రీసర్వే చిచ్చు..!
ABN , Publish Date - Feb 11 , 2025 | 12:42 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జగనన్న రీసర్వే పచ్చటి కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. భూ కొలతల్లో తేడాలు వివాదాలను సృష్టిస్తున్నాయి. జిల్లాలో 3 వేలకు పైగా జగనన్న రీసర్వే అభ్యంతరాలు రాగా, అవి పరిష్కారానికి నోచుకోకపోగా, కొత్త వివాదాలకు కారణమవుతున్నాయి. మైలవరంలో శనివారం జరిగిన రైతు హత్య వెనుక జగనన్న రీసర్వే నిర్వాకాలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రీసర్వే సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే మరిన్ని విపరీత పరిణామాలకు దారితీసే అవకాశముంది.
గత ప్రభుత్వ జగనన్న రీసర్వేలో లోపాలు
పచ్చటి కుటుంబాల్లో కన్నీటి కల్లోలాలు
జిల్లావ్యాప్తంగా 3 వేల అపరిష్కృత అర్జీలు
నానాటికీ పెరుగుతున్న రైతుల వివాదాలు
ములకలపెంటలో హత్య కూడా ఈ కోవలోనిదే..
రెండు కుటుంబాల్లో నాడు మొదలైన వివాదం
నేడు ఒకరిని హత్య చేసే వరకు..
మైలవరం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న రీసర్వే పుణ్యమా అని తలెత్తిన భూ వివాదం కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఓ కుటుంబం యజమానిని కోల్పోయింది. మైలవరం మండలం మొర్సుమల్లి శివారు ములకలపెంట గ్రామంలో కడియం భాగ్యలక్ష్మికి, మొర్సుమల్లికి చెందిన చల్లా సుబ్బారావుకు పక్కపక్కనే పొలాలున్నాయి. 2003లో ములకలపెంట గ్రామాన్ని జగనన్న రీ సర్వేలో ఆదర్శ గ్రామంగా తీసుకున్నారు. అప్పట్లో జరిగిన రీసర్వేలో చల్లా సుబ్బారావు పొలంలో కడియం భాగ్యలక్ష్మికి చెందిన 47 సెంట్లు ఉన్నట్లు తేల్చారు. దీంతో యజమానులిద్దరూ వారున్న పొజిషన్ భూమికి హద్దులు వేసి 47 సెంట్ల భూమికి ప్రత్యేకంగా ఎల్‌పీఎం నెంబరు ఇచ్చి అనుభవదారుడిగా చల్లా సుబ్బారావు, పట్టాదారుడిగా భాగ్యలక్ష్మిని చూపారు. ఎన్టీఏ ప్రభుత్వం రాగానే జగనన్న రీసర్వే గ్రామాల్లో మళ్లీ సర్వే చేపట్టేందుకు ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తే అందులో భాగ్యలక్ష్మి భర్త శ్రీనివాసరావు అర్జీ పెట్టుకున్నారు. దీనిపై డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐలు రీవెరిఫికేషన్ చేశారు. ‘చల్లా సుబ్బారావు రెస్పాండ్ కావడం లేదు. మీరు ఆర్డీవో కోర్టులో అర్జీ పెట్టుకోండి..’ అని శ్రీనివాసరావుకు లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు. ఇక్కడే భాగ్యలక్ష్మి భర్తకు, చల్లా సుబ్బారావుకు మధ్య వివాదం రేగింది. ఈ నేపథ్యంలో శనివారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు శ్రీనివాసరావును గమనించగా, శరీరంపై గాయాలు కనిపించాయి.
జాతీయ రహదారి దిగ్బంధం
మృతుడు శ్రీనివాసరావుపై గాయాలను గమనించాక స్థానికులు దీనిని హత్యగా భావించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాసరావు మృతదేహాన్ని మైలవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, శ్రీనివాసరావును పథకం ప్రకారం హత్య చేశారని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని సోమవారం ఇబ్రహీంపట్నం-చత్తీస్‌ఘడ్ 30వ నెంబరు జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించి నిరసన తెలిపారు. సీఐ చంద్రశేఖర్, ఎస్సై సుధాకర్‌లు అక్కడకు చేరుకుని... న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చల్లా సుబ్బారావు ఇంట్లో పనిమనిషి అయిన వడ్లమూడి సంసోన్‌ను ఏ1 ముద్దాయిగా, చల్లా సుబ్బారావును ఏ2గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
నిందితులను అరెస్టు చేయాలి
నా భర్తను హత్య చేసిన నిందితులను తక్షణం అరెస్టు చేసి మాకు న్యాయం చేయండి. పథకం ప్రకారమే నా భర్తను చంపేశారు. కుటుంబం దిక్కు లేనిదైంది. ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. ఉన్నతాధికారులు కలగజేసుకోవాలి. - భాగ్యలక్ష్మి, మృతుడి భార్య