Kidney Disease Strikes Villages: ఆ ఊర్లకు కిడ్నీ జబ్బు!
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:48 AM
నెల్లూరుకు 15కి.మీ దూరంలోని కొమ్మరపూడి, కొత్తవెల్లంటి గ్రామాలను కిడ్నీవ్యాధి కలవరపెడుతోంది. నెల్లూరు రూరల్ మండల పరిధిలోకి వచ్చే ఈ రెండు గ్రామాల్లో ఇప్పటి వరకు అనేకమంది ....
కొమ్మరపూడి, కొత్తవెల్లంటిలో మహమ్మారి
నెల్లూరు రూరల్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): నెల్లూరుకు 15కి.మీ దూరంలోని కొమ్మరపూడి, కొత్తవెల్లంటి గ్రామాలను కిడ్నీవ్యాధి కలవరపెడుతోంది. నెల్లూరు రూరల్ మండల పరిధిలోకి వచ్చే ఈ రెండు గ్రామాల్లో ఇప్పటి వరకు అనేకమంది ఈ వ్యాధికారణంగానే చనిపోయినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. నిండా 300 గడపలు కూడా లేని కొమ్మరపూడిలో గత నాలుగేళ్లలో కిడ్నీ వ్యాధికారణంగానే ఏడుగురు చనిపోయారు. ప్రస్తుతం పది మందికిపైగానే బాధితులు ఉన్నారు. ఈ గ్రామంలోని వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలవారే.
వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులు, రైతుకూలీలే. అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్తున్నవారు కిడ్నీ వ్యాధి సోకిందని చెబుతుండడంతో ఏంచేయాలో తెలీక ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్తే కిడ్నీ వ్యాధి వచ్చిందని మందులిస్తున్నారు. జబ్బు నిర్ధారణ అయ్యే సరికి డయాలిసిస్ దశకు వస్తున్నట్లు వారు వాపోతున్నారు. కొత్తవెల్లంటిని 20 ఏళ్లుగా ఈ వ్యాధి పీడిస్తోంది. 2వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇప్పటివరకు 20 మంది వరకు కిడ్నీ వ్యాధితో మరణించారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ గ్రామానికి బోర్ల నీరే దిక్కు. అధికార యంత్రాంగం సమగ్ర సర్వే నిర్వహించి, వ్యాధి మూలాలను గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఎందుకు వస్తోందో తెలియడం లేదు
మా ఊర్లో కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. అసలు వాటి మూలాలు ఎక్కడున్నాయో అయోమయంగా ఉంది. వృద్ధులతోపాటు, యువకులు కూడా వ్యాధి బారిన పడుతున్నారు. అధికారులు సర్వే చేసి వాస్తవాలు నిగ్గుతేల్చాలి.
- ఉప్పునూతల జనార్దన్, కొమ్మరపూడి


పరిశీలిస్తున్నాం...
ఈ రెండు గ్రామాల్లోనే కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో పరిశీలిస్తున్నాం. ఈ గ్రామాల్లో డయాబెటిక్ రోగులు ఎక్కువగా ఉన్నారు. వీరు దీర్ఘకాలికంగా వాడే మందుల వల్ల కూడా కిడ్నీ వ్యాధి రావచ్చు. ఆహారపు అలవాట్లూ కొంత కారణం కావచ్చు. పీహెచ్‌సీకి వచ్చే రోగులను పరిశీలిస్తున్నాం.
- డాక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి, సౌత్ మోపూరు పీహెచ్‌సీ వైద్యుడు
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్