Share News

AP investments: ఊహకందనంతగా పెట్టుబడుల రాక: కూటమి నేతలు

ABN , Publish Date - Nov 17 , 2025 | 03:59 PM

కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు అండగా ఉంటుందనే భరోసా వచ్చిందని కూటమి నేతలు తెలిపారు. సీఐఐ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు జరిగాయని అన్నారు.

AP investments: ఊహకందనంతగా పెట్టుబడుల రాక: కూటమి నేతలు
AP investments

అమరావతి, నవంబర్ 17: విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో అనేక పరిశ్రమలతో ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. పలు పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే విశాఖ సీఐఐ సదస్సుపై వైసీపీ చేస్తున్న విమర్శలపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలువురు ఎంపీలు, ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పెట్టుబడుల సదస్సు విశాఖలో జరిగినా అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రం రాష్ట్రమంతటా విస్తరించేలా కీలక నిర్ణయాలు సీఐఐ సమ్మిట్‌లో జరిగాయని విజయవాడ ఎంపీ కేశినేని శివానాథ్ అన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 20లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఎంపీ చెప్పుకొచ్చారు.


అభివృద్ధి సంక్షేమం నినాదంతో చంద్రబాబు ముందుకెళ్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. యువత భవిష్యత్తు కోసం చేసే యజ్ఞాన్ని అసత్యాలతో కొందరు చేసే విష ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ.. అంచనాలకు మించి వచ్చిన పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధికి ఎంతో కీలకమని.. ముందు చూపు ఉన్న నాయకుడు వల్ల రాష్ట్రానికి ఎంతో ఉపయోగమన్నారు.


ఆ ఘనత చంద్రబాబుకే: ఎంపీ పుట్టా మహేష్

వైసీపీ పాలనలో పరిశ్రమలకు సంబంధించిన ఒక్క ఎంవోయూ జరగలేదని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు అండగా ఉంటుందనే భరోసా వచ్చిందన్నారు. ఇండియాలో సింగల్ విండో విధానంతో పరిశ్రమలు ఏర్పాటు చేసే విధానం తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్టానికి పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాబోయే ఆదాయం చాలా కీలకమన్నారు. సూపర్ సిక్స్ అమలు ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని ప్రకటించారు.చంద్రబాబును చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఇతరదేశాల వాళ్ళు ఏపీకి వచ్చి పని చేసే రోజులు వస్తాయని ఎంపీ పుట్టా మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.


ఏపీకి పెట్టుబడిదారుల క్యూ: ఎంపీ, ఎమ్మెల్యే

దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా పెట్టుబడిదారులు ఏపీకి వస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వైజాగ్‌లో జరిగిన వ్యాపారవేత్తల సమావేశంలో ఎవరి ఊహకి అందనంతగా పెట్టుబడులు వచ్చాయని.. 64 దేశాల నుంచి ప్రతినిధులు రావడం చిన్న విషయం కాదన్నారు. టీడీపీ హయాంలో‌ వచ్చిన పరిశ్రమలు, కంపెనీలు జగన్ ప్రభుత్వ హయాంలో ఇమడలేకపోయాయని.... ఎన్నో కంపెనీలు వెనక్కి వెళ్లాయని విమర్శించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో త్వరలోనే ఆ కంపెనీలు ఏర్పాటు‌ కాబోతున్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వైసీపీ వారు మేము‌ పెట్టుబడులు తెచ్చాం... మేము పెట్టుబడులు తెచ్చాం... అంటున్నారని.. అవి ఏవీ? ఎక్కడ? ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ హయాంలో పునాదిరాళ్లకే అభివృద్ధి పరిమితమైందంటూ వ్యాఖ్యలు చేశారు. తాము అభివృద్ది‌ చేసి చూపుతున్నామని.. ప్రజలకు అవసరమైన వాటిని వదిలేశారని..వారికి కావాల్సిన‌ వాటిని అభివృద్ది చేసుకున్నారంటూ ఎమ్మెల్యే వేమిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - Nov 17 , 2025 | 03:59 PM