Liquor Scam AP: ఏది అడిగినా దాటవేత.. మౌనం
ABN , Publish Date - May 15 , 2025 | 02:54 AM
లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులు సిట్ అధికారులతో ఇంటరాగేషన్ చేయించుకుంటున్నప్పటికీ సహకరించలేదు. మాజీ సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి మౌనంగా ఉండిపోయారు.
లేదంటేఅధికారులకే ఎదురుప్రశ్నలు
ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తీరిది
6 గంటలు.. 60 ప్రశ్నలు వేసిన సిట్
లిక్కర్ స్కామ్‌పై ఎంతో ఓపిగ్గా అడిగినా ఇద్దరిదీ ఒకే ధోరణి
ఒక దశలో వేర్వేరుగా విచారించిన వైనం
నేడు మరోసారి విచారణకు పిలిచిన సిట్
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ‘మద్యం పాలసీ రూపొందించేది ప్రభుత్వం. ఆ పాలసీని అమలు చేసేది అబ్కారీ శాఖ. ఈ కేసుతో మాకేంటి సంబంధం?’ అంటూ లిక్కర్ స్కామ్‌లో ఇద్దరు కీలక నిందితులు దర్యాప్తు అధికారులనే ఇంటరాగేషన్ చేశారు. అధికారుల ప్రశ్నలకు తెలియదు అంటూ చాలావరకు దాటవేశారు. మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయారు. ఎన్నో విధాలుగా, ఎంతో ఓపిగ్గా సిట్ అధికారులు ప్రశ్నించినా వారిద్దరి ధోరణిలో మార్పు లేదని తెలిసింది. ఇప్పటివరకూ అరెస్టయిన, వాంగ్మూలాలిచ్చినవారిలో ఎక్కువ మంది మాజీ సీఎం జగన్ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి(ఏ31), మాజీ ఓఎ్‌సడీ కృష్ణమోహన్ రెడ్డిల(ఏ 32) పేర్లు చెప్పారు. సిట్ నోటీసులను బేఖాతరు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ ఇద్దరూ అనూహ్యంగా విజయవాడలోని సిట్ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణకు హాజరయ్యారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.15వరకూ సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ అధికారులు వారికి ప్రశ్నలు సంధించారు.

ఆరు గంటలకుపైగా అరవై ప్రశ్నలు అడిగినా కొంచెమైనా నిందితులు సహకరించలేదని తెలిసింది. పైగా ఎదురు ప్రశ్నలతో ధనుంజయ్ రెడ్డి సిట్ అధికారులనే ఇంటరాగేషన్ చేసినట్లు సమాచారం. ‘లిక్కర్ పాలసీ రూపొందించిన మీటింగ్‌లో పాల్గొన్న మీరు పోషించిన పాత్ర ఏంట’ని అడగ్గా.. ‘ప్రభుత్వం రూపొందిస్తుంది..
అబ్కారీ శాఖ అమలు చేస్తుంది.. నా పాత్ర ఇందులో ఎందుకు ఉంటుంది?’ అంటూ ధనుంజయ్ రెడ్డి ఘాటుగా బదులిచ్చినట్లు తెలిసింది. ‘పాలసీ నుంచి పైసా వసూల్ వరకూ అన్నీ మాకు తెలుసు.. ఇప్పటివరకూ విచారించినవారిలో ఎక్కువమంది మీ ప్రతి చర్యనూ వెల్లడించారు.. గతంలో ఎప్పుడైనా మీ సర్వీసులో లిక్కర్ పాలసీ రూపొందించిన అనుభవం ఉందా?.’ అని అడగ్గా.. ఎవరు ఏమి చెప్పారో మాకు అనవసరం.. పాలసీ లేదు, పైసా లేదు.. మాకెప్పుడూ అలాంటి అనుభవం లేదని బదులిచ్చారు. ఆ సమావేశాల్లో పాల్గొన్న విజయసాయి రెడ్డి(ఏ 4), మొత్తం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(ఏ1) కూడా మీ పేర్లు చెప్పారు.. అంటూ ప్రశ్నించిన అధికారులతో.. వారిద్దరూ అలా ఎందుకు చెప్పారో మాకు తెలీదు.. అయినా ఎవరు ఏది చెబితే అది నిజమవుతుందా.. మాకు ఎలాంటి సంబంధం లేదు.. అంటూ ఇద్దరూ ఒకటే సమాధానం ఇచ్చారు. దీంతో ఇరువురినీ వేర్వేరుగా కూర్చోబెట్టి ప్రశ్నల పరంపర కొనసాగించారు. అయినా, సిట్ అధికారులకు ఎలాంటి సహకారం లభించలేదు. ఏ ప్రశ్న అడిగినా.. మాకు సంబంధం లేదు.. అనడం లేదంటే మౌనం వహించడం.. తప్ప మరొక జవాబు వారిద్దరి నుంచి రాలేదని తెలిసింది. మద్యం ముడుపుల వసూళ్ల వరకూ ఈ కుంభకోణంలో భాగస్వామ్యం గురించి అడగ్గా, ఏమీ తెలీదని చెప్పారు.. ఎక్కువ ప్రశ్నలకు మౌనంగా ఉన్నారు తప్ప నోరు విప్పలేదు. ఓపిగ్గా ప్రశ్నించిన సిట్ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐదేళ్ల పాటు మీ ఇద్దరూ అన్నీ తెలిసిన వ్యక్తులు..మీకు ఇంత పెద్ద వ్యవహారం తెలీదా? అని ప్రశ్నించగా... కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకూ కూడా తమకు తెలియదు అని బదులిచ్చారని తెలిసింది.
ఒక్కసారి కూడా రాజ్‌తో మాట్లాడలేదట!
వైసీపీ హయాంలో ఒక్కసారి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో మాట్లాడలేదని ధనుంజయ్ రెడ్డి ఇచ్చిన సమాధానంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ స్థాయిలో విచారణకు సిద్ధమై వచ్చారా.? అంటూ ముక్కున వేలేసుకున్నారు. ‘రాజ్ కసిరెడ్డి నామినేటెడ్ పదవిలో ఉండే వ్యక్తి.. నేను సీఎంవోలో పనిచేసే అధికారిని...నాకు ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది?.’ అని ఎదురు ప్రశ్నించారని సమాచారం. అందరూ మీ పేరు చెబుతున్నారని అడిగితే.. అలా ఎందుకు చెబుతున్నారో వాళ్లకే తెలియాలి అంటూ బదులిచ్చారు. అయితే, రేపు ఉదయం విచారణకు వచ్చేటప్పుడు మీ అనుయాయుడు శ్రీధర్‌ను వెంటబెట్టుకుని రండి.. అంటూ సిట్ అధికారులు విచారణ ముగించారు. మరో వైపు కృష్ణమోహన్ రెడ్డిని లిక్కర్ ముడుపుల వసూళ్లు, పెట్టుబడులు, కుటుంబ వ్యాపారాల గురించి అధికారులు ప్రశ్నించారు. గురువారం విచారణకు ఆయా వ్యాపారాలకు సంబంధించి ఆడిట్ రిపోర్టులు, బ్యాంకు లావాదేవీల వివరాలు తీసుకు రండి అని చెప్పినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News