Share News

చురుగ్గా హైందవ శంఖారావం సభ ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:29 AM

కేసరపల్లి లైలా గ్రీన్‌ మెడోస్‌ ప్రాంగణంలో ఈనెల 5న నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభ ఏర్పాట్లు వేగంతంగా సాగుతున్నాయి.

చురుగ్గా హైందవ శంఖారావం సభ ఏర్పాట్లు
సభా ప్రాంగణం వద్ద భారీ స్టేజీ, స్ర్కీన్‌ ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

30 ఎకరాల్లో బహిరంగ సభ ..150 మంది స్వామీజీలు కూర్చునేందుకు వీలుగా భారీ స్టేజీ ..50 గ్యాలరీల్లో లక్ష కుర్చీలు

గన్నవరం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): కేసరపల్లి లైలా గ్రీన్‌ మెడోస్‌ ప్రాంగణంలో ఈనెల 5న నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభ ఏర్పాట్లు వేగంతంగా సాగుతున్నాయి. 30 ఎకరాల్లో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. 150మంది స్వామీజీలు కూర్చునేందుకు భారీ స్టేజీ నిర్మిస్తున్నారు. 50 గ్యాలరీల్లో లక్షకు పైగా కుర్చీలు వేస్తున్నారు. సభకు వచ్చిన వారు వీక్షించేందుకు 14 భారీ స్ర్కీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభాస్థలికి నాలుగు మార్గాల్లో వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్‌కు కంకిపాడు రోడ్డు, సావరగూడెం రోడ్డులో 150 ఎకరాలకుపైగా భూములను చదును చేస్తున్నారు. అక్కడ మార్కింగ్‌లు వేసి వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేపట్టారు. 3500 బస్సులు, 7రైళ్లు, 20వేల బైకులలో హిందూ కుటుంబీకులు వస్తున్నారని చెబుతున్నారు. రైళ్లల్లో వచ్చేవారికి ఉప్పులూరు స్టేషన్‌ వద్ద దిగి సభకు వచ్చేటప్పుడు అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మరుగు దొడ్లు ఏర్పాటు చేశారు. అయోధ్య రామాలయం ట్రస్టు కోశాధికారి గోవిందగిరి మహరాజ్‌తో పాటు దేశంలోనే ప్రధాన స్వామీజీలు హాజరుకానున్నారు. స్టేజీ మీద స్వామీజీలు మాత్రమే కూర్చుంటారు. ఏర్పాట్లను వీహెచ్‌పీ అఖిల భారత ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, కన్వీనర్‌ తనికెళ్ల సత్య రవికుమార్‌, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్యాలరీలను నిర్మించి కుర్చీలు వేశారు.

3 లక్షల మందిపైనే సభకొస్తారు

వీహెచ్‌పీ అఖిల భారత ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు

‘హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వాల చేతుల నుంచి దేవాలయాలను విముక్తి చేయించేందుకే ఈనెల 5న హైందవ శంఖారావం నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం. దీనికి రాష్ట్రం నుంచి అంకురార్పణ చేస్తున్నాం.’ అని విశ్వ హిందూ పరిషత్‌ అఖిల భారత ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు తెలిపారు. హైందవ శంఖారావానికి 3,500 బస్సులు, 7 రైళ్లు, 20వేల బైకులపై రాష్ట్ర నలుమూల నుంచి 3లక్షలకు పైగా హిందూ కుటుంబీకులు వస్తారని చెప్పారు. కేసరపల్లి లైలా గ్రీన్‌ మెడోస్‌ ప్రాంగణంలో జరగనున్న హైందవ శంఖారావం పోస్టర్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. బహిరంగ సభకు వచ్చే వారందరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని గంగరాజు తెలిపారు. హిందువులంతా సంఘటితంగా పోరాడేందుకు ఈ సభకు వస్తున్నారని, రాజకీయా లతో సంబంధం లేదని క్షేత్ర సంఘటన కార్యదర్శి సత్యం పేర్కొన్నారు. వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్‌, రాష్ట్ర కోశాధికారి దుర్గాప్రసాద్‌ రాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 01:29 AM