Share News

Liquor Scam: రాజ్‌ కసిరెడ్డి బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా

ABN , Publish Date - Jun 05 , 2025 | 06:09 AM

తనకు బెయిల్‌ మంజూరు చేయాలని విజయవాడ జిల్లా జైల్లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇన్‌చార్జి కోర్టుగా ఉన్న సీబీఐ కోర్టులో సిట్‌ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు.

 Liquor Scam: రాజ్‌ కసిరెడ్డి బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా

బ్యారక్‌ మార్పునకు కోర్టు అనుమతి

బెయిల్‌ కోసం ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి పిటిషన్లు

గ్రూపు1 కేసులో మధుసూదన్‌కు రిమాండ్‌ పొడిగింపు

విజయవాడ, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 6వ తేదీకి వాయిదా పడింది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని విజయవాడ జిల్లా జైల్లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇన్‌చార్జి కోర్టుగా ఉన్న సీబీఐ కోర్టులో సిట్‌ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక రాజ్‌ కసిరెడ్డి బ్యారక్‌ మార్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. జైలులో తాను ఒంటరిగా ఉంటున్నానని, ఇతర ఖైదీలు ఉన్న బ్యారక్‌కు మార్చాలని ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కోర్టు న్యాయాధికారి సీతారామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రాజ్‌ కసిరెడ్డిని ఒక్కరు లేక ఇద్దరు ఖైదీలున్న బ్యారక్‌లోకి మార్చాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా మాజీ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, జగన్‌ ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌లు దాఖలు చేశారు. మరో నిందితుడు బాలాజీ గోవిందప్ప బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సిట్‌ అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 6కి వాయిదా వేసింది. కాగా, ఏపీపీఎస్సీ గ్రూపు1 కేసులో ఏ2గా ఉన్న పమిడికాల్వ మధుసూదన్‌కు కోర్టు రిమాండ్‌ పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న మధుసూదన్‌ను పోలీసులు మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో బుధవారం హాజరుపరిచారు. ఆయనకు ఈనెల 18వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి దేవిక ఉత్తర్వులు ఇచ్చారు. తనకు జైల్లో అనారోగ్యంగా ఉంటోందని, ఆసుపత్రికి తరలించాలని మధుసూదన్‌ న్యాయాధికారికి విజ్ఞప్తి చేయగా, జైలు అధికారులకు ఆదేశాలు ఇస్తామని ఆమె చెప్పారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 06:09 AM