Share News

కృష్ణంరాజు వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ సుమోటో విచారణ

ABN , Publish Date - Jun 11 , 2025 | 05:24 AM

జగన్‌ చానల్‌లో జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) సుమోటోగా విచారణకు తీసుకుంది.

కృష్ణంరాజు వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ సుమోటో విచారణ

  • తీసుకున్న చర్యలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం

అమరావతి, న్యూఢిల్లీ, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): జగన్‌ చానల్‌లో జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) సుమోటోగా విచారణకు తీసుకుంది. ఆయనపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ మంగళవారం కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ రాష్ట్ర డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు లేఖ రాశారు. ఆ వ్యాఖ్యలపై విచారణను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, తీసుకున్న చర్యలపై మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలను ఉద్దేశించి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అప్రతిష్ఠను కలిగించేవిగా కమిషన్‌ పేర్కొంది. ‘వేశ్యల రాజధాని’ అన్న మాటలను ఖండించిన ఎన్‌సీడబ్ల్యూ... అది అమరావతి మహిళా రైతులను ఘోరంగా అవమానించడమేనని స్పష్టం చేసింది.

ఎన్‌సీడబ్ల్యూ స్పందన అభినందనీయం: లోకేశ్‌

‘అమరావతి మహిళలను లక్ష్యంగా చేసుకుని కృష్ణంరాజు చేసిన అవమానకర వ్యాఖ్యలు కచ్చితంగా ఖండించదగ్గవి. ఈ విషయంలో జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా’ అని మంత్రి లోకేశ్‌ అన్నారు. మంగళవారం ఎక్స్‌లో ఈ విషయంపై స్పందించారు. ‘అమరావతి మహిళలను అవమానించేలా చేసిన కామెంట్లపై జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ స్పందించిన తీరు అభినందనీయం. అమరావతి మహిళా రైతులను వేశ్యలని పేర్కొనడం సిగ్గుచేటు మాత్రమే కాదు... వారి త్యాగాలను అవమానించే నేరపూరిత కుట్ర. రాజధాని అమరావతి పోరాటానికి మహిళా రైతులే వెన్నుముక. వారికి బలమైన అండగా నిలబడతాం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 05:25 AM