మెట్రోకు భూమి సేకరించండి
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:44 AM
జయవాడ మెట్రో ప్రాజెక్టు మొదటి దశ పనులకు అవసరమైన భూములను తక్షణం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కలెక్టర్ లక్ష్మీశను ఆదేశించింది.

కలెక్టర్ లక్ష్మీశకు ప్రభుత్వ ఆదేశాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ మెట్రో ప్రాజెక్టు మొదటి దశ పనులకు అవసరమైన భూములను తక్షణం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కలెక్టర్ లక్ష్మీశను ఆదేశించింది. ఫేజ్-1లో గన్నవరం నుంచి ఎన్‌హెచ్-16 మీదుగా రామవరప్పాడు రింగ్ రోడ్డు, ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్, పీఎన్‌బీఎస్ వరకు మెట్రో స్టేషన్లకు, పీఎన్‌బీఎస్ దగ్గర ప్రధాన స్టేషన్‌కు, కేసరపల్లిలో కోచ్ డిపోలకు 100 ఎకరాల భూములు అవసరమని ఇంతకుముందు ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ప్రభుత్వం ఇంతకుముందే భూ సేకరణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీఎల్) ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డితో కలెక్టర్ లక్ష్మీశ భేటీ అయ్యారు. భూ సేకరణ ఎంతమేర చేయాలో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మెట్రో మొదటి దశ పనులకు అవసరమైన భూములను సేకరించేందుకు జిల్లా యంత్రాంగం అడుగులు వేయనుంది. భూ సేకరణ నోటిఫికేషన్‌ను త్వరలోనే వెలువరించనుంది. భూ సేకరణకు సంబంధించి గతంలోనే మార్కింగ్ పనులు ఇప్పటికే చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నూరుశాతం నిధులు రాబట్టి, తద్వారా పనులు చేయించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చేలోపే ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో మెట్రోకు రూ.50 కోట్లు కేటాయించింది. దీనిని బట్టి మెట్రో మొదటి దశ పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.