Share News

రుణం తీర్చుకున్నారు

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:22 AM

తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉండడాన్ని చూసి చలించిపోయారు ఆ దంపతులు. వసతుల లేమితో విద్యార్థులు ఇబ్బంది పడడాన్ని ప్రత్యక్షంగా చూసి పాఠశాల అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. తమ ఉన్నత స్థితికి పునాదైన ఆ పాఠశాల రుణం తీర్చుకునేందుకు ముందుకు కదిలారు. ఖర్చుకు వెనుకాడకుండా తరగతి గదుల నిర్మాణంతో పాటు అన్ని వసతులూ కల్పించారు. వారి చేయూతతో నేడు ఆ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయి సర్వాంగ సుందరంగా తయారయింది. కంచికచర్ల మండలం మోగులూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల రూపురేఖలు మార్చి న లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో డాక్టర్‌ చావా సత్యనారాయణ- నాగరాణి దంపతులు అందరి ప్రశంస లందుకుంటున్నారు.

రుణం తీర్చుకున్నారు
సర్వాంగ సుందరంగా మోగులూరు హైస్కూల్‌

చదువుకున్న బడిలో రూ.6 కోట్లు పైగా ఖర్చు పెట్టి అన్ని సదుపాయాలూ కల్పించారు

లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో చావా సత్యనారాయణ-నాగరాణి దంపతుల ఆర్థిక చేయూత..మారిన మోగులూరు హైస్కూల్‌ రూపురేఖలు

(ఆంధ్రజ్యోతి - కంచికచర్ల)

మోగులూరు హైస్కూల్‌ భవనాన్ని 1962లో నిర్మించారు. భవనం శిథిలావస్థకు చేరింది. ప్రమాదం పొంచి ఉండటంతో భవనాన్ని తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పాఠశాలలో సై న్సు ల్యాబ్‌లు లేవు. తాగునీటి సదుపాయం లేదు. బోర్‌వెల్‌ లేకపోవడంతో వాడుక నీరు కూడా లేదు. టాయిలెట్లు లేవు. విశాలమైన ఐదు ఎకరాల ఆవరణ ఉన్నప్పటికీ ఆటలకు అనువుగా లేదు. ఆవరణ లోతట్టుగా చెట్లు, పిచ్చి మొక్కలతో చిట్టడవిగా ఉండేది.

రూ.4.70 కోట్లతో తరగతి గదులు, ల్యాబ్‌లు

మున్నలూరు గ్రామానికి చెందిన లారస్‌ లాబ్స్‌ సీఈవో డాక్టర్‌ చావా సత్యనారాయణ, ఆయన సతీమణి నాగరాణి దంపతులు మోగులూరు పాఠశాలలోనే విద్యనభ్యసించారు. పాఠశాల దుస్థితిని మోగులూరు, మున్నలూరు గ్రామాలకు చెందిన పలువురు చావా సత్యనారాయణ దృష్టికి తీసుకెళా ్లరు. బాగు చేయాల్సిందిగా కోరారు. వెంటనే వారు సానుకూలంగా స్పందించారు. దీనస్థితికి చేరుకున్న పాఠశాల అభివృద్ధికి ఆర్థిక సాయం అందించారు. రూ.4.70 కోట్లతో తరగతి గదులు, ఫిజిక్స్‌, బయాలజీ ల్యాబ్‌లు, రూ.49 లక్షలతో ప్రహరీ, రూ.25 లక్షలతో పాఠశాలకు రెండు వైపులా నాలుగు వందల మీటర్ల సిమెంట్‌ రోడ్లు నిర్మించారు. రూ.37.5 లక్షలతో ఆవరణ బాగుచేసి గ్రావెల్‌తో మెరక చేశారు. మధ్యాహ్న భోజనం కోసం కిచెన్‌రూమ్‌ నిర్మించారు. తాగునీటి కోసం ప్రత్యేకంగా బోర్‌వెల్‌ వేసి, 15వందల లీటర్ల సామర్థ్యం ఉన్న ఆర్వోప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బాలబాలికలకు విడివిడిగా టాయిలెట్ల సదుపాయం కల్పించారు.

ప్రారంభించేందుకు సన్నాహాలు

ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌, హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా నూతన భవనాలను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విద్యాశాఖాధికారులు శుక్రవారం పాఠశాలకు వచ్చి పరిశీలించి వెళ్లారు. ఈనెల ఆరో తేదీన కార్యక్రమం ఖరారైందని చెబుతున్నారు. అయితే అధికారిక సమాచారం లేదు. మోగులూరుతో పాటుగా మున్నలూరు, కునికినపాడు గ్రామాలకు అందుబాటులో ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తు తం 16 మంది ఉపాధ్యాయులు, 314 మంది విద్యార్థులున్నారు.

Updated Date - Jan 04 , 2025 | 01:23 AM