Share News

Demolition: కాశినాయన ఆశ్రమం కూల్చివేత దుర్మార్గం

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:03 AM

పేదవాడి ఆకలి తీర్చే క్షేత్రం.. కాశినాయన ఆశ్రమాన్ని కూల్చడం దుర్మార్గమైన చర్యగా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కుల, మత, జాతి తేడాల్లేకుండా ఆశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు ఖాళీ చేయించడం సరికాదన్నారు.

Demolition: కాశినాయన ఆశ్రమం కూల్చివేత దుర్మార్గం

  • లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు

  • రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పునర్నిర్మించాలి

  • అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేల డిమాండ్‌

  • సమస్య పరిష్కారమవుతుంది: ఆనం

  • సొంత ఖర్చుతో నిర్మించేందుకు లోకేశ్‌ సంసిద్ధత

అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): పేదవాడి ఆకలి తీర్చే క్షేత్రం.. కాశినాయన ఆశ్రమాన్ని కూల్చడం దుర్మార్గమైన చర్యగా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కుల, మత, జాతి తేడాల్లేకుండా ఆశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు ఖాళీ చేయించడం సరికాదన్నారు. కడప జిల్లా బద్వేలు సమీపంలోని నల్లమల అడవుల్లో ప్రతి రోజూ వేలాది మంది ఆకలి తీర్చే అవధూత కాశినాయన ఆశ్రమాన్ని ఇటీవల అటవీ శాఖ అధికారులు కూల్చేశారు. ఆశ్రమాన్ని కూల్చివేయడం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పెద్ద దుమారమే రేపింది. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గౌరు చరిత (పాణ్యం-టీడీపీ), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు-బీజేపీ) ఈ అంశాన్ని లేవనెత్తారు. బాధ్యులపై చర్య తీసుకోవాలని, కూల్చిన ఆశ్రమాన్ని అక్కడే రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో నిర్మించాలని డిమాండ్‌ చేశారు. దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందిస్తూ.. లక్షలాది మందికి నిరంతరాయంగా అన్నం పెట్టి ఆకలి తీర్చే కాశినాయన ఆశ్రమం కూల్చివేత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇటీవల శ్రీశైలంలో స్వామి వారికి వస్త్రాలు సమర్పించేందుకు దేవదాయ మంత్రి హోదాలో వెళ్లిన తనను.. అక్కడి అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరీ దేవి దర్శనానికి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుచెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పటి సాధారణ అడవులు ఇప్పుడు రిజర్వ్‌ ఫారెస్ట్‌, పులుల అభయారణ్యంగా మారడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అటవీశాఖ ఆదేశాల మేరకే నల్లమల అటవీ ప్రాంతంలోని ఆశ్రమాన్ని కూల్చేసినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారని.. ఈ విషయమై కేంద్ర అటవీ-పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ ద్వారా మాట్లాడామని.. సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కూల్చివేసిన ఆశ్రమ నిర్మాణాలను తన సొంత ఖర్చుతో నిర్మించేందుకు విద్యా మంత్రి లోకేశ్‌ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.


98% రెవెన్యూ ఫిర్యాదులు పరిష్కారం..

17.jpg

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలు 98 శాతం వరకూ పరిష్కారమయ్యాయని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. రీ సర్వేలో భాగంగా 6,685 గ్రామాల నుంచి 2.74 లక్షల ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. భూమార్పిడి-రిజిస్ట్రేషన్లలో సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, బండారు శ్రావణిశ్రీ, మిరియాల శిరీషాదేవి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. భూ సర్వే పక్కాగా జరుగుతోందని, రైతులు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి భూమి సరిహద్దులు, వివరాలు సులభంగా తెలుసుకోవచ్చన్నారు. అయితే రెవెన్యూ సమస్యలపై సభలో ఇప్పటికే సమాధానాలు చెప్పిన వాటి గురించే సభ్యులు మళ్లీ మళ్లీ అడుగుతున్నారని ఆయన అన్నారు.


తలసీమియాకు ఆరోగ్యశ్రీ..: మంత్రి

17.jpg

తలసీమియాతో బాధపడుతున్నవారికి నెలకు రూ.25వేల ఆదాయం ఉంటే ప్రభుత్వ సాయం (పెన్షన్‌) వర్తించడం లేదని, రూ.15వేలలోపు ఆదాయం ఉన్నవారికే ఇస్తున్నారని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు జీరో అవర్‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. నిరంతర చికిత్స, మందుల ఖర్చు ఆ కుటుంబాలకు భారంగా మారిందని, సర్కారు ఆదుకోవాలని కోరారు. వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ సమాధానమిస్తూ.. 25వేల ఆదాయం ఉన్న వారు ఆరోగ్యశ్రీ వినియోగించుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పామాయిల్‌ రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారా అని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీకేకే రంగారావు అడగ్గా.. కేంద్రం రూ.17 వేలు ఇస్తుంటే మన రాష్ట్రంలో 20,700 ఇస్తున్నామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయడు బదులిచ్చారు.


ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపసంఘం వేయాలి..

ప్రజల సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించడం లేదని, వినతుల పర్యవేక్షణకు ఉపసంఘాన్ని నియమిస్తే పరిశీలించి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఏళ్ల తరబడి ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి కోరారు. అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లాలో ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు హార్టికల్చర్‌ సబ్సిడీ అమలు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర విజ్ఞప్తిచేశారు. టీటీడీ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో జారీచేయడం వల్ల భక్తులకు లభించడం కష్టంగా ఉందని, ఈ-దర్శన్‌లు పునరుద్ధరించాలని ఎమ్మెల్యే రామకృష్ణబాబు కోరారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలకు పశువులు కారణమవుతున్నాయని.. వాటిని రోడ్లపైకి రానివ్వకుండా కట్టడి చేయాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. కర్నూలు జిల్లాలో వలసలు నివారించాలని కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, తిరుపతి శివారు ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని తిరుపతి సభ్యుడు ఆరణి శ్రీనివాసులు కోరారు.


వైసీపీ సర్కారు తప్పిదాలతో విద్యుత్‌ శాఖకు రూ.1.29 లక్షల కోట్ల నష్టం

  • కొవ్వాడ అణు విద్యుత్కేంద్రం పనులు వేగవంతం: గొట్టిపాటి

    17.jpg

అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం గత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన తప్పిదాల వల్ల విద్యుత్తు రంగానికి రూ.1.29 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. ఇంధనశాఖ బడ్జెట్‌ ఆమోదం కోసం జరిగిన చర్చలో భాగంగా బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. 2014-19 మధ్యలో మిగులు విద్యుత్తుతో ప్రభుత్వాన్ని అప్పగిస్తే, వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య తొమ్మిదిసార్లు చార్జీలు పెంచి ప్రజలపై రూ.1.29 లక్షల కోట్ల భారం మోపిందని మండిపడ్డారు. డిస్కమ్‌ల ద్వారా పదివేల కోట్ల మేర ఇష్టానుసారంగా విద్యుత్తు పరికరాలను కొనుగోలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ బిల్లు పెంచకూడదని, రైతులకు 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. విద్యుత్‌ పరికరాల చోరీ సమస్యలను పరిష్కరిస్తామని, ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలతోపాటు, వాటిని కొనుగోలు చేసినవారితో కొత్త ట్రాన్ప్‌ఫార్మర్లను పెట్టించే కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. రూ.10వేల కోట్లతో కొవ్వాడలో అణువిద్యుత్కేంద్రం ఏర్పాటుతో పాటు త్వరిగితిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్‌ రాజు, రెడ్డప్పగారి మాధవి, గొండు శంకర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని ఎలా నాశనం చేసిందన్న దానిపై వివరించారు.

Updated Date - Mar 13 , 2025 | 04:03 AM