గంజాయి బ్యాచ్ వీరంగం
ABN , Publish Date - Mar 01 , 2025 | 02:08 AM
గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. చిన్న విషయం వద్ద మొదలైన వాదన ఘర్షణకు దారి తీసింది.
ముగ్గురిని క్వారీ గుంతలోకి తోసిన వైనం..స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. చిన్న విషయం వద్ద మొదలైన వాదన ఘర్షణకు దారి తీసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాదులాట ఆ తర్వాత కొట్లాట, చివరకు ముగ్గురిని క్వారీ గుంతలోకి నెట్టేసేదాకా వచ్చింది. ఈఘటన ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ సమీపంలో ఉన్న సత్తెమ్మతల్లి గుడి వద్ద శుక్రవారం జరిగింది. గంజాయి మత్తులో ఉన్న పది మంది కొట్టుకొని ఇద్దరు యువకులను, ఒక యువతిని గుడి వెనుక ఉన్న పాడుబడిన రాతి క్వారీ గుంతలోకి నెట్టేశారు. 50 నుంచి 70 అడుగుల లోతులో ఉన్న గుంతలో పడిన ఆ ముగ్గురూ హాహాకారాలు చేస్తుండటంతో సమీపంలో ఉన్న గృహాల వారు తాళ్లు, చీరెల సాయంతో వారిని బ యటకు తీశారు. బయట పడిన వ్యక్తులపై గంజాయి మత్తులో ఉన్న వారు మళ్లీ దాడి చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాధితులను ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీటీపీఎ్‌సలో కాంట్రాక్టు కార్మికులుగా పని చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో కార్మికులు వస్తున్నారు. వారం తా కొత్తగేటు ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు. కొత్తగేటు సమీపంలో గంజాయి విపరీతంగా లభిస్తుండటంతో చాలా మంది కా ర్మికులు దానికి బానిసలయ్యారు. మత్తులో అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో సమీపంలో ఉంటున్న కుటుంబాల వారు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు స్పందించి గంజాయిని అరికట్టాలని, గంజాయి బ్యాచ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.