Share News

మిర్చి సాగు ఖర్చు క్వింటాలుకు రూ.18 వేలయితేనే ప్రయోజనం

ABN , Publish Date - Feb 23 , 2025 | 01:28 AM

మిర్చికి ధర లేక కన్నీళ్లు పెడుతున్న రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కలిశారు. మిర్చి మార్కెట్‌, కుదేలైన రైతులను ఆదుకోవడంపై చర్చించారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం (ఎంఐఎస్‌) ద్వారా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. దీంతో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎంఐఎస్‌ పథకం ద్వారా మిర్చి పంట సాగు వ్యయానికి, మార్కెట్‌ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం చెల్లించనున్నది. అయితే క్షేత్రస్థాయిలో పంట వాస్తవ సాగు ఖర్చును పరిగణనలోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఎంత పకడ్బందీగా అమలు చేసినప్పటికీ ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనముండదని రైతాంగం కోరుతోంది.

మిర్చి సాగు ఖర్చు క్వింటాలుకు  రూ.18 వేలయితేనే ప్రయోజనం
పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతాలలో కల్లంలో ఆరబోసిన మిర్చి, తాలుకాయలు ఏరుతున్న కూలీలు

ఎంఐఎస్‌ అమలులో పరిగణనలోకి తీసుకోవాలని రైతుల డిమాండ్‌

కుదేలైన రైతును ఆదుకునేందుకు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం అమలు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ను కోరిన సీఎం చంద్రబాబు

సాగు వ్యయానికి, మార్కెట్‌ ధరకు మధ్య వ్యత్యాసాన్ని చెల్లించేందుకు కేంద్రం అంగీకారం

వాస్తవ సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటేనే ఎంఐఎస్‌ అమలు చేసినా ప్రయోజనమంటున్న రైతాంగం

(కంచికచర్ల - ఆంధ్రజ్యోతి)

మార్కెట్లో నెలకొన్న సంక్షోభం వల్ల మిర్చి పంటకు గిట్టుబాటు ధర లభించటం లేదు. గత ఏడాది పంట ఇంకా శీతల గిడ్డంగుల్లో మూలుగుతోంది. ఈ ఏడాది నల్లి ఉధృతంగా దాడి చేయటంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరానికి పది నుంచి 15 క్వింటాళ్ల లోపు దిగుబడి వస్తోంది. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా దిగుబడి లేక అల్లాడుతున్న రైతులు, ఆపై మార్కెట్‌ దెబ్బతో నిలువుగా కుంగిపోయారు. గత ఏడాది తాలుకాయలకు లభించిన ధర కూడా నేడు ఎర్రకాయలకు రావటం లేదు. పలువురు రైతులు అయినకాడికి కల్లంలోనే తెగనమ్ముకుంటూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. మార్కెట్‌ సంక్షోభంపై సీఎం చంద్రబాబు స్పందించటం హర్షణీయమని రైతులు అంటున్నారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం అమలుకు సంబంధించి మిర్చి పంట వాస్తవ సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేని పక్షంలో ప్రచారం అర్భా టం తప్పితే ఈ పథకం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని రైతులు పేర్కొంటున్నారు.

పెట్టుబడి బాగా పెరిగింది..దిగుబడి తగ్గింది

ఈ ఏడాది ఎకరానికి పెట్టుబడి రూ.రెండు లక్షలైంది. ఎర్రనల్లి, నల్లనల్లి దాడిచేయటంతో తోటలు నామరూపాలు లేకుండ కకావికలమయ్యాయి. దిగుబడి 15 క్విం టాళ్లు కూడా రావటం లేదు. కోత కూలి అసాధారణంగా పెరిగింది. కోత, గ్రేడింగ్‌ కలిపి క్వింటాలుకు కూలి రూ.ఐదు వేలకు తగ్గటం లేదు. ఈ స్థితిలో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం అమలుకు తూతూమంత్రంగా కాకుండా వాస్తవ సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. - కొమ్మినేని సత్యనారాయణ, రైతు, పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతాల

ఎకరాకు సాగు ఖర్చు ఇదీ..

కొంత మంది రైతులకు పెట్టుబడి రూ.1,81,500 కంటే ఎక్కువే అవుతోంది. ఎకరం కౌలు రూ.40 వేలకు పైగా కూడా ఉంది. నిర్వహణ ఖర్చులు, పెట్టుబడిపై వడ్డీ కూడా పరిగణనలోకి తీసుకుంటే పెట్టుబడి రూ.రెండు లక్షలకు పైసా కూడా తగ్గదు.

ఎకరానికి సగటున 15 క్వింటాళ్ల వంతున దిగుబడి రావటం గగనమవుతోంది. ఒకటి నుంచి రెండు క్వింటాళ్లు తాలు కాయలు ఉంటున్నాయి. అయినప్పటికీ 15 క్వింటాళ్లు, మార్కెట్‌ ధర రూ.13 వేల వంతున మొత్తం అమ్మకం విలువ రూ. 1.95 లక్షలవుతోంది.

మిర్చి కోత కూలి ఎక్కువ అవుతోంది. ఒకరికి రోజుకు కూలి రూ.మూడు వందలు. ఆటో ఖర్చు రూ.30. కాయలు కోయడానికి, కల్లంలో ఆరబోసి ఎండిన తర్వాత తాలు కాయలు ఏరటానికి మొత్తం కలిపి క్వింటాలుకు రూ.ఐదు వేలు కూలి వంతున, 15 క్వింటాళ్లకు రూ. 75 వేలు కూలి అవుతోంది.

ఈ లెక్కన సాగు వ్యయం క్వింటాలుకు రూ. 17 వేల నుంచి రూ.18 వేల లోపు ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కేంద్రం అధీనంలోని ఐసీఏఆర్‌ క్వింటాలుకు సాగు వ్యయం రూ.10,300గా పేర్కొందని, రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,600గా నిర్ణయించింది. సాగు వ్యయాన్ని తప్పనిసరిగా రూ.18 వేలుగా పరిగణనలోకి తీసుకోవాలని మిర్చి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

సగటు సాగు ఖర్చు ఎకరానికి

పొలం కౌలు 30,000

పొలం

బాగుచేయడానికి 2,500

దుక్కి, గొర్రు 5,000

అరక గొర్రు అచ్చు 4,000

నారు 25,000

నారు ఏతకూలి 5,000

ఎరువులు 30,000

పురుగుమందులు 50,000

నీటి తడులు 10,000

కలుపు,పడిపాదులు 10,000

అంతర కృషి,

ఇతర ఖర్చులు 10,000

మొత్తం ఖర్చు 1,81,500

Updated Date - Feb 23 , 2025 | 01:28 AM