Share News

తిట్టుకో.. తన్నుకో..

ABN , Publish Date - Feb 10 , 2025 | 12:57 AM

వైసీపీ పశ్చిమ నేతల కోల్డ్‌వార్‌ ఒక్కసారిగా భగ్గుమంది. వైసీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి ముందే వెలంపల్లి శ్రీనివాసరావు, షేక్‌ ఆసిఫ్‌ దాదాపు కొట్టుకునేంత వరకు వెళ్లారు. అరుపులతో మొదలై.. ఒకరినొకరు దూషించుకున్నారు. సుబ్బారెడ్డి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా వీలు పడలేదు. దీంతో సయోధ్య సమావేశాన్ని అర్ధంతరంగా వాయిదా వేసి ఇద్దరినీ వెళ్లిపోమని పంపించేశారు.

తిట్టుకో.. తన్నుకో..

పశ్చిమ వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు

సయోధ్య సమావేశంలో వెలంపల్లి, ఆసిఫ్‌ తిట్ల దండకాలు

వైవీ సుబ్బారెడ్డి వారించినా తగ్గలేదు

తొలుత తిట్లు.. ఆ తర్వాత కొట్టుకునే వరకు..

అర్ధంతరంగా ఆగిపోయిన సమావేశం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య అంతర్యుద్ధం ర చ్చకెక్కింది. విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అధికారపక్షంగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను కాపాడుకోవటానికి అధినేత జగన్‌ తాడేపల్లిలోని తన నివాసంలో విజయవాడ నగర నాయకులతో ఇటీవల సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందిన షేక్‌ ఆసిఫ్‌ హాజరు కాలేదు. వెలంపల్లి శ్రీనివాసరావు ఏకపక్ష నిర్ణయాలు, దుందుడుకు వ్యవహారాలపై అంతకుముందే జగన్‌కు ఆసిఫ్‌ ఫిర్యాదు చేశారు. ఆసిఫ్‌ గైర్హాజరు కావడంతో ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సమావేశం నిర్వహించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని వైవీ సుబ్బారెడ్డికి జగన్‌ బాధ్యత అప్పగించారు.

తిట్ల పురాణం నుంచి తన్నుకునే వరకూ..

వెలంపల్లి శ్రీనివాసరావు, షేక్‌ ఆసిఫ్‌ను వైవీ సుబ్బారెడ్డి ఆదివారం తాడేపల్లి పిలిపించారు. వెలంపల్లి తన వెంట ఎమ్మెల్సీ రూహుల్లాను కూడా తీసుకెళ్లారు. ఆసిఫ్‌ మాత్రం ఒంటరిగానే వెళ్లారు. ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం మధ్యాహ్నం 3 గంటల వరకు సాగింది. సమావేశం మొదలైనప్పటి నుంచి వెలంపల్లి, ఆసిఫ్‌ మధ్య అరుపులు తప్ప మాటల్లేవు. తనకు పశ్చిమ నియోజకవర్గంలో ఏమాత్రం విలువ ఇవ్వటం లేదని తెలిపినట్టు తెలిసింది. దీనిపై వెలంపల్లి స్పందిస్తూ అందరినీ కలుపుకొనే వెళ్తున్నామని, సొంత కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీకి దూరంగా ఉంటుంటే ఏం చేయగలమనడంతో వాదులాట ప్రారంభమైంది. ఈ గొడవ తిట్ల పురాణం అందుకునే స్థాయికి చేరింది. సుబ్బారెడ్డి వారించే ప్రయత్నం చేసినా వినలేదు. ఆసిఫ్‌ గట్టిగా ఎదురుదాడి చేస్తుండటంతో ఎమ్మెల్సీ రూహుల్లా కూడా జోక్యం చేసుకుని వెలంపల్లి తరఫున వాదించినట్టు సమాచారం. ఈ దశలో కొట్టుకునే పరిస్థితి రావడంతో సుబ్బారెడ్డి వారిని వారించే ప్రయత్నం చేశారు. చివరికి లాభం లేదని ఇద్దరిపై కోప్పడి బయటకు పంపించేశారు.

Updated Date - Feb 10 , 2025 | 12:57 AM