Share News

Kotamreddy sridhar reddy: బావిలో దూకాల్సింది నువ్వే..: ఎమ్మెల్యే కోటంరెడ్డి కౌంటర్

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:39 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

Kotamreddy sridhar reddy: బావిలో దూకాల్సింది నువ్వే..: ఎమ్మెల్యే కోటంరెడ్డి కౌంటర్
TDP MLA Kotamreddy Sridhar Reddy

నెల్లూరు, జులై 31: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. గురువారం నాడు నెల్లూరులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బ్రాండ్ ఇమేజ్‌తో ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అలాంటి సీఎంను అభినందించుకున్నా ఫర్వాలేదు కానీ.. ఆయనను శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగితే పోలీసుల వైఫల్యం అంటూ ప్రభుత్వంపై నిందలు వేశారని గుర్తు చేశారు.


అయితే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. నెల్లూరు పర్యటన సందర్భంగా ముందస్తు చర్యలు తీసుకుంటే ఆంక్షలంటున్నారని వైసీపీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును బావిలో దూకాలని వైఎస్ జగన్ అంటున్నారు.. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ జగనే బావిలో దూకాలని ధ్వజమెత్తారు. జగన్ పర్యటన సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ చెయ్యి విరగొట్టారని ఆగ్రహించారు.


ప్రభుత్వాసుపత్రి గోడను సైతం కూలగొట్టారని తెలిపారు కోటంరెడ్డి. నడి రోడ్డుపై ధర్నాలకు దిగారన్నారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. అలా అయితేనే ఈ తరహా ఘటనలు పునరావృతం కావని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ వెంట ఉన్న అనుచరగణం వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా కోటంరెడ్డి ఎండగట్టారు. చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని హెచ్చరించారు. గత ఐదేళ్ల అధికారంలో ఉండి.. అన్ని వ్యవస్థలను నాశనం చేశారంటూ వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులకు తాము తప్పకుండా సమాధానం ఇస్తామన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో పరుగులు పెట్టిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ప్రశంసించారు. రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు ఉండడం వల్లే.. ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైఎస్ జగన్‌కు హితబోధ చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేశారు.


అదే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా ఎన్నో నిర్ణయాలు తీసుకుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి వివరించారు. గత ఐదేళ్లలో టీడీపీ సీనియర్ల మీద ఏ విధంగా కేసులు పెట్టావో మరిచిపోయావా అంటూ వైఎస్ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు కోటంరెడ్డి. గతంలో అక్క, అన్నా అంటూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల చుట్టు వైఎస్ జగన్ తిరిగారన్నారు. ఆ తర్వాత వారిపై ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో.. అతడిని వైఎస్ జగన్ వెనకేసుకు వస్తున్నాడన్నారు.


మీకు ఇంగిత జ్ఞానం ఉంటే.. సీఎం చంద్రబాబు నాయుడికి, నెల్లూరు జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వైఎస్‌ జగన్‌ను డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై జగన్ మైనింగ్ ఆరోపణలు చేశారన్నారు. ఇదే మైనింగ్ మీ తాత వైఎస్ రాజారెడ్డి సైతం చేశారని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు గుర్తు చేశారు. గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీ పార్టీకి చేసిన సాయాన్ని మరిచిపోయారా? అంటూ వైఎస్ జగన్‌ను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం స్కామ్‌లో స్వాధీనం చేసుకున్న సొమ్ముపై కోర్టు కీలక నిర్ణయం

ఏఆర్ కానిస్టేబుల్‌పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సన్నిహితుడు దాడి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 09:44 PM