Share News

పక్కా ప్లాన్‌తో..

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:36 AM

ఎనికేపాడులోని గోడౌన్‌లో ఇన్‌గ్రాం ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన యాపిల్‌ ఫోన్లను దొంగిలించిన కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆరుగురు సభ్యులున్న గ్యాంగ్‌తో చోరీ చేయించడం వెనుక ఉత్తరప్రదేశ్‌కు చెందిన సూత్రధారి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. యూట్యూబర్‌గా ఉన్న రంజిత అనే యువకుడు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ గ్యాంగ్‌ ఇక్కడ చోరీ చేసినట్టు గుర్తించారు.

పక్కా ప్లాన్‌తో..
యూపీ గ్యాంగ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను చూపిస్తున్న సీపీ రాజశేఖరబాబు, ఇతర పోలీసులు అధికారులు

ఎనికేపాడు గోడౌన్‌లో సెల్‌ఫోన్ల చోరీ కేసులో నిజాలు

ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌కు సహకరించిన యూట్యూబర్‌

కీలక సూత్రధారి అతనేనని తేల్చిన పోలీసులు

దొంగిలించిన ఫోన్లు నేపాల్‌లో విక్రయించడానికి స్కెచ్‌

బిహార్‌లో పట్టుబడిన నిందితులను తీసుకొచ్చిన బెజవాడ పోలీసులు

విజయవాడ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : ఎనికేపాడులోని గోడౌన్‌లో ఇన్‌గ్రాం ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన యాపిల్‌ ఫోన్లను దొంగిలించిన కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆరుగురు సభ్యులున్న గ్యాంగ్‌తో చోరీ చేయించడం వెనుక ఉత్తరప్రదేశ్‌కు చెందిన సూత్రధారి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. యూట్యూబర్‌గా ఉన్న రంజిత అనే యువకుడు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ గ్యాంగ్‌ ఇక్కడ చోరీ చేసినట్టు గుర్తించారు. ఈనెల ఐదో తేదీ అర్ధరాత్రి ఎనికేపాడులో ఉన్న గోడౌన్‌ నుంచి యాపిక్‌, వివో బ్రాండ్లకు చెందిన ఫోన్లు, యాక్సలరీస్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌ చోరీ చేసిన విషయం తెలిసిందే. ఆ నిందితులను బిహార్‌ నుంచి పీటీ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. వారి నుంచి రూ.2.52 కోట్ల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీలు తిరుమలేశ్వరరెడ్డి, గౌతమీషాలి, క్రైమ్స్‌ ఏడీసీపీ రాజారావుతో కలిసి కమిషనరేట్‌లోని సమావేశపు హాల్లో శుక్రవారం వెల్లడించారు.

గ్యాంగ్‌గా కలిసి..

ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ జిల్లా జలాల్‌పూర్‌కు చెందిన దీప్‌చంద్ర ప్రజాపతి, సునీల్‌ కుమార్‌ సరోజ్‌, బ్రిజేష్‌ కుమార్‌ ఉగ్రా, సుంగున్‌పూర్‌కు చెందిన మాయా జైప్రకాష్‌ పటేల్‌, బస్గారా గ్రామానికి చెందిన మిథిలేష్‌ కుమార్‌, బోడిపూర్‌కు చెందిన సురేంద్ర కుమార్‌ పటేల్‌ స్నేహితులు. ప్రజాపతి ఇంటర్‌ వరకు చదువుకుని సొంతంగా కారు ట్రావెల్స్‌ ఏర్పాటు చేసుకున్నాడు. యూపీ62సీకే 1404 కారు నడుపుతున్నాడు. జై ప్రకాష్‌ కూలీ పనులు చేసుకుంటూ చోరీలు చేసేవాడు. అతడిపై ఎక్కడా కేసులు నమోదు కాలేదు. సునీల్‌కుమార్‌ సరోజ్‌, బ్రిజేష్‌ కుమార్‌ ఉగ్రా ఆర్టీవో కార్యాలయంలో ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి చోరీలు చేసేవారు. సురేంద్ర కుమార్‌ పటేల్‌ కూలీ పనులు చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆరుగురు కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు.

సరిహద్దులు దాటితే చాలనుకుని..

నిందితులకు స్కెచ్‌ ఇచ్చిన రంజిత ఇంకా అనేక విషయాలు వివరించాడు. సరుకుతో ఆంధ్రా సరిహద్దు దాటేయండి, ఆ తర్వాత ఎవరూ పట్టుకోలేరని చెప్పాడు. సెల్‌ఫోన్ల చోరీని ఆంధ్రా పోలీసులు పెద్దగా పట్టించుకోరని సలహా ఇచ్చాడు. దీంతో ఈ ఆరుగురు ఎనికేపాడులోని గోడౌన్‌లో చోరీ చేసి వెళ్లిపోతుండగా, బిహార్‌ సరిహద్దులో సాసారం వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారిని అక్కడ కోర్టులో హాజరుపరిచాక పీటీ వారెంట్‌పై ఇక్కడికి తీసుకొచ్చారు. బిహార్‌ పోలీసులు విచారించినప్పుడు తమ వెనుక సురేంద్రకుమార్‌ అనే వ్యక్తి ఉన్నాడని చెప్పిన నిందితులు విజయవాడ పోలీసులకు రంజిత పేరును వెల్లడించారు. ఈ రంజిత కుమార్‌ తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.

రంజిత ఎక్కడ?

ఈ ఆరుగురిలో ప్రజాపతి ఓ ప్రతిపాదన చేశాడు. తన కారులో వివిధ రాషా్ట్రలు తిరుగుతూ చోరీలు చేద్దామని, దానికయ్యే ఇంధనం ఖర్చును మిగిలిన ఐదుగురు భరించాలని చెప్పాడు. దీంతోపాటు కాజేసిన సొత్తును విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తంలో వాటా ఇవ్వాలని ప్రతిపాదించాడు. దీనికి మిగిలిన వారంతా అంగీకరించారు. ఈ తరుణంలో యూపీకి చెందిన యూట్యూబర్‌ రంజిత వారికి పరిచయమయ్యాడు. సాంకేతికంగా నైపుణ్యంగా ఉన్న అతడు ఈ గ్యాంగ్‌కు ఎనికేపాడులో ఉన్న గోడౌన్‌ లొకేషన్‌ ఇచ్చాడు. అందులో సెల్‌ఫోన్లు ఉంటాయని, వాటిని కాజేసి తీసుకొస్తే నేపాల్‌లోని ఖట్మాండులో విక్రయించేద్దామని ప్రతిపాదించాడు.

Updated Date - Feb 15 , 2025 | 12:36 AM