Share News

ఆలపాటి ఘన విజయం

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:41 AM

కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విజయభేరి మోగించారు. సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్‌ బలపర్చిన అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావుపై 82,230 ఓట్ల మెజారిటీ సాధించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోనూ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించారు. అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధికే యువత మొగ్గుచూపినట్టు ఈ ఫలితాలు రుజువు చేశాయి.

ఆలపాటి ఘన విజయం
గుంటూరులోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద విజయ చిహ్నాన్ని చూపిస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

‘కూటమి’కే జైకొట్టిన కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రులు

కేఎస్‌ లక్ష్మణరావుపై 82,230 ఓట్లతో గెలుపు

మొత్తం సాధించిన ఓట్లు 1,45,057

ఉమ్మడి కృష్ణాలోనూ తిరుగులేని ఆధిక్యత

రాజధాని ప్రాంతం అభివృద్ధికే యువత మొగ్గు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆద్యంతం కూటమి బలపర్చిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ హవానే కొనసాగింది. తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యం ప్రదర్శించిన ఆయన 82,230 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్‌ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావుపై తిరుగులేని విజయం సొంతం చేసుకున్నారు. ప్రతి రౌండ్‌లోనూ భారీ మెజారిటీని సాధించారు. ఆలపాటి ఘన విజయంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

వ్యూహాత్మకంగా అడుగులు

అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ఎన్నికలు కావటంతో కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. విజయమే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. అందుకు అనుగుణంగానే క్షేత్ర స్థాయిలో నేతలు, కార్యకర్తలు పనిచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచే టీడీపీ అధిష్టానం తమ నాయకులను అప్రమత్తం చేసింది. ప్రధానంగా ప్రజా ప్రతినిధులపై కీలక బాధ్యతలను పెట్టింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్‌ పదవులు పొందిన వారు ఇలా ప్రతి ఒక్కరికీ ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగిస్తూ భాగస్వాములను చేసింది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో పార్టీ నాయకత్వానికి పోల్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను అప్పగించింది. నూరు శాతం పార్టీకి చెందిన వారి ఓట్లు పడేలా చర్యలు తీసుకుంది. పట్టభద్ర ఓటర్లను చేర్పించటంలోనూ టీడీపీ శ్రేణులు విజయవంతమయ్యాయి. ఓట్లను చేర్పించటం ఒక ఎత్తు అయితే నూటికి నూరు శాతం ఓట్లు వేయించగలిగేలా పోల్‌ మేనేజ్‌మెంట్‌ను చాలా చక్కగా నిర్వహించింది. మంత్రి నారా లోకేశ్‌ వార్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వార్‌ రూమ్‌ ద్వారా లోకేశ్‌ ఎంతో పకడ్బందీగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ను నిర్వహించారు. దీంతో కూటమి శ్రేణుల ప్రతి ఓటు నమోదైంది.

వైసీపీకి బుద్ధి చెప్పాలన్న కసితోనూ..

ఈ ఎన్నికల్లో వైసీపీ తన అభ్యర్థిని నిలపకపోయినా.. పీడీఎఫ్‌ అభ్యర్థికి అంతర్గతంగా మద్దతు తెలిపింది. అమరావతి రాజధాని విధ్వంసానికి ఒడిగట్టిన జగన్‌ పార్టీ పీడీఎఫ్‌ అభ్యర్థికి పరోక్షంగా మద్దతు తెలపడం కూడా పట్టభద్ర ఓటర్లలో కసిని రేపింది. అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకమైన స్థానాన్ని కోల్పోతే ప్రత్యర్థికి బలం ఇచ్చినట్టు అవుతుందన్న ఉద్దేశ్యంతో కూడా పట్టభద్ర ఓటర్లు తమ విస్పష్ట తీర్పును ఇచ్చారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు తిరుగులేని మెజారిటీని ఇవ్వడం ద్వారా వైసీపీకి పట్టభద్రులు పరోక్ష సంకేతాలు పంపినట్టుగా కూడా అర్థం చేసుకోవాల్సి వస్తోంది. వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీలో ఉండకపోవటంతో పెద్దగా ఓట్లను కూడా చేర్చలేదు. ఓటింగ్‌లో కూడా పెద్దగా పాల్గొనలేదని సమాచారం. జగన్‌ వైఖరిలో ఇప్పటికీ మార్పు రావటం లేదన్న కారణంతో వైసీపీకి చెందిన వారు కూడా కూటమి బలపర్చిన అభ్యర్థికి ఓట్లు వేసినట్టుగా తెలుస్తోంది.

కూటమి స్ఫూర్తికి నిదర్శనం

కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా పనిచేశాయనడానికి ఈ విజయమే నిదర్శనంగా నిలుస్తోంది. కూటమి నేతల స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల శ్రేణులు కదిలాయి. టీడీపీ శ్రేణులతో కలిసి పోల్‌ మేనేజ్‌మెంట్‌ను ముందుకు తీసుకువెళ్లటంలో కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా కృషి చేశాయి.

మొదటి ప్రాధాన్యతలోనే..

ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ భారీగా ఓట్లను సాధించారు. దీంతో మొదటి రౌండ్‌ నుంచే ఆయన మెజారిటీ ప్రత్యర్థిని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. మొత్తం తొమ్మిది రౌండ్లకు గాను మొదటి రౌండ్‌లో 17,194, రెండో రౌండ్‌లో 17,527, మూడో రౌండ్‌లో 16,722, నాలుగో రౌండ్‌లో 16,236, ఐదో రౌండ్‌లో 16,916, ఆరో రౌండ్‌లో 17,028, ఏడో రౌండ్‌లో 16,477, ఎనిమిదో రౌండ్‌లో 16,900, తొమ్మిదో రౌండ్‌లో 10,087 ఓట్లు చొప్పున సాధించి మొత్తంగా 1,45,057 ఓట్లను కైవశం చేసుకున్నారు.

Updated Date - Mar 05 , 2025 | 12:41 AM