దస్తగిరిరెడ్డిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
ABN , Publish Date - Feb 04 , 2025 | 12:07 AM
తొండూరు మండలం ఇనగనూరు గ్రామానికి చెందిన దస్తగిరిరెడ్డిపై గత నెల 29న జరిగిన దాడి కేసులో నలుగురు నిందితులకు గానూ ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. సోమవారం అర్బన్ పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి
పులివెందుల డీఎస్పీ మురళి
పులివెందులటౌన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): తొండూరు మండలం ఇనగనూరు గ్రామానికి చెందిన దస్తగిరిరెడ్డిపై గత నెల 29న జరిగిన దాడి కేసులో నలుగురు నిందితులకు గానూ ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. సోమవారం అర్బన్ పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 29న ఇనుగనూరు గ్రామానికి చెందిన దస్తగిరిరెడ్డి అలియాస్ బాబురెడ్డి సొంత పనినిమిత్తం పులివెందులకు వచ్చారు. తన పని పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతున్న సమయంలో గ్రామ సమీపంలో అదే గ్రామానికి చెందిన మొరంరెడ్డి సమరసింహారెడ్డి, మొరంరెడ్డి హరికిశోర్‌రెడ్డి అలియా కిశోర్‌కుమార్‌రెడ్డి, మోరంరెడ్డి బాల ఓబుల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కాపు కాచి దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ మురళీ నేతృత్వంలో పులివెందుల రూరల్ సీఐ రమణ ఆధ్వర్యంలో సింహాద్రిపురం ఎస్‌ఐ తులసి నాగప్రసాద్, తొండూరు ఎస్‌ఐ చిన్న ఓబన్న వారి సిబ్బంది కలిసి సైదాపురం క్రాస్ రోడ్డు, పులివెందుల ముద్దనూరు మెయిన్‌రోడ్డు తొండూరు మండలం వంతెనపై ఉన్న ముగ్గురు నిందితులను గుర్తించి సోమవారం ఉదయం అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా బాధితుడు, నిందితులందరూ ఇనగనూరు గ్రామానికి చెందిన వారేనని, వ్యవసాయపొలంలో వేసిన 350 చీనీ చెట్లకు కరువు పని బిల్లులు చేరుంచుకునే విషయమై మనస్పర్థలు వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో దస్తగిరిరెడ్డిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని, ముందుగా అనుకున్న ప్రకారం గత నెల 29న ఉదయాన్నే తన పని మీద మోటారు సైకిలుపై పులివెందులకు వెళ్తుండడంతో పులివెందుల జేఎన్టీయూ కళాశాల వద్ద నిందితులు ఇనుప రాడ్లతో దాడి చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు భాస్కర్‌రెడ్డి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. అలాగే పులివెందుల సబ్‌డివిజను పరిధిలో 18 గ్రామాలను ఫ్యాక్షన్ గ్రామాలుగా గుర్తించామన్నారు. మానవ ప్రాణానికి ఎటువంటి హాని కలిగించినా ఉపేక్షించేది లేదని, అలాగే సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం, తొండూరు సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.