ఎన్‌హెచ్‌కు షాక్..!
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:43 AM
విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకు సంబంధించి ల్యాంకో ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్ టవర్ల మార్పిడి విషయంలో కోరి వివాదాన్ని తెచ్చుకున్న జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) చివరికి చిక్కుల్లో పడింది. ల్యాంకో హైటెన్షన్ పవర్ లైన్స్ అసలు యాజమాన్యం ఎవరనేది ధ్రువీకరించాల్సిందిగా ల్యాంకో లిక్విడేటర్‌కు ఎన్‌హెచ్ అధికారులు లేఖ రాసిన నేపథ్యంలో ఆయన మెయిల్ ద్వారా పంపిన సమాధానానికి షాకైంది. సంబంధం లేని ఓ సంస్థకు అప్పనంగా రూ.14 కోట్లు చెల్లించడం తప్పు అని సదరు మెయిల్ ద్వారా తెలుసుకున్న ఎన్‌హెచ్ అధికారులు చివరికి తలలు పట్టుకున్నారు.
ల్యాంకో లిక్విడేటర్ నుంచి ఎన్‌హెచ్‌కు ఘాటు లేఖ
ల్యాంకో యజమాని ఎవరన్న దానిపై స్పష్టత
రాధా వాసవి అసెట్స్‌కు సంబంధం లేదని వెల్లడి
ఆ సంస్థకు డబ్బు చెల్లిస్తే తమకు సంబంధం లేదని స్పష్టీకరణ
ఇప్పటికే రూ.14 కోట్ల వరకూ చెల్లించేసిన ఎన్‌హెచ్
మరోసారి వివాదంలోకి వెస్ట్ బైపాస్ విద్యుత టవర్ల మార్పిడి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబోయే ల్యాంకో ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్ టవర్ లైన్స్ యాజమాన్యం ఎవరన్న ప్రశ్నకు చిక్కుముడి వీడింది. ఈ విషయంపై సదరు సంస్థ.. జాతీయ రహదారుల సంస్థకు స్పష్టతనిచ్చింది.
జరిగింది ఇదీ..
కొండపల్లిలోని ల్యాంకో పవర్ ప్రాజెక్టు ఆర్థిక నష్టాలతో దివాలా తీసింది. దీనిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో ఐపీ పిటిషన్ కూడా వేసింది. స్పందించిన జాతీయ లా ట్రిబ్యునల్.. ల్యాంకో పవర్ ప్రాజెక్టుకు రిజిస్టర్డ్ ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్ అయిన పంకజ్ ధనూకా అనే వ్యక్తిని లిక్విడేటర్‌గా నియమించింది. ఇతని బాధ్యత ఏంటంటే.. ల్యాంకో పవర్ ప్రాజెక్టు యాజమాన్యం ఎవరెవరికి అప్పులు ఉందో తెలుసుకుని, కోర్టు ద్వారా వాటి ఆస్తులు అమ్మి, అప్పులు తీర్చడం. తమకు న్యాయం చేయాలని జక్కంపూడి, నైనవరం రైతులు హైకోర్టును ఆశ్రయించిన క్రమంలో కోర్టు విచారణ సందర్భంగా ల్యాంకోకు లిక్విడేటర్ ఉన్న అంశం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో తాము తొందరపడ్డామని ఎన్‌హెచ్ కు అర్థమైంది.
లిక్విడేటర్ సమాధానంతో స్పష్టత
ఎన్‌హెచ్ లేఖపై లిక్విడేటర్ పంకజ్ ధనూకా ఈ-మెయిల్ ద్వారా స్పష్టతనిచ్చారు. ఆయన రాసిన లేఖలోని అంశాలను పరిశీలిస్తే.. కొండపల్లి పవర్ ప్రాజెక్టు దివాలా తీసిన నేపథ్యంలో ఫేజ్-3లో భాగంగా తాము ల్యాంకో ట్రాన్స్‌మిషన్ టవర్ లైన్లను ఆక్షన్ వేశామని, మయన్మార్‌కు చెందిన ఎంసీఎం అనే కంపెనీ కొనుగోలు చేసిందన్నారు. ఆ కంపెనీ పూర్తి డబ్బులు చెల్లించలేదని, తమ మధ్య నెలకొన్న వివాదం కూడా ఎన్‌సీఎల్‌టీలో నడుస్తోందన్నారు. ఎంసీఎం కంపెనీకి, రాధా సంస్థకు సంబంధం లేదని స్పష్టతనిచ్చారు. దీంతో పాటు తాము ఎక్కడా కూడా ల్యాంకో ట్రాన్స్‌మిషన్ టవర్ల లైన్ షిఫ్టింగ్‌కు అనుమతి ఇవ్వలేదని, వారికి డబ్బులు చెల్లిస్తే తమకు బాధ్యత లేదన్నారు. తమ అనుమతితో లేకుండా జరిగిన చర్యలకు చట్టపరమైన చిక్కులను కూడా చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఎన్‌హెచ్ ఏం చేసిందంటే..
విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో పవర్‌లైన్స్ అలైన్‌మెంట్ మార్పునకు ఎప్పుడో మూతపడిన ప్రాజెక్టుకు ఎన్‌హెచ్ అప్పట్లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు.. సూపర్ వైజేషన్ చార్జీలు రూ.35 లక్షలు, హైటెన్షన్ విద్యుత తీగలకు విద్యుత అంతరాయం పేరుతో రూ.14 కోట్లు ల్యాంకోను టేకోవర్ చేసుకున్నట్టుగా చెప్పుకొంటున్న రాధా వాసవీ అసెట్స్ అనే సంస్థకు చెల్లించింది. ఈ అంశం వివాదాస్పదమైంది. దీనిపై రైతులు హైకోర్టుతో పాటు జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేశారు. వీటిపై కోర్టు విచారణలు, కేంద్ర విజిలెన్స్ బృందం విచారణ నేపథ్యంలో జాతీయ రహదారుల సంస్థ.. ల్యాంకో పవర్‌లైన్స్‌కు యాజమాన్య ధ్రువీకరణ కోసం లిక్విడేటర్‌కు లేఖ రాసింది.