Share News

‘తప్పు’కోడానికా?

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:55 AM

తిమ్మిని బమ్మిని చేసి.. తప్పును ఒప్పుగా మార్చేసి.. చేసిన దొంగపని నుంచి బయటపడటానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూ ఎస్‌) ఇన్‌చార్జి ఈఈ ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మచిలీపట్నం సబ్‌ డివిజన్‌ పరిధిలో జరిగిన ఫిల్టర్‌ మీడియా పనుల్లో జరిగిన అవకతవకలను సరిచేయడానికి అప్పటి డీఈ.. ఇప్పటి ఇన్‌చార్జి ఈఈ తెగ ప్రయత్నం చేస్తున్నారు. తప్పులను క్వాలిటీ కంట్రోల్‌ విభాగం రెండుసార్లు నిర్ధారించినా.. కలెక్టర్‌ను ఏమార్చి, సవరణకు ఆదేశాలు పొంది, తప్పును కప్పిపుచ్చుకు నేందుకు తంటాలు పడుతున్నారు.

‘తప్పు’కోడానికా?

  • మచిలీపట్నం సబ్‌ డివిజన్‌ పనుల్లో అవకతవకలు

  • చేయని పనులకు ఎంబుక్‌లో రికార్డు, చెక్‌మెజర్‌మెంట్‌

  • క్వాలిటీ కంట్రోల్‌ విభాగ తనిఖీల్లో బయటపడిన బండారం

  • క్వాలిటీ కంట్రోల్‌ నివేదిక సరికాదని తాజాగా అభియోగం

  • కలెక్టర్‌కు నోట్‌ఫైల్‌.. రికార్డుల్లో సవరణకు ఆమోదం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సామూహిక రక్షిత మంచినీటి పథకం (సీపీడబ్ల్యూఎస్‌)లో భాగంగా మచిలీపట్నం సబ్‌ డివిజన్‌ పరిధిలోని చోరంపూడి గ్రామంలో 0.5 ఎంఎల్‌డీ మైక్రోఫిల్టర్‌లో కొత్త ఫిల్టర్‌ మీడియా మార్పించటానికిజిల్లా పరిషత నిధులు రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనిని అప్పట్లో వైసీపీ అనుకూల కాంట్రాక్టర్‌తో చేయించారు. ఈ పని పూర్తికాకుండానే గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌)లో బిల్లులు పెట్టినట్టు అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. మైక్రోఫిల్టర్‌లో నింపాల్సిన ఫిల్టర్‌ మీడియా పరిమాణంలో చాలా వ్యత్యాసం ఉన్నట్టు వెలుగుచూసింది. 600 కేజీల కార్బన్‌ వేయాల్సి ఉండగా, 1,200 కేజీలు వేసినట్టు బిల్లులు పెట్టారు. ఎంబుక్‌లోనూ ఇదే నమోదు చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ)లు సంతకం కూడా చేసి జడ్పీకి బిల్లులు పంపారు. ఆ తర్వాత ఈఈకి అనుమానం వచ్చి ఆ పనిని తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్‌ విభాగాన్ని ఆదేశించారు. పూర్తిగా పనులు చేయకుండానే ఎంబుక్‌ తో పాటు ఇతర రికార్డుల్లో నమోదు చేశారని గుర్తించారు. దాదాపు రూ.2.3 లక్షల మేర చేయని పనులకు బిల్లులు పెట్టినట్టు నిర్ధారించారు. కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బిల్లులో 50 శాతం మేర రికవరీ చేయాల్సిందిగా ప్రతిపాదిస్తూ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారులకు క్వాలిటీ కంట్రోల్‌ విభాగం అధికారులు నివేదిక ఇచ్చారు. ఇదే సబ్‌ డివిజన్‌ పరిధిలోని మల్లేశ్వరం సామూహిక రక్షిత మంచినీటి పథకంలో భాగంగా ఏర్పాటుచేసిన మైక్రో ఫిల్టర్‌లోని ఫిల్టర్‌ మీడియాను మార్చటానికి రూ.50 లక్షల జెడ్పీ నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను కూడా అడ్డగోలుగా చేశారన్న అనుమానంతో అప్పటి ఈఈ.. క్వాలిటీ కంట్రోల్‌ తనిఖీలకు ఆదేశించారు. ఇక్కడ కూడా ఫిల్టర్‌ మీడియా పనులు పూర్తిస్థాయిలో జరగలేదని నిర్ధారించారు. పనులు సక్రమంగా పూర్తి చేయనందున కాంట్రాక్టర్‌కు చెల్లించే బిల్లులో 30 నుంచి 50 శాతం వరకు రికవరీ చేయాలని ప్రతిపాదిస్తూ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.

అప్పుడు డీఈ.. ఇప్పుడు ఇన్‌చార్జి ఈఈ

ఈ పనులు చేసిన పుడు ఆర్‌డబ్ల్యూఎస్‌ జిల్లా అధికారిగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) ప్రస్తుతం లేరు. నాడు అడ్డగోలుగా చెక్‌మెజర్‌మెంట్‌ చేసిన డీఈ ప్రస్తుతం కృష్ణాజిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇన్‌చార్జి ఈఈగా వ్యవహరిస్తున్నారు. తాను చేసిన దొంగపనిని ఇప్పుడు ఆయన సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజిలెన్స్‌ నివేదికనే తప్పుబట్టారు. ఏఈ లేని సమయంలో అప్పట్లో తనిఖీలు జరిగాయని ఆరోపిస్తూ.. మళ్లీ తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్‌ అధికారులకు లేఖ రాశారు. అయితే, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు రాజీ పడలేదు. గతంలో ఏవైతే నిర్ధారించారో అవే అంశాలను పొందుపరుస్తూ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) కార్యాలయానికి నివేదిక ఇచ్చారు.

అదో కట్టుకథ

విజిలెన్స్‌ రిపోర్టు వ్యతిరేకంగా రావటంతో ఇన్‌చార్జి ఈఈ కంగుతిన్నారు. అప్పట్లో అడ్డగోలుగా చెక్‌మెజర్‌మెంట్‌ చేసిన తన బండారం బయట పడుతుందన్న ఉద్దేశంతో కట్టుకథ అల్లారు. డ్యామేజీ అయిన టేపులను వాడటం వల్ల ఎంబుక్‌లో చేయని పనులను నమోదు చేయాల్సి వచ్చిందన్న వాదన తీసుకొచ్చారు. ఎంబుక్‌ లో నమోదు చేసిన వివరాలను మార్చటానికి వీలుగా కృష్ణాజిల్లా కలెక్టర్‌కు ఏకంగా నోట్‌ఫైల్‌ పెట్టారు. ఇక్కడే ఇన్‌చార్జి ఈఈ బండారం బయటపడింది. ఎంబుక్‌లో తప్పుగా నమోదైతే.. రీ రికార్డింగ్‌ చేయటానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)కు లేదా ఈఎన్‌సీకు నోట్‌ఫైల్‌ పెట్టాలి. ఇవేమీ చేయకుండా కలెక్టర్‌కు నోట్‌ఫైల్‌ పెట్టారు. తమ ఉన్నతాధికారులకు పెడితే అసలు విషయం తెలుస్తుందనే తెలివిగా కలెక్టర్‌కు పెట్టారు. కలెక్టర్‌ కూడా ఆ నోట్‌ఫైల్‌ను ఆమోదించారు. కలెక్టర్‌ ఆదేశాలను అనుసరించి ఇన్‌చార్జి ఈఈ హోదాలో తనకు తానుగా ఎంబుక్‌లో ఎంట్రీలను రీరికార్డింగ్‌ చేయటానికి వీలుగా ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. వీటిప్రకారం ఎంబుక్‌, ఇతర రికార్డుల్లో నమోదు చేసిన వాటన్నింటినీ సరిచేస్తారు. దీంతో తాను చేసిన తప్పును సరిచేసుకునే అవకాశం ఏర్పడుతుందని ఇన్‌చార్జి ఈఈ ఆలోచన.

Updated Date - Jan 17 , 2025 | 12:55 AM