నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల దందా!
ABN , Publish Date - Feb 03 , 2025 | 01:40 AM
బెజవాడ పాతబస్తీలో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల దందా వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీలో చదువుకోకపోయినా ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇప్పిస్తామంటూ నమ్మబలికి రూ.లక్షలు గుంచుతున్న ముఠా దందా బహిర్గతమైంది. సర్టిఫికెట్లు తీసుకున్నన వారిలో కొందరు వన్‌టౌన్‌లోని కేబీఎన్ కాలేజీలోను, కృష్ణా యూనివర్సిటీలోనూ పరిశీలించడంతో అవి నకిలీవని తేలింది. దీంతో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. బాధిత యువకులు కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ ధైర్యంగా ముందుకు రావటంతో ముఠా దందా వెలుగులోకి వస్తోంది.

కృష్ణా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్లకు నకిలీ మకిలి
యువకులను మభ్యపెట్టి నకిలీ ధ్రువీకరణ పత్రాలు అంటకట్టిన ముఠా .. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు
కొత్తపేటలోని ఓ నెట్ సెంటర్‌లో తయారీ?
ప్రశ్నించిన యువకులకు బెదిరింపులు
(ఆంరఽధజ్యోతి-వన్‌టౌన్): జగ్గుపిళ్ల ఈశ్వర్ సాయి గణేష్ అనే విద్యార్థికి కృష్ణా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాకరపర్తి భావన్నారాయణ కాలేజీ(కేబీఎన్) పేరుతో డిగ్రీ సర్టిఫికెట్‌ను ముఠా అంటకట్టింది. గణేష్ ఒక్కరే కాకుండా అనేక మంది నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు పొందినట్టు తెలుస్తోంది. ఇందులో తమ తప్పేమీ లేదని, తమను మభ్యపెట్టడం వల్లనే డబ్బులు చెల్లించామని, పోలీసులకు అన్ని వాస్తవాలు చెబుతామని బాధితులు అంటున్నారు. కృష్ణా యూనివర్సిటీనే కాకుండా ఐఎ్‌సబీఎం యూనివర్సిటీ పేరుతోనూ యువకులకు డిగ్రీ సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా వెలుగుచూసింది. ఇంకా అనేక యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను పొందినట్టుగా విద్యార్థులు చెబుతున్నారు.
ముఠా సూత్రధారి ఉపాధ్యాయుడు..
కొత్తపేట నెహ్రూబొమ్మ సెంటర్‌లోని ఓ నెట్ సెంటర్ కేంద్రంగా ఈ బాగోతం నిర్వహిస్తున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. నకిలీ సర్టిఫికెట్ల ముఠా సూత్రధారుడు గతంలో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసినట్టు తెలుస్తోంది. గతంలో వన్‌టౌన్‌లోని రాకేష్ పబ్లిక్ స్కూల్‌లో ఏడో తరగతి కామన్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీక్‌లో కూడా ఇతను సూత్రధారి అని తెలుస్తోంది. ఏ డిగ్రీ కావాలన్నా ఇట్టే తయారు చేసి ఇచ్చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. తమకు మాత్రం ఒరిజినల్ యూనివర్సిటీ సర్టిఫికెట్ అని చెప్పి డబ్బులు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. ఇందుకు గాను ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.60 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారని చెబుతున్నారు. తమ చేతికి వచ్చిన సర్టిఫికెట్లు నకిలీవని తేలడంతో మోసపోయిన విషయం అర్థమైందని అంటున్నారు. తమను మభ్యపెట్టి నకిలీ ధ్రువీకరణ పత్రాలు అంటకట్టారని వాపోతున్నారు.
పంజా సెంటర్‌కు చెందిన వ్యక్తి ప్రధాన సూత్రధారి
నకిలీ సర్టిఫికెట్ల ప్రధాన సూత్రధారి పంజా సెంటర్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఇతను పలు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఐడీ కార్డు తగిలించుకుని హవా సాగిస్తున్నాడని సమాచారం. ఇతని సోదరుడు ఒకరు పోలీసు శాఖలో పనిచేస్తుండడంతో అతని పేరు చెప్పి తనను నకిలీ సర్టిఫికెట్ల గురించి అడిగిన వారిపై బెదిరింపులకు దిగుతున్నాడని విద్యార్థులు చెబుతున్నారు.
నకిలీవి అని తేల్చిన కేబీఎన్ యాజమాన్యం, కృష్ణా యూనివర్సిటీ
జగ్గుపిళ్ల ఈశ్వర్ సాయి గణేష్‌కు కేబీఎన్ కాలేజీ పేరిట జారీ అయిన డిగ్రీ సర్టిఫికెట్‌పై కాలేజీ యాజమాన్యాన్ని వివరణ కోరగా నకిలీవని తెలిపింది. దీనిపై కృష్ణా యూనివర్సిటీ అధికారులను వివరణ కోరగా నకిలీ సర్టిఫికెట్ అని వారు కూడా తేల్చి చెప్పారు.