Share News

రైతన్నను ముంచిన జొన్న

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:06 AM

రైతన్నకు కష్టాలు తప్పడంలేదు., జొన్న పంటతోకూడా నష్టాలు కొని తెచ్చుకుని లబోదిబోమంటున్న దుస్థితి దువ్వూరు మండలంలో చోటుచేసుకుంది.

రైతన్నను ముంచిన జొన్న
పాలుపోయిన క్రాసింగ్‌ జొన్న పంట

క్రాసింగ్‌ జొన్న మంచి దిగుబడి ఇస్తుందని కంపెనీల ఏజెంట్లు మోసం చేశారంటున్న రైతులు పరిహారం ఇస్తామని తప్పించుకున్న వైనం

దువ్వూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రైతన్నకు కష్టాలు తప్పడంలేదు., జొన్న పంటతోకూడా నష్టాలు కొని తెచ్చుకుని లబోదిబోమంటున్న దుస్థితి దువ్వూరు మండలంలో చోటుచేసుకుంది. క్రాసింగ్‌ జొన్నలు సాగు చేసిన రైతుల పరిస్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మా కంపెనీ జొన్నలు సాగు చేయమని సదరు కంపెనీల ఏజెంట్లు రైతుల చుట్టూ తిరిగి ఎకరాకు పండకపోయినా రూ.50 వేలు పరిహారం ఇస్తామని నమ్మబలికారు. ఆ మేరకు అగ్రిమెంట్లు రాసిస్తామని చెప్పి అగ్రిమెంట్లు రాసివ్వకుండా తిన్నగా జారుకు న్నారు. తీరా దిగుబడి చేతికందే సమయానికి కంకిలో తాలుగింజలు ఏర్పడి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి కూడా అందని పరిస్థితి తలెత్తడంతో సదరు కంపెనీ విత్తనాలు సాగు చేసి మోసపోయామని రైతులు లబోదిబోమంటున్నారు. దువ్వూరు మండలంలో కానగూడూరు, రాంసాయినగర్‌, జిల్లేళ్ల, చింతకుంట, రామాపురం, మదిరేపల్లి, మూడిండ్లపల్లె, నీలాపురం, చిన్నభాకరాపురం, దువ్వూరు, నేలటూరు, ఎర్రబల్లి, ఏకోపల్లె, వెంకుపల్లె, పెద్దజొన్నవరం గ్రామాల పరిధిలో క్రాసింగ్‌ జొన్న సాగు చేశారు. సరాసరి రెండు వేల ఎకరాల్లో క్రాసింగ్‌ జొన్న వేసి ఉంటారని అధికారుల అంచనా. ఏజెంట్ల మాటలు నమ్మి ఎకరాలో పంట సాగుకు రూ.45 వేలు దాకా పెట్టుబడుల కింద వెచ్చించారు. కౌలు రైతులు అదనంగా 20 నుంచి రూ.25 వేలు కౌలు చెల్లించి భూములు తీసుకుని పంటవేశారు. కొంతమేరకు వాతావరణం కూడా సహకరించని పరిస్థితి నెలకొనడం మరోపక్క కంకిలో గింజ కట్టకుండా తాలు ఏర్పడడంతో రైతులు ఏమితెలియాలో దిక్కుతోచక తలలుపట్టుకుంటున్నారు. పంట తొలగించిన రైతులకు నామమాత్రపు దిగుబడులు అందుతుండడంతో బిక్కమొఖం వేసుకుని అధికారులవైపు చూస్తున్నారు.

పరిహారం ఇవ్వకపోతే కంపెనీలపై చర్యలు

మండలంలో క్రాసింగ్‌ జొన్నకు సంబంధించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే సదరు కంపెనీలపై కేసులు పెడతాం. విత్తనాలు ఇచ్చిన ఏజెంట్లతో మాట్లాడాం. అగ్రిమెంట్లు ఇవ్వలేదు. ఎకరాకు రూ.50వేలు చెల్లిస్తామన్నారు. 40 రోజులు గడువు అడిగారు. మరో రూ.10వేలు రైతులకు బోనస్‌గా చెల్లించాలని చెప్పాము.

-అమరనాథ్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి, దువ్వూరు

Updated Date - Feb 24 , 2025 | 12:06 AM