10న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:12 AM
కలెక్టరేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ వాల్‌పోస్టర్, కరపత్రాలను వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశఆవిష్కరించారు.

సమష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
అధికారులతో సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
ఎన్టీఆర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ‘జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 10వ తేదీన నిర్వహించే ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని అధికారులంతా సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థల్లోను కార్యక్రమం తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలి. కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ విద్యార్థులకు నులి పురుగుల మాత్రలను ఉచితంగా పంపిణీ చేయాలి.’ అని అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ వాల్‌పోస్టర్, కరపత్రాలను వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఆయన ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల జిల్లాస్థాయి అధికారులతో నేరుగా, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ‘ఈనెల 10న 1-19 ఏళ్ల వయస్సు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ జరుగుతుంది. తమ పిల్లలు మాత్రలు తీసుకునేలా తల్లిదండ్రులు చూడాలి. 1-2 ఏళ్ల చిన్నారులకు సగం మాత్ర(200 మి.గ్రా), ఆపైన 19 ఏళ్ల వరకు ఒక మాత్ర (400 మి.గ్రా) ఇవ్వాలి. ఆల్బెండజోల్ సురక్షితమైన మాత్ర. బాగా చప్పరించి, శుభ్రమైన తాగునీటితో మింగాలి. ఈనెల 10న మాత్రలు తీసుకోకుండా మిగిలిపోయిన వారికి 17న మాత్రలు ఇస్తాం.’ అని కలెక్టర్ వివరించారు. మాత్రల పంపిణీ అనంతరం చేతుల శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, జడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీసీహెచ్‌ఎస్ బీసీకే నాయక్, డీపీవో పి.లావణ్యకుమారి, డీఈవో యూవీ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ డి. శ్రీలక్ష్మి, జిల్లా రాష్ర్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి, ప్రోగ్రాం ఇన్‌చార్జి డాక్టర్ మాధవినాయుడు పాల్గొన్నారు.
పేదరికాన్ని నిర్మూలనకు కృషి చేద్దాం
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ విజయానంద్
ఎన్టీఆర్ కలెక్టరేట్: పేదరికాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అందరం పనిచేద్దామని కలెక్టర్లు, వివిధ శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ దిశానిర్దేశం చేశారు. శూన్య పేదరికం, పీ-4 విధానం తదితరాలపై కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియా కాన్ఫరెన్సు (వీసీ) నిర్వహించారు. పేదరికాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వ ప్రణాళికలను ఆయన వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటినీ ప్రగతి పథంలో నడిపించి, అందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన పీ-4 పాలసీపై అవగాహన కల్పించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ లక్ష్మీశ, సీపీవో వై.శ్రీలత, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీకుమార్, డీపీవో పి.లావణ్యకుమారి, వీఎంసీ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.