Share News

రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు చేయండి

ABN , Publish Date - Feb 06 , 2025 | 01:48 AM

ప్రజాపంపిణీ వ్యవస్థ పనితీరు, తనిఖీలు, ఉల్లంఘనల్లో కేసుల నమోదుపై పౌర సరఫరాల కమిషనర్‌ సౌరభ్‌గౌర్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు చేయండి

ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా మార్చండి

పౌరసరఫరాల అధికారులతో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ‘ఎన్టీఆర్‌ జిల్లాలోని 957 రేషన్‌ దుకాణాలు, ఏడు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, నివేదికలు సమర్పించాలి. పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు ప్రతినెలా 20 దుకాణాలను, తహసీల్దార్లు నెలకు ఐదు దుకాణాలను తనిఖీ చేయాలి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను పౌర సరఫరాల డీఎం, జిల్లా పౌరసరఫరాల అధికారి తనిఖీ చేయాలి. జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా మార్చాలి.’ అని పౌర సరఫరాల అధికారులను కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశించా రు. బుధవారం ప్రజాపంపిణీ వ్యవస్థ పనితీరు, తనిఖీలు, ఉల్లంఘనల్లో కేసుల నమోదుపై పౌర సరఫరాల కమిషనర్‌ సౌరభ్‌గౌర్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. అధికారులతో కలిసి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ హాజరయ్యారు. కాన్ఫరెన్స్‌ అనంతరం పౌరసరఫరాల అధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు. 2024 జూలై నుంచి డిసెంబరు వరకు 6ఏ కేసులు 119 నమోదయ్యాయని, ఇకపైనా క్రియాశీలంగా పనిచేసి, ఉల్లంఘనలపై చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎండీయూ ఆపరేటర్లు పారదర్శకంగా సరుకులు అందించేలా చూడాలన్నారు.

1,09,665 టన్నుల ధాన్యం సేకరణ

ఎన్టీఆర్‌ జిల్లాలో రైతుల నుంచి ధాన్యం సేకరణపైన పౌరసరఫరాల అధికారులతో కలెక్టర్‌ లక్ష్మీశ సమీక్షించారు. ఇప్పటివరకు 16,217 మంది రైతుల నుంచి రూ.254 కోట్ల విలువైన 1,09,665 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ఆయన తెలిపారు. పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ ఎం.శ్రీనివాసు, డీఎస్వో ఎ.పాపారావు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో 2,713 నీటి కుంటలు మంజూరు

‘పంట పొలాల్లో నీటి కుంటల(ఫార్మ్‌ పాండ్స్‌)తో పొలం పచ్చగా... సమాజం సుభిక్షంగా ఉంటుంది. ఒక కార్యక్రమంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జిల్లాలో 289 గ్రామ పంచాయతీల పరిధిలో 2,713 కుంటలు మంజూరయ్యాయి. ఇప్పటికే 203 కుంటలు గ్రౌండింగ్‌ అయ్యాయి. మిగిలిన పనులు ప్రారంభించి పూర్తయ్యేలా చూడాలి.’ అని అధికారులను కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి జిల్లాస్థాయి అధికారులతో కలిసి ఆర్డీవోలు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీరాజ్‌, ఇంజినీరింగ్‌ అధికారులతో ఆయన వీడియా కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరుతెన్నులతో పాటు సగటు రోజువారీ వేతనాలు, పశువుల షెడ్లు, పంట పొలాల్లో నీటి కుంటల పనుల్లో పురోగతిని సమీక్షించారు. నరేగా అనుసంధానంతో పైసా ఖర్చులేకుండా రైతుల పొలాల్లో నీటికుంటల వల్ల పంటకు కావాల్సిన నీరు అందించడమే కాకుండా భూగర్భ జలాల వృద్ధికి దోహదం చేస్తాయన్నారు. నరేగా-పల్లె పండుగ కార్యక్రమం కింద 746 పశువుల షెడ్లకు పనులు మంజూరు కాగా, 420 పూర్తయ్యాయని తెలిపారు. డ్వామా పీడీ ఎ.రాము, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ జెడ్‌.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2025 | 01:48 AM