బంపర్ మెజారిటీ!
ABN , Publish Date - Mar 04 , 2025 | 12:56 AM
ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్ లెక్కింపుతోనే భారీ మెజారిటీని దక్కించుకున్న ఆయన రౌండ్ రౌండ్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. గట్టి పోటీని ఇస్తారని అందరూ ఊహించిన పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు దారుణమైన ఓటమి చవిచూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమవారం రాత్రి తొమ్మిది గంటల వరకు కౌంటింగ్ చూస్తే మూడు రౌండ్లకు గాను 30 వేల పైచిలుకు మెజారిటీతో ఆలపాటి ముందున్నారు. నాల్గో రౌండ్‌కు 38,491, ఐదో రౌండ్‌కు 47,850 ఆధిక్యతతో కొనసాగుతున్నారు. మిగిలిన రౌండ్లలోనూ కూడా ఆలపాటి ఇదే విధమైన ఆధిక్యంతో దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెజారిటీ ఎంత సాధించబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
భారీ విజయం దిశగా టీడీపీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్
మూడు రౌండ్లకే 30 వేల ఆధిక్యం
నాల్గో రౌండ్‌కు 38,491, ఐదో రౌండ్‌కు 47,850 ఆధిక్యం నమోదు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం జరిగిన మూడు రౌండ్ల లెక్కింపులో కూటమి బలపర్చిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు 30 వేల పైచిలుకు ఆధిక్యం వచ్చింది. మిగిలిన రౌండ్లలో కూడా ఇదే విధంగా దూసుకుపోతే 70 వేల నుంచి 80 వేల వరకు మెజారిటీ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఆలపాటి విజయంపై ధీమాగా ఉన్నారు. ఆ దిశగానే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లకు దగ్గరయ్యారు. తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి ఎన్నికల సమరంలో దిగారు. విద్యావేత్తగా తనకున్న పరిచయాలను ఉపయోగించుకున్నారు. ప్రచారానికి సాంకేతికతను జోడించి పట్టభద్రులకు చేరువయ్యారు. దీనికితోడు ఎక్కువ సంఖ్యలో పట్టభద్రులను ఓటర్లుగా చేర్పించటం కూడా ఆయనకు కలిసొచ్చింది. తన ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధానంగా ప్రస్తావించారు.
కూటమి పాలనపై సంతృప్తిగా..
ప్రభుత్వంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా ఈ ఎన్నిక ద్వారా పటాపంచలు కానుంది. కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగు లంతా కూడా సానుకూలంగా ఉన్నార న్నది స్పష్టమవుతోంది. ఉద్యోగుల ఓట్లపైనే ప్రధానంగా పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగ వర్గం అంతా కూడా కూటమి అభ్యర్థికే జై కొట్టింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుతో ఆ పార్టీ యువపట్టభద్ర ఓటర్లంతా కూడా ఆలపాటికి ఓట్లేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఆలపాటి గెలుపునకు కృషి చేయాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఆలపాటి గెలుపునకు కూటమి కలసికట్టుగా కృషి చేసిందనే చెప్పాలి.
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానం కావడంతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం కోసం ఆయన తరచూ సమీక్షలు నిర్వహించారు. నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా ప్రతినిధు లకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆలపాటి విజయం కోసం ఉమ్మడి కృష్ణాజిల్లాలో వారు పడిన కష్టం అంతా, ఇంతా కాదు. ప్రతి నియోజకవర్గానికి పార్టీ అధిష్టానం పరిశీలకులను నియమించింది. పకడ్బందీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ఉన్నారని ఈ ఎన్నికతో తేటతెల్లమైంది. మొదటి నుంచి ఆలపాటి లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.