‘పట్టు’బడ్డారు
ABN , Publish Date - Feb 13 , 2025 | 01:13 AM
రూ.5,900 ధర కలిగిన ధోవతి స్థానే కేవలం రూ.450 నుంచి రూ.600 విలువైన ధోవతి.. రూ.6 వేల విలువైన చీర స్థానే కేవలం రూ.1,000 చీర.. సాక్షాత్తూ జగన్మాత సన్నిధిలో అక్రమార్కులు ఆడిన పాపకార్యమిది. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు నిత్యం అలంకరించే పట్టుచీరల సరఫరాకు నిర్వహించిన టెండర్ల కిరికిరిలో నిజాలు ఇప్పటికి బయటపడ్డాయి. ఈ పాపంలో భాగస్వామి అయిన జూనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాసరెడ్డిని బుధవారం సస్పెండ్ చేశారు.

దుర్గమ్మ మూలవిరాట్ వసా్త్రల్లోనూ అవినీతి
టెండర్ సమయంలో నాణ్యత కలిగిన శాంపిళ్లు
సరఫరా చేస్తున్నది మాత్రం నాణ్యతలేనివి
రూ.5,900 ధోవతి స్థానే రూ.450 ధోవతి
రూ.6 వేల చీర స్థానే రూ.1,000 చీర
విచారణలో బయటపడిన నిజాలు
జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : అమ్మవారి మూలవిరాట్‌కు రోజూ ఏడు చీరలు అలంకరిస్తారు. వాటిని సరఫరా చేయటానికి గతంలో టెండర్లు ఆహ్వానించారు. 2024, ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు చీరలు సరఫరా చేయాలని పిలిచిన టెండర్లలో క్రోసూరుకు చెందిన శ్రీసాయి మణికంఠ ఏజెన్సీస్ 17 రకాలు, నగరంలోని బాలకృష్ణ శిల్క్స్ ఏడు రకాలు, కడపలోని నాగార్జున టెక్స్‌టైల్స్‌కు టెండర్లు దక్కాయి. వీరే టెండర్ ధర తక్కువ కోడ్ చేయటంతో చీరల సరఫరాకు అధికారులు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి.. టెండర్‌దారులు సరఫరా చేస్తున్న వస్ర్తాలు నాణ్యతగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు. జూనియర్ గుమాస్తా కె.శ్రీనివాసరెడ్డి వద్ద టెండర్‌దారులు మొదట్లో సమర్పించిన వస్ర్తాల శాంపిళ్లను, గోడౌన్‌లో ఉన్న వస్ర్తాలను పోల్చి చూడగా భారీ వ్యత్యాసం కనిపించింది. గుమాస్తా దగ్గర ఉన్న శాంపిల్ ఒకటైతే, టెండర్‌దారులు సరఫరా చేసిన చీరలు మరోలా ఉన్నాయి. విచారణ చేయగా ధరల్లో కూడా వ్యత్యాసం కనిపించింది. చీరల వెరిఫికేషన్ నిమిత్తం నియమించిన కమిటీ కూడా ఇదే నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం రూ.5,900 ధర కలిగిన ధోవతి స్థానే కేవలం రూ.450 నుంచి రూ.600 విలువైన వస్ర్తాలనే సరఫరా చేశారు. రూ.6 వేల విలువైన వస్త్రం స్థానే కేవలం రూ.1,000 చీర సరఫరా చేశారు. దీంతో దేవస్థానం అధికారులు.. జూనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాసరెడ్డిపై చర్యలకు ఆదేశించారు. పలు సెక్షన్ల కింద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నోటీసు ఇచ్చారు. ఏడు రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. అప్పటివరకు హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లరాదని పేర్కొంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వస్త్రసేవ కార్యక్రమంలో భక్తులు ఇచ్చిన చీరలను సరిగ్గా జమ చేయకుండా ఉండటంతో పాటు చీరల సంఖ్యలో కూడా తేడా రావటంతో ఈ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రాథమికంగా రుజువులు దొరకటంతో అతనిపై చర్యలకు ఈవో ఆదేశాలు జారీ చేశారు. విధులను సీనియర్ అసిస్టెంట్ పి.శిరీషకు అప్పగించారు.