సమగ్ర కౌలు చట్టాన్ని తేవాలి
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:44 AM
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కౌలురైతుల సంక్షేమం కోసం తక్షణమే సమగ్రమైన కౌలుచట్టాన్ని తీసుకురా వాలని, అన్నదాత సుఖీభవన పథకం కింద రూ.20వేలు పెట్టుబడి సాయం అదించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య డిమాండ్ చేశారు.

చల్లపల్లి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కౌలురైతుల సంక్షేమం కోసం తక్షణమే సమగ్రమైన కౌలుచట్టాన్ని తీసుకురా వాలని, అన్నదాత సుఖీభవన పథకం కింద రూ.20వేలు పెట్టుబడి సాయం అదించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘం పిలుపులో భాగంగా చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు కౌలు చట్టాన్ని తీసుకురా వటంలో విఫలమైందన్నారు. చట్టం లేకపోవటం వల్ల వ్యవసాయ, ఉద్యానపంటలకు బ్యాంకులు ఇచ్చే రుణాలు కౌలురైతులు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది కౌలురైతులుంటే గుర్తింపు కార్డులు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో కౌలురైతులకు రూ.3820 కోట్లు పంట రుణాలుగా ఇచ్చామని చెప్పటం బూటకమన్నారు. వాస్తవ సాగుదారులైన కౌలురైతులకు గుర్తింపు కార్డుల లేవనీ, పంట రుణాలు ఇవ్వటం లేదనీ అలాంటపుడు బినామీ వారే రుణాలు పొందుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ పంటలను అమ్ముకోలేక మధ్య దళారులకు అమ్ముకుని నష్టపోతున్నారనీ, బ్యాంకుల ద్వారా రుణాలు పొందలేక అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి పంటలు పండిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నూతన కౌలురైతుల చట్టాన్ని తీసుకురావాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు తలారి రామారావు, నియోజకవర్గ కార్యదర్శి అట్లూరి వెంకటేశ్వరరావు, గోగినేని రత్తయ్య, లంక నాగమల్లేశ్వరరావు, ఏఐవైఎఫ్ నేత సిద్ధాబత్తుల వాసు పాల్గొన్నారు.