క్రెబ్స్ నుంచి వచ్చిన రసాయనాలే..
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:07 AM
జక్కంపూడి శివారులోని ఖాళీ స్థలాల్లో పారబోసిన రసాయన వ్యర్థాల మూలలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కనుగొన్నారు. ట్యాంకర్ డ్రైవర్ వద్ద లభించిన కాగితాల్లో ఉన్నట్టుగానే విశాఖ జిల్లాలోని క్రెబ్స్ బయోటెక్ కంపెనీ నుంచి ఈ వ్యర్థాలు నగరానికి వచ్చినట్టు గుర్తించారు.

కంపెనీ లాగ్ రిజిస్టర్‌లో నమోదైన ట్యాంకర్ నెంబర్
రికార్డులను పరిశీలించిన వైజాగ్ పీసీబీ అధికారులు
ఘటనపై పీసీబీ ఉన్నతాధికారుల సీరియస్
ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : జక్కంపూడి శివారులోని ఖాళీ స్థలాల్లో పారబోసిన రసాయన వ్యర్థాల మూలలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కనుగొన్నారు. ట్యాంకర్ డ్రైవర్ వద్ద లభించిన కాగితాల్లో ఉన్నట్టుగానే విశాఖ జిల్లాలోని క్రెబ్స్ బయోటెక్ కంపెనీ నుంచి ఈ వ్యర్థాలు నగరానికి వచ్చినట్టు గుర్తించారు. ట్యాంకర్ లారీ ఏపీ02 టీబీ 6606 నెంబరుతో, ట్యాంకర్‌పై మాత్రం యజమాని కె.రమణారెడ్డి అని, రిజిసే్ట్రషన్ నెంబరు ఏపీ21 టీవై 3499 అని ఉన్న విషయం తెలిసిందే. ఈ సమాచారాన్ని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విశాఖ జిల్లా అధికారులకు పంపారు. వారు క్రెబ్స్ కంపెనీలో రికార్డులను పరిశీలించగా, ఈ లారీ ట్యాంకర్ అక్కడి నుంచి వ్యర్థాలతో బయల్దేరినట్టు స్పష్టంగా ఉంది. ఇదే విషయాన్ని అధికారులు పీసీబీ ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీనిపై విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వ్యర్థాలను పారబోసిన విషయాన్ని తీవ్రంగా పరిగణించి అసలు దోషులను బయటకు లాగాలని అధికారులు ఆదేశించారు.
ఆన్‌లైన్‌లో ఎందుకు నమోదు కాలేదు?
కర్మాగారాన్ని ఏర్పాటు చేసినప్పుడు సంబంధిత వ్యక్తులు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ కర్మాగారం నుంచి ఏ స్థాయిలో వ్యర్థాలు విడుదలవుతాయో పీసీబీకి తెలియజేయాలి. దీన్నే మాస్ బ్యాలెన్స్‌గా వ్యవహరిస్తారు. కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత విడుదలయ్యే వ్యర్థాలు ఎంత పరిమాణంలో వచ్చాయి, ఏ నెంబరు కలిగిన ట్యాంకర్‌లో ఎక్కడి పీపీయూ (ప్రీ ప్రాసెసింగ్ యూనిట్)కు పంపుతున్నారో ఏపీ ఎన్విరాన్‌మెంటల్ కార్పొరేషన్ (ఏపీఈఎంసీ) వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. దీన్ని పరిశీలించి ఆన్‌లైన్‌లోనే అనుమతి ఇస్తారు. దీన్ని మ్యానిఫెస్టో ప్రింట్ అవుట్‌గా వ్యవహరిస్తారు. ఈ కాపీని ప్రింట్ తీసుకుని సంబంధిత లారీ డ్రైవర్‌కు ఇవ్వాలి. మ్యానిఫెస్టో తయారుకాగానే పీపీయూకు ఒక మెసేజ్ వెళ్తుంది. కంపెనీ నుంచి లారీ బయల్దేరగానే జీపీఎస్ ద్వారా దాన్ని ట్రాక్ చేస్తారు. ట్యాంకర్ ఎక్కడైనా దారి తప్పితే వెంటనే అధికారులకు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఇంత పగడ్బందీగా ఉన్నప్పుడు జక్కంపూడికి వచ్చిన ట్యాంకర్, వ్యర్థాల వివరాలు ఏపీఈఎంసీలో ఎందుకు నమోదు కాలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఈ ట్యాంకర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించే ప్రయత్నాలను క్రెబ్స్ ప్రతినిధులు చేశారు. లాగ్ పుస్తకాల్లో ట్యాంకర్ నెంబరు ఉండటంతో కిక్కురుమనడం లేదని తెలుస్తోంది. కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌లో జనరేట్ కావాల్సిన మ్యానిఫెస్టో కాకుండా, చేతితో రాసిచ్చిన మ్యానిఫెస్టో ఉండటం కూడా అనుమానాలకు కారణం. ఈవిధంగా ఎన్ని ట్యాంకర్లను, ఎన్నాళ్ల నుంచి పంపారన్న దానిపై పీసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు.
ఇదే తొలిసారి కాదు
కర్మాగారాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను నిర్మానుష్య ప్రదేశాల్లో పారబోయడం ఇదే తొలిసారి కాదని జిల్లావాసులు చెబుతున్నారు. ఈ తరహా పనులు జగ్గయ్యపేట శివారుల్లోను జరిగాయంటున్నారు. రెండేళ్ల క్రితం రసాయన వ్యర్థాలను ట్యాంకర్లలో తీసుకొచ్చి బుగ్గమాదారం వద్ద కృష్ణానదిలో వదలడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన స్థానికులు పట్టుకుని చిల్లకల్లు పోలీసులకు అప్పగించారు. తర్వాత ఆ కేసు నీరుగారిపోయింది. జగ్గయ్యపేట చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలను కొన్ని కంపెనీలు బోరుబావుల్లో వదిలేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని భూముల్లో బోర్ల కోసం వేసిన రంధ్రాలకు నీరు పడకపోవడంతో అలాగే వదిలేశారు. వాటి వద్దకు ట్యాంకర్లను తీసుకొచ్చి పైపుల ద్వారా ఈ రంధ్రాల్లోకి వ్యర్థాలను వదిలిన దాఖలాలున్నాయి. వ్యర్థాలను డంప్ చేసే ప్రక్రియకు ఇకనైనా అడ్డుకట్ట వేయకపోతే సారవంతమైన భూములకు నష్టం కలుగుతుందని ప్రజలు కోరుతున్నారు.