Share News

రెక్కీచేసి.. రైల్లో చోరీ

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:41 AM

డబ్బు బ్యాగ్‌తో రైలెక్కుతున్న వారిని కొందరు పసిగట్టారు. ప్రయాణికుల్లా నటించారు. సదరు ప్రయాణికులు గాఢనిద్రలోకి జారుకున్నాక బ్యాగ్‌తో ఉడాయించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను నగరంలోని ప్రభుత్వ రైల్వే పోలీసు విభాగ ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రత్నరాజు గురువారం వెల్లడించారు.

రెక్కీచేసి.. రైల్లో చోరీ
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ రత్నరాజు. పక్కన జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ జేవీ రమణ, ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌

  • రూ.64 లక్షలున్న బ్యాగ్‌తో మాయం

  • సీసీ కెమెరాలతో కేసు ఛేదించిన పోలీసులు

  • బాధితులు, నిందితులు రాజమండ్రివాసులు

విజయవాడ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : డబ్బు బ్యాగ్‌తో రైలెక్కుతున్న వారిని కొందరు పసిగట్టారు. ప్రయాణికుల్లా నటించారు. సదరు ప్రయాణికులు గాఢనిద్రలోకి జారుకున్నాక బ్యాగ్‌తో ఉడాయించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను నగరంలోని ప్రభుత్వ రైల్వే పోలీసు విభాగ ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రత్నరాజు గురువారం వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పింటు కుమార్‌జైన్‌, రాకేశ్‌ కుమార్‌జైన్‌ అన్నదమ్ములు. వారు ‘పింటు కుమార్‌ బ్యాంకర్స్‌’ పేరుతో జ్యువెలరీ వ్యాపారం చేస్తున్నారు. వారి వద్ద పనిచేసే మనోజ్‌కుమార్‌ జైన్‌, హితేశ్‌కుమార్‌ జైన్‌కు బ్యాగ్‌లో రూ.64 లక్షలు పెట్టి ఇచ్చారు. చెన్నై వెళ్లాక ఫోన్‌ చేయాలని, ఏ షాపు వద్దకు వెళ్లాలో చెప్తానని పింటూ చెప్పారు. బ్యాగ్‌లో ఎంత ఉందని మనోజ్‌కుమార్‌ యజమానిని అడిగాడు. ఎవరైనా అడిగితే రూ.10 లక్షలు ఉంటాయని చెప్పమని సలహా ఇచ్చి, అసలు మొత్తం మాత్రం చెప్పలేదు. మనోజ్‌, హితేశ్‌కు భువనేశ్వర్‌ నుంచి రామేశ్వరం వెళ్లే రైల్లో టికెట్‌ బుక్‌ చేశారు. ఇద్దరిలో మనోజ్‌కు బెర్త్‌ ఖరారైంది. ఈనెల 24వ తేదీ సాయంత్రం వారిద్దరూ డబ్బు బ్యాగ్‌తో బీ2 భోగిలో ఎక్కారు. మనోజ్‌కు పై బెర్త్‌ రావడంతో కింది బెర్త్‌ కింద బ్యాగ్‌పెట్టి పైకి ఎక్కాడు. హితేశ్‌ భోగీలోని బెడ్‌రోల్‌పై పడుకున్నాడు.

రాజమండ్రి నుంచే రెక్కీ

రాజమహేంద్రవరం తుమ్మలోవ ప్రాంతానికి చెందిన ఆకుల సాయికృష్ణ ఈ జ్యువెలరీ షాపులో పనిచేసి మానేశాడు. బంగారం వ్యాపారులు ప్రతినెలా అందులో పనిచేసే వారికి డబ్బిచ్చి చెన్నై పంపుతారన్న విషయంపై సాయికృష్ణకు తెలుసు. ఆ బ్యాగ్‌ను కాజేస్తే జీవితంలో స్థిరపడిపోవచ్చని భావించాడు. ఈ స్కెచ్‌ను స్నేహితులైన పెండెం ప్రసన్నకుమార్‌, ఉల్లూరి మహేశ్‌కుమార్‌తో పంచుకున్నాడు. మనోజ్‌, హితేశ్‌ నగదు బ్యాగ్‌తో బయల్దేరుతున్నారని సమాచారం తెలుసుకున్న ఈ గ్యాంగ్‌ ఈనెల 24వ తేదీన రైల్వేస్టేషన్‌కు వచ్చింది. మనోజ్‌, హితేశ్‌లు ఎక్కిన భోగీకి ముందున్న బీ1 భోగీలో ఎక్కారు. ముగ్గురూ మాస్కులు ధరించి రైల్లో తిరిగారు. మనోజ్‌, హితేశ్‌ నిద్రలో ఉన్నారని గమనించి విజయవాడ రైల్వేస్టేషన్‌కు రాగానే బ్యాగ్‌తో ఒక నెంబరు ప్లాట్‌ఫాంలో దిగి బయటకు వెళ్లిపోయారు. రైలు నెల్లూరు వెళ్లాక మనోజ్‌కుమార్‌ చూసుకోగా, బ్యాగ్‌ కనిపించలేదు. ఈ విషయాన్ని ఫోన్‌లో యజమానికి చెప్పగానే, పింటూ సొమ్ముసిల్లి పడిపోయాడు. నెల్లూరు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా, వారు స్వీకరించలేదు. దీంతో తిరిగి వారు విజయవాడ వచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ జేవీ రమణ.. స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, ముగ్గురు నిందితులు బ్యాగ్‌తో ప్లాట్‌ఫాంపైకి వచ్చి బయటకు వెళ్తున్నట్టు కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాగ్‌లో రూ.10 లక్షలు ఉన్నాయని బాధితులు చెప్పడంతో ఆ మొత్తాన్నే ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రెండు రోజుల తర్వాత యజమానులు వచ్చి బ్యాగ్‌లో ఉంది రూ.10 లక్షలు కాదని, రూ.64 లక్షలని చెప్పారు.

మూడు బృందాలు ఏర్పాటు

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తునకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో దర్యాప్తు చేయడానికి ఒక బృందం, విజయవాడ స్టేషన్‌లో దర్యాప్తునకు మరో బృందం, నిందితుల కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. బెజవాడ రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, నిందితులు ముగ్గురు పదో నెంబరు ప్లాట్‌ఫాం నుంచి బయటకు వెళ్లినట్టు కనిపించింది. అక్కడి నుంచి పీఎన్‌బీఎస్‌ వరకు వెళ్లి మరో ఆటోలో రామవరప్పాడు రింగ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి క్యాబ్‌లో రాజమహేంద్రవరం వెళ్లిపోయారు. ఎంజీ రోడ్డులో ఉన్న ఆపరేషనల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. క్యాబ్‌ నెంబర్‌ ఆధారంగా నిందితులకు సంకెళ్లు వేశారు. నిందితుల నుంచి మొత్తం రూ.64 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:41 AM