Share News

లెక్క చిక్కేనా..?

ABN , Publish Date - Mar 08 , 2025 | 01:01 AM

ట్రెజరీశాఖలో దొంగలు పడ్డారు. అవనిగడ్డ సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న కీలక ఉద్యోగులు తమకున్న సాంకేతిక నైపుణ్యంతో పింఛన్లు, ఇతరత్రాల బిల్లుల పేరుతో పెద్దమొత్తంలో నగదును దారి మళ్లించి, తమ ఖాతాలకు జమ చేసుకున్నారు. ఆడిట్‌ చేసే సమయంలో ఈ వివరాలు వెల్లడికావడంతో ఈ అక్రమాల బాగోతం బయటపడింది. రికార్డులను స్వాధీనం చేసుకున్న అధికారులు మచిలీపట్నంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు.

లెక్క చిక్కేనా..?
జిల్ల్లా ట్రెజరీ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు

అవనిగడ్డ సబ్‌ట్రెజరీ కార్యాలయ అక్రమాల బాగోతం

సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రూ.1.50 కోట్లు స్వాహా

కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులదే ప్రధాన పాత్ర

జిల్లా ట్రెజరీ కార్యాలయానికి నెలనెలా మామూళ్లు?

ఉన్నతాఽధికారి పాత్రపైనా అనేక అనుమానాలు

అవనిగడ్డ సబ్‌ట్రెజరీ లాగిన్‌ నుంచే నగదు మళ్లింపు

జిల్లా ట్రెజరీ కార్యాలయంలో అధికారుల విచారణ

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : అవనిగడ్డ సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో పనిచేసే ఎస్‌టీవో, అకౌంటెంట్‌ తమ తెలివితేటలను ఉపయోగించి ప్రభుత్వ నిధులను పెద్దమొత్తంలో పక్కదారి పట్టించేశారు. ఉన్నతాధికారుల అండదండలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని వీరు ఆడిన ఆట ఎట్టకేలకు బయటపడింది. ఈ వ్యవహారంలో అవనిగడ్డ సబ్‌ట్రెజరీలో కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లా కార్యాలయంలో పనిచేసే అధికారుల పాత్ర ఉండటంతో విచారణ సక్రమంగా సాగుతుందా, లేక మమ.. అనిపిస్తారా అనే అంశంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.

జిల్లా ట్రెజరీ కార్యాలయంలో అధికారులు

అవనిగడ్డ సబ్‌ ట్రె జరీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు తమ ఖాతాలకు సుమారు రూ.1.50 కోట్లకు పైగా నగదును మళ్లించుకున్నారనే సమాచారంతో ట్రెజరీ విభాగం డైరెక్టర్‌ ఎం.మోహనరావు, జిల్లా ట్రెజరీ అధికారి ఎస్‌.రవికుమార్‌ తమ సిబ్బందితో కలిసి గురువారం అవనిగడ్డ కార్యాలయంలో విచారణ చేశారు. ఈ కార్యాలయంలోని రికార్డులను వారు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని మచిలీపట్నంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం లెక్కలు తేల్చే పని చేపట్టారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛన్‌ నగదు, ఇతరత్రాల రూపంలో నగదు ఎంతమేర పక్కదారి పట్టిందనే దిశగా విచారణ జరుగుతోంది. రెండు రోజుల పాటు ఈ లెక్కలు తేలుస్తామని, అప్పటివరకు ఎంతమొత్తంలో నగదు పక్కదారి పట్టిందనే అంశంపై పూర్తిస్థాయి వివరాలు వెల్లడించలేమని జిల్లా ట్రెజరీ కార్యాలయ అధికారులు తెలిపారు. అవనిగడ్డ సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అయినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు.

కీలక అధికారి పాత్ర ఎంత..?

అవనిగడ్డ సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో కొన్ని నెలలుగా పింఛనుదారులకు సంబంధించిన సొమ్మును నకిలీ ఖాతాల ద్వారా సొంతానికి మళ్లించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. కేవలం పింఛన్‌ సొమ్మే కాకుండా, ఇతరత్రా బిల్లుల రూపంలోనూ నగదును నకిలీ ఖాతాలకు పంపించారని తెలుస్తోంది. ఈ అంశం మూడు, నాలుగు నెలల క్రితమే అధికారుల పరిశీలనలో వెల్లడైంది. అవనిగడ్డ సబ్‌ట్రెజరీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు, జిల్లా ట్రెజరీ కార్యాలయంలోని ఓ కీలక అధికారికి నెలవారీగా నడిచే ఆర్థిక సంబంధాల కారణంగా ఈ అంశాన్ని బయటకు రానివ్వలేదని ఆ కార్యాలయ ఉద్యోగులే చెప్పుకొంటున్నారు. అవనిగడ్డ సబ్‌ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వాన్ని మోసంచేసి రూ.1.50 కోట్లకు పైగా నగదును మళ్లించుకున్నా, సంబంధిత ఉద్యోగులపై.. పోలీసులకు గానీ, ట్రెజరీ విభాగం ఉన్నతాధికారులకు గానీ ఫిర్యాదు చేయకుండా జిల్లా ట్రెజరీ కార్యాలయ అధికారులు కావాలనే జాప్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆడిట్‌ జరిగిన సమయంలో, ప్రధాన ట్రెజరీ కార్యాలయ అధికారుల పరిశీలనలో నగదు పక్కదారి పట్టిందనే విషయం వెల్లడయ్యే వరకు జిల్లా ట్రెజరీ కార్యాలయ అధికారులు.. అవనిగడ్డ సబ్‌ట్రెజరీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడకపోవడం గమనించదగ్గ అంశం. జిల్లా ట్రె జరీ కార్యాలయ అధికారులకు తెలియకుండా ఒక్క రూపాయి కూడా వేరే వ్యక్తుల ఖాతాలకు జమ కాదని, ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. అవనిగడ్డ సబ్‌ట్రెజరీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు ఇటీవల అనారోగ్యం పాలై నెలపాటు సెలవులో ఉన్నారని, ఈ సమయంలోనే ఈ అక్రమ నగదు బదిలీ వ్యవహారం వెలుగుచూసిందని ఉద్యోగుల మాట. అవనిగడ్డ సబ్‌ట్రె జరీ కార్యాలయంలో కీలక ఉద్యోగి లాగిన్‌ నుంచి నగదు బదిలీ అయ్యిందని, ఆ ఉద్యోగిని ఈ వ్యవహారం నుంచి బయట పడేసేందుకు తెరవెనుక మంత్రాంగం నడుస్తోందని అనుకుంటున్నారు.

అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం

అవనిగడ్డ సబ్‌ట్రెజరీ కార్యాలయంలోని రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్కడి సిబ్బంది నగదును దారి మళ్లించారని గుర్తించాం. విచారణ పూర్తయిన తరువాత పక్కదారి పట్టిన నగదును రికవరీ చేస్తాం. అక్రమాలకు పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లా ట్రెజరీ కార్యాలయ అధికారులకు ఈ వ్యవహారంతో సంబంధం లేదు.

- ఎస్‌.రవికుమార్‌, జిల్లా ట్రెజరీ అధికారి

Updated Date - Mar 08 , 2025 | 01:01 AM