Kia Engine Theft: కియలో ఇంటి దొంగలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:38 AM
కియ పరిశ్రమలో ఇంజన్ల మాయం ప్రాథమికంగా ఇంటి దొంగల పనిగా గుర్తించబడింది. పఠాన్ సలీం అనే ఉద్యోగి, ఆర్థిక నష్టం 23.50 కోట్లు, సిట్ దర్యాప్తు కొనసాగుతుంది

ఐదేళ్లుగా మాయమవుతున్న ఇంజన్లు
ఏ-1గా పరిశ్రమ ఉద్యోగి పఠాన్ సలీం
మాయమైన ఇంజన్ల విలువ 23.50 కోట్లు
హిందూపురం, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): కియ పరిశ్రమలో కారు ఇంజన్ల మాయం ఇంటి దొంగల పనేనని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఈ కేసులో సంస్థ ఉద్యోగి పఠాన్ సలీంను ఏ-1గా చేర్చిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు. గతేడాది డిసెంబరు 12న పటాన్ సలీం తను విధులు నిర్వహించే చోట కాకుండా, మరోచోట సంచరించినట్లు కియ అధికారులు గుర్తించారు. ఇంజన్ షాప్ మొబిస్ గేట్ వద్ద అనధికారిక వాహనాలు సంచరించే సమయంలో అతను వెళ్లిరావడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో అధికారులు అంతర్గత పరిశీలన జరిపారు. హుండాయ్ మోటార్ ఇండియా(హెచ్‌ఎంఐ) ఇంజన్లను తీసుకెళ్లే దృశ్యాలు, వాటి రికార్డుల్లో తేడాలను గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో చేపట్టిన వార్షిక లెక్కల పరిశీలనలో 940 ఇంజన్లు తక్కువ రావడంతో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అక్రమాలను నిగ్గుతేల్చాలని కోరుతూ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ విభాగం అధిపతి సాయి నందన్ గతనెల 19న కియ ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. పఠాన్ సలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు, మొత్తం కుట్రను ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. సీసీ ఫుటేజీతో పాటు కియ రికార్డులను పరిశీలించి, అక్రమార్కులను గుర్తించే దిశగా సిట్ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.
ఆ ఇంజన్లు ఏమయ్యాయి?
మాయమైన ఒక్కో ఇంజిన్ విలువ రూ.2.50 లక్షలు అని సమాచారం. ఈ లెక్కన కియకు రూ.23.50 కోట్లు నష్టం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరగడాన్ని పరిశ్రమ నిర్వాహకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాధ్యమైనంత త్వరగా బాధ్యులను పట్టుకోవాలని పోలీసులను కోరడంతో డీజీపీ కార్యాలయమే దగ్గరుండి ఈ కేసును పర్యవేక్షిస్తోంది. సిట్ అధికారులు తమిళనాడు సహా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లి అనుమానితులను పట్టుకుంటున్నారు. మాయమైన ఇంజన్లు ఎక్కడకు చేరాయని ఆరా తీస్తున్నారు.