Karumuri Controversy: నరికిపారేస్తారు ఇంట్లోంచి లాగి కొడతారు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:00 AM
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వైసీపీ నేతలను వేధించిన టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమయ్యాయి

వైసీపీ నేతలను వేధించిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదు
ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి కారుమూరి వ్యాఖ్యలు
రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతల ఆగ్రహం
ఏలూరు రూరల్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరోసారి నోరుపారేసుకున్నారు. వైసీపీ నేతలను వేధిస్తున్న టీడీపీ నేతలను నరికిపారేస్తామంటూ చెలరేగిపోయారు. ఏలూరులో మంగళవారం వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నేను పెద్దిరెడ్డి దగ్గరకు వెళ్లాను. కూటమి ప్రభుత్వం ఏం చేసినా వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే ఓటు వేస్తారని చెప్పాను. ఇప్పటికే తెలుగుదేశం నాయకులు తమపై కక్ష పెట్టుకోవద్దంటూ మమ్మల్ని వేడుకుంటున్నారు. అది ఎన్నటికీ జరగదు. వైసీపీ నాయకులను వేధించిన వాళ్లను గుర్తు పెట్టుకుంటాం. గుంటూరు ఇవతల ఉన్న వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతారు.
గుంటూరు అవతల ఉన్న వారిని నరికి పారేస్తారు. మన ఇంటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో.. వారి ఇంటికి మన ఇల్లూ అంతే దూరం’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తన తణుకు నియోజకవర్గంలో రైతులను ‘ఎర్రి పప్పల్లారా..!’ అంటూ వ్యాఖ్యానించి.. ఎర్రిపప్ప అటే బుజ్జి కన్నా అనే కొత్త నిర్వచనం చెప్పారు. ఆయన హయాంలో జరిగిన టీడీఆర్ బాండ్ల దుర్వినియోగం, రూ.వందల కోట్ల అవినీతిపై ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది. ఎక్కడ తన అవినీతి బయటపడుతుందో అనే భయంతో కారుమూరి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ, జనసేన నాయకులు విమర్శిస్తున్నారు.