడానికి సర్వంసిద్ధం చేసుకున్నారు. కాగా, ఈ బెట్టింగ్‌లు నిర్వహించడానికి నగర శివారు ప్రాంతాలను ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
దశలవారీగా..
ఇండియా ఫైనల్స్‌కు చేరే ప్రతి మ్యాచ్‌ను క్రీడాభిమానులు చాలా ఉత్కంఠతో వీక్షిస్తారు. కొన్నిచోట్ల స్నేహితులంతా కలిసి ఇళ్లలో చూస్తారు. బ్యాచిలర్స్ రూమ్‌ల్లో టీవీలు ఏర్పాటు చేసుకుని చూస్తారు. బుకీల్లో చిట్టచివరన ఉండే రెండు దశల్లో ఉన్నవారు కూడా ఇలాగే సాధారణంగా మ్యాచ్ చూస్తూ బెట్టింగ్‌లు పెట్టేలా ఏర్పాట్లు చేసుకున్నారు. రూ.లక్షల్లో జరిగే బెట్టింగ్‌లను నిర్వహించడానికి ప్రత్యేక బృందాలు ఇప్పటికే సిద్ధమైపోయాయి.
అన్నింటిపైనా పందేలు
ఆట ప్రారంభానికి ముందు జరిగే హెడ్ అండ్ టాస్ ప్రక్రియ నుంచి జట్టు విజయం వరకు, అలాగే పరుగులు.. సిక్స్‌లు.. ఫోర్లు.. వికెట్.. క్యాచ్.. ఇలా అన్ని అంశాలపైనా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ బెట్టింగ్‌లకు సంబంధించి గూగుల్ ప్లేస్టోర్‌లో అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా బెట్టింగ్‌లను బుకీలు పరుగులు తీయిస్తున్నారు. లావాదేవీల కోసం డిజిటల్ అకౌంట్లను నిర్వహిస్తున్నారు. వాటి నిర్వహణకు ప్రత్యేకంగా కొంతమందిని వేతనాలు ఇచ్చి మరీ నియమించుకున్నారు. ఇలా చేయడం వెనుక ఓ ఎత్తుగడ ఉంది. పోలీసులకు చిక్కినప్పుడు వారు ఫోన్లను స్వాధీనం చేసుకుంటారు. పోలీసులు ఫోన్లను విశ్లేషించినప్పుడు ఈ లావాదేవీల వివరాలు తెలియకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వారికి ఆటతో ఏమాత్రం సంబంఽధం ఉండదు. పందేలను పరుగులు తీయించే వ్యక్తి వారికి సమాచారం ఇస్తాడు. దాన్నిబట్టి ఎవరెవరు ఏయే కేటగిరీలో పందెం కట్టారో రాసుకుంటారు. దానిపై వారు ఎంతెంత పందెం పెట్టారో నమోదు చేసుకుంటారు. ఇప్పటి వరకు జరిగిన డబ్ల్యూసీటీ మ్యాచ్‌లన్నింటి పైనా నగరానికి చెందిన ప్రముఖ బుకీలు భారీగానే బెట్టింగ్‌లు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఓ పరి‘పూర్ణ’వంతుడే సుమారు రూ.కోటి వరకు బెట్టింగ్‌లు నిర్వహించినట్టు పందెపురాయుళ్లలో చర్చ నడుస్తోంది. ఈ బెట్టింగ్‌ల్లో జరుగుతున్న వ్యవహారాలు బయటకు లీకవుతుండటంతో ప్రధాన బుకీలు వారి కింద పనిచేసే వారికి కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలిసింది. బెట్టింగ్‌లోకి కొత్తగా వచ్చే వారిని ఎలాంటి సిఫార్సు లేకుండా రప్పించవద్దని చెప్పినట్టు సమాచారం. ఆన్‌లైన్‌లో, ఫోన్లలో బెట్టింగ్‌లు పెట్టే వారి గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. బెట్టింగ్‌ల్లో బుకీలుగా వ్యవహరించే వారికి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. ఎవరైనా పోలీసులకు చిక్కితే వారికి ఇచ్చే కమీషన్లలో కోత విధించడం గానీ, ఇవ్వకపోవడం గానీ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
అంతా ఫోన్లలోనే..
బెట్టింగ్‌ల్లోకి ప్లంటర్లను దింపడానికి భారీగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో బుకీకి ఐదారు ఫోన్లు ఇచ్చారు. భవనానికి మెట్లు ఉన్నట్టుగా నెట్‌వర్క్‌ను దశలవారీగా ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా అన్ని ఏర్పాట్లు చేశామని బుకీలు ప్లంటర్లకు భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే బెట్టింగ్‌లో నిత్యం పాల్గొనే వారికి రహస్యంగా సమాచారం పంపారు. పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేసినా రెండు, మూడు దశల్లో ఉన్నవారు మాత్రమే చిక్కేలా ఎత్తులు వేసినట్టు తెలిసింది. ఆదివారం ఒక్కరోజే రూ.కోటి లక్ష్యంగా బెట్టింగ్‌లు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.