Share News

దర్శనాల దళారీ..!

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:39 AM

దుర్గమ్మ దర్శనం అంటే సామాన్యులకు ఓ ప్రహసనమే. అదే.. వీఐపీ లైన్‌లో వచ్చే భక్తులకు మాత్రం దర్శనం మాత్రం చాలా తేలిక. సామన్యులైతే టికెట్‌ కొని, గంటల తరబడి క్యూలో నిలబడి సరిగ్గా అమ్మవారిని చూసేసరికి సిబ్బంది, సెక్యూరిటీ చేయి పట్టుకుని లాగేస్తారు. అదే ఎలాంటి టికెట్‌ కొనకుండా ప్రధాన ఆలయం వెనుక నుంచి వచ్చిన వారిని మాత్రం రాచమర్యాదలతో అంతరాలయంలోకి ఆహ్వానిస్తారు. ఈ తతంగం మొత్తం వెనుక ఓ వ్యక్తి చక్రం తిప్పుతుండగా, అమ్మ సన్నిధిలో పవిత్రంగా ఉండాల్సిన సిబ్బంది కాసుల మత్తులో అవినీతి రాక్షసుల అవతార మెత్తుతు న్నారు.

దర్శనాల దళారీ..!
డిప్యూటీ శ్రీనివాస్‌

  • దుర్గగుడిలో వీఐపీ దర్శనాల ముసుగులో దందా

  • ప్రైవేట్‌ వ్యక్తితో ఆలయ సిబ్బంది దోస్తీ

  • దుర్గాఘాట్‌లో స్థావరం.. భక్తులతో బేరాలు

  • 8 మందికి తగ్గకుండా ఉన్న భక్తులే టార్గెట్‌

  • ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.500 వసూలు

  • సదరు భక్తులకు తోడుగా కొండపైకి ఓ వ్యక్తి

  • స్కానింగ్‌ సెంటర్‌ వద్ద 8 మంది భక్తులకు రెండే టికెట్లు

  • మిగతా మొత్తం ప్రైవేట్‌ వ్యక్తి ఖాతాలోకి..

  • ఆ తర్వాత సిబ్బందికి ఆన్‌లైన్‌ పేమెంట్‌

  • మొత్తం 33 మంది సిబ్బందితో లావాదేవీలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/వన్‌టౌన్‌) : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వస్తున్న వారిలో కొంతమంది ఎలాంటి టికెట్లు కొనరు. వారికి ప్రొటోకాల్‌ ఉండదు. అయినా అంతకుమించి దర్శనాలు జరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణం.. స్కానింగ్‌ పాయింట్‌ సిబ్బంది నుంచి ఆలయంలో పనిచేసే వారి వరకు దళారీలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే. అమ్మవారి చెంత భక్తిశ్రద్ధలతో వ్యవహరించాల్సిన సిబ్బంది దళారీలతో దోస్తీ కడుతున్నారు. అనధికార దర్శనాల ద్వారా నెలకు లక్షలాది రూపాయలు వెనుకేసుకుంటున్నారు. ఆలయ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడిన ఓ దళారీ ఫోన్‌ను పరిశీలిస్తే అందులో 60-70 మంది ఆలయ సిబ్బంది ఫోన్‌ నెంబర్లు ఉన్నాయి. వారితో కొంతమందితో మాట్లాడినట్టుగా డయల్‌ లిస్ట్‌ చూపిస్తోంది.

‘స్కానింగ్‌’లో అసలు దొంగలు

అనధికారికంగా దర్శనాలు చేయిస్తున్న వ్యక్తిని దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది రెండు రోజుల క్రితం పట్టుకున్నారు. కానూరుకు చెందిన కురిజిల్లి శ్రీనివాస్‌ అలియాస్‌ డిప్యూటీ శ్రీనివాస్‌ ఇంద్రకీలాద్రిపై కొన్నాళ్ల క్రితం కొబ్బరికాయల వ్యాపారం చేసేవాడు. ఈ సమయంలో ఆలయంలో పనిచేసే సిబ్బందితో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయాన్ని ఆలయంలో దర్శనాల కోసం ఉపయోగించుకుంటున్నాడు. కొన్ని నెలలుగా ప్రైవేట్‌ వ్యక్తులను పదుల సంఖ్యలో తీసుకొచ్చి ఎలాంటి టికెట్‌ లేకుండా వీఐపీ దర్శనాలు చేయిస్తున్నాడు. శ్రీనివాస్‌ దర్శనానికి పంపే వ్యక్తుల సంఖ్య పదికి తగ్గదు. ఆయన కొండపై కనిపించేది తక్కువే అయినా ఆయన పంపిన భక్తులకు మాత్రం వీఐపీకి మించిన స్థాయిలో దర్శనాలు జరుగుతాయి. ఇతనిపై ఎప్పటినుంచో నిఘా పెట్టగా, కనకదుర్గానగర్‌లో బుధవారం భక్తులను దర్శనానికి సిద్ధం చేస్తుండగా ఏఈవో జంగం శ్రీనివాస్‌, మరికొందరు ఉద్యోగులు అతడ్ని పట్టుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శ్రీనివాస్‌ ఫోన్‌ను పరిశీలించగా, ఆలయంలో పనిచేసే కొంతమంది సిబ్బందికి గూగుల్‌, ఫోన్‌పే ద్వారా నెలవారీగా వేలల్లో నగదును పంపినట్టు గుర్తించారు. మొత్తం 60-70 మంది సిబ్బంది ఫోన్‌ నెంబర్లు సదరు ‘డిప్యూటీ’ ఫోన్‌లో ఉన్నాయి. వారిలో చాలామందికి నెలవారీగా డబ్బు పంపినట్టు గూగుల్‌, ఫోన్‌పేల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్కానింగ్‌ విభాగంలో పనిచేసే వారికి ఈ చెల్లింపులు చేసినట్టు తెలిసింది. ఇంజనీరింగ్‌ విభాగంలో పదిమంది, అన్నదాన విభాగంలో ఇద్దరు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, మైక్‌ ప్రచార విభాగంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, సమాచారం కేంద్రంలో పనిచేస్తున్న ఒకరు, ఆలయంలో పనిచేస్తున్న ఒకరు, బోయలుగా పనిచేస్తున్న వారిలో ముగ్గురు.. ఇలా మొత్తం 33 మందితో శ్రీనివాస్‌ లావాడేవీలు నిర్వహిస్తున్నట్లు ఫోన్‌పే ద్వారా తెలిసింది.

దుర్గాఘాట్‌లో బేరాలు

శ్రీనివాస్‌ ఇంద్రకీలాద్రిపై ఎక్కడా కనిపించడు. మోడల్‌ గెస్ట్‌హౌస్‌ పక్కన ఉన్న దుర్గాఘాట్‌ అతడి స్థావరం. కానూరు నుంచి నిత్యం ఉద్యోగి మాదిరిగా అక్కడికి వస్తాడు. దుర్గాఘాట్‌లో ఉన్న భక్తుల మధ్య తిరుగుతుంటాడు. ఎవరైనా దర్శనాల గురించి మాట్లాడుకుంటుంటే విని వారితో మాటలు కలుపుతాడు. ఎంతమంది ఉన్నా వీఐపీ దర్శనాలు చేయిస్తానని చెబుతాడు. వారి నుంచి ఎంతమంది దర్శనానికి వెళ్తారో అంతమంది నుంచి రూ.500 చొప్పున డబ్బు వసూలు చేస్తాడు. ఎంతమంది దర్శనానికి వస్తున్నారో ఆ విషయాన్ని స్కానింగ్‌ పాయింట్‌లో ఉన్న ఉద్యోగికి చెప్తాడు. వారు అతడి వద్దకు వెళ్లినప్పుడు స్కానింగ్‌ సిబ్బంది వారి చేతిలో రెండు, మూడు టికెట్లు మాత్రం చేతిలో పెట్టి ఎంతమంది ఉంటే అంతమందిని క్యూలోకి పంపుతారు. ఇదికాకుండా ఒక వ్యక్తిని భక్తులకు అప్పగించి కొండపైకి పంపుతాడు. అతడు వారిని స్కానింగ్‌ పాయింట్‌ వరకు తీసుకెళ్లి అక్కడున్న సిబ్బందికి విషయాన్ని చెబుతాడు. ఉదాహరణకు ఎనిమిది మంది భక్తులు దర్శనానికి వస్తే రెండు టికెట్లు వారి చేతిలో పెడతారు. దర్శనానికి ఎనిమిది మందిని పంపుతారు. వారి నుంచి మాత్రం రూ.4 వేలను వసూలు చేస్తారు. దేవస్థానంలో సిబ్బంది విధులకు ఓ చార్ట్‌ ఉంటుంది. షిఫ్ట్‌లవారీగా విధులు నిర్వర్తిస్తారు. ఈ విధులు వారానికోసారి మారుతుంటాయి. ఎవరు, ఏ వారం, ఏ షిఫ్ట్‌లో ఉన్నారో శ్రీనివాస్‌కు పూర్తి సమాచారం ఉంటుంది. దాని ప్రకారం వ్యవహారాలు చక్కబెడతాడు. ఇలా సదరు ‘డిప్యూటీ’ రోజుకు రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నాడు. పండుగలు, పర్వదినాలు, శుక్ర, శని, ఆదివారాల్లో దుర్గఘాట్‌, కనకదుర్గానగర్‌లో ఈ దందాకు పాల్పడుతున్నారు.

పోలీసులకు ఫిర్యాదు

శ్రీనివాస్‌ దర్శనాల దందాపై ఏఈవో జంగం శ్రీనివాసరావు గురువారం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో దళారీ శ్రీనివాస్‌తో దోస్తీ కట్టిన వారి బాగోతాలు వెలుగులోకి వస్తాయని సిబ్బంది అంతా భయపడిపోతున్నారు. ఆలయంలో స్కానింగ్‌ పాయింట్‌పై కొన్నాళ్లుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటికి నిదర్శనమే తాజా సంఘటన.

కొరవడిన నిఘా

ఆలయంలో దళారీలపై ‘ఆంధ్రజ్యోతి’ పలుమార్లు కథనాలు ప్రచురించింది. వీరంతా ఆలయంలో యథేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ వన్‌టౌన్‌ పోలీసులు కానీ, దేవస్థానం సిబ్బంది కానీ పట్టించుకోవట్లేదు. ఇలా దేవస్థానంలో 15 మందికి పైగా దళారులు తిష్ట వేసి అనధికారికంగా భక్తులను దర్శనాలను తీసుకెళ్తున్నా ఎవరూ అడ్డుచెప్పరు. దీనివల్ల ఆలయ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దళారుల బెడదకు చెక్‌ పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:39 AM