Share News

మరో రక్షణ గోడ

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:08 AM

కృష్ణానది వరద ముంపును అరికట్టడానికి విజయవాడ వైపున రక్షణ గోడ మాదిరిగానే గుంటూరు జిల్లాలోని సీతానగరం, తాడేపల్లి వైపు కూడా రెండో రక్షణ గోడను నిర్మించనున్నారు. దీనికి మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది.

మరో రక్షణ గోడ
కనకదుర్గమ్మ వారధి వద్ద విజయవాడ వైపు నిర్మించిన రక్షణ గోడ

కృష్ణానదిలో సీతానగరంవైపు త్వరలో నిర్మాణం

రైల్వేబ్రిడ్జి నుంచి వారధి వరకు 2.160 కిలోమీటర్లు

జలవనరుల శాఖ ప్రతిపాదనకు మంత్రివర్గ ఆమోదం

రూ.294.20 కోట్లతో అంచనాలు సిద్ధం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కృష్ణానది వరద ముంపును అరికట్టడానికి విజయవాడ వైపున రక్షణ గోడ మాదిరిగానే గుంటూరు జిల్లాలోని సీతానగరం, తాడేపల్లి వైపు కూడా రెండో రక్షణ గోడను నిర్మించనున్నారు. దీనికి మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. గత ఏడాది సెప్టెంబరు 1వ తేదీన కృష్ణానదికి భారీగా వరద వచ్చింది. సుమారు 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీని తాకింది. అయితే, విజయవాడ వైపు ఉన్న ప్రాంతాలపై పెద్దగా కృష్ణానది వరద ప్రభావం కనిపించలేదు. కానీ, సీతానగరం ఘాట్లపై నుంచి సిమెంట్‌ రహదారి పైకి నీరు చేరింది. కనకదుర్గ వారధికి అవతలి వైపున ఉన్న విజయవాడ క్లబ్‌ ప్రహరీని తాకింది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న కరకట్టలు బలహీనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీతానగరం వైపు రక్షణ గోడను నిర్మించాలని జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్యారేజీ దిగువన సీతానగరంలోని రైల్వేబ్రిడ్జి నుంచి వారధి వరకు 2.160 కిలోమీటర్ల మేర గోడను నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి రూ.294.20 కోట్ల వ్యయమవుతుందని అంచనాలు రూపొందించగా, మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రక్షణ ఫలితం ఇదీ..

కృష్ణానదికి వరదలు వచ్చిన ప్రతిసారీ నగరంలోని కొంత ప్రాంతం వరద ముంపు బారిన పడుతుండేది. చిన్నపాటి వరద వచ్చినా, లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీ నుంచి దిగువకు వచ్చినా కృష్ణలంక, గీతానగర్‌కట్ట, రామలింగేశ్వరనగర్‌, బాలాజీనగర్‌ ప్రాంతాలు మునిగిపోయేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. రామలింగేశ్వరనగర్‌ శ్మశానవాటిక నుంచి గీతానగర్‌ కట్ట వరకు రక్షణ గోడను నిర్మించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గీతానగర్‌ కట్ట నుంచి పద్మావతి ఘాట్‌ వరకు ఉన్న పరివాహక ప్రాంతంలో ఈ గోడను నిర్మించింది. గత ఏడాది కృష్ణా, బుడమేరుకు వచ్చిన వరద కారణంగా నగరంలోని భవానీపురం, కొత్తపేట, పాలఫ్యాక్టరీ, అజితసింగ్‌నగర్‌, పాయకాపురం, నున్న, కండ్రిక ప్రాంతాలు నీటమునిగాయి. కానీ, రక్షణ గోడ నిర్మించిన కొన్ని ప్రాంతాల్లోకి మాత్రమే వరద నీరు ప్రవహించింది. రామలింగేశ్వరనగర్‌ శ్మశానం నుంచి యనమలకుదురు వైపునకు రక్షణ గోడ లేకపోవడంతో అటువైపు నుంచి వరద నీరు ప్రవేశించి వీధుల్లోకి చేరింది. ఈగోడ లేకపోయినట్టయితే ముంపు ప్రభావం భారీగా ఉండేది. ఇలా వరదలు వచ్చినప్పుడు విజయవాడ పరివాహక ప్రదేశానికి రక్షణ ఉన్నప్పటికీ గుంటూరు జిల్లాలోని సీతానగరం, తాడేపల్లి వైపున ఆ పరిస్థితి లేదు. దీంతో విజయవాడ వైపు నిర్మించినట్టుగానే సీతానగరం వైపు కూడా రక్షణ గోడను నిర్మించాలని జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో రెండో రక్షణ గోడ నిర్మాణానికి కొద్దినెలల్లో అడుగులు పడతాయని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jan 18 , 2025 | 12:08 AM