Share News

Kadapa Mayor: మేయర్ మున్సిపల్‌ చైర్మన్‌లపై వేటు

ABN , Publish Date - May 15 , 2025 | 04:11 AM

అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలపై కడప మేయర్‌ సురేశ్‌బాబు, మాచర్ల చైర్మన్‌ తురకా కిశోర్‌లను రాష్ట్ర ప్రభుత్వం పదవుల నుంచి తొలగించింది. విచారణల్లో అవకతవకలు స్పష్టమైనట్లు గుర్తించిన మున్సిపల్‌ శాఖ నిర్ణయం తీసుకుంది.

Kadapa Mayor: మేయర్ మున్సిపల్‌ చైర్మన్‌లపై వేటు

మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ కిశోర్‌, కడప మేయర్‌ సురేశ్‌బాబులకు ఉద్వాసన

వైసీపీకి భారీ షాక్‌... ఇద్దరూ ఆ పార్టీ నేతలే

అమరావతి/మాచర్ల టౌన్‌, మే 14(ఆంధ్రజ్యోతి): అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైసీపీ నేతలు, కడప మేయర్‌ కె.సురేశ్‌ బాబు, మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ తురకా కిశోర్‌లను ఆయా పదవుల నుంచి తొలగిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కడప మేయర్‌గా ఉన్న కె.సురేశ్‌బాబు తన కుటుంబ సభ్యులకు చెందిన కాంట్రాక్టు సంస్థ ద్వారా కార్పొరేషన్‌ పరిధిలో పనులు చేపట్టి అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో మేయర్‌ పదవి నుంచి ఆయనను తొలగిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘వర్ధిని కన్‌స్ట్రక్షన్‌’ పేరుతో కడప కార్పొరేషన్‌లో పలు పనులు మేయర్‌ చేపట్టారని, ఈ పనుల్లో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. పదవిలో ఉన్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల పేరిట స్థానిక సంస్థల్లో పనులు చేపడితే అనర్హత వేటు పడుతుందని తెలిసినా కార్పొరేషన్‌లో పనులు చేపట్టారని ఎమ్మెల్యే మాధవి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మేయర్‌ సురేశ్‌బాబుపై అన్ని కోణాల్లోనూ విచారణ జరిపిన ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డారని గుర్తించి ఆయనను పదవి నుంచి తొలగించింది.


మున్సిపల్‌ చైర్మన్‌ పదవి నుంచి తురకా తొలగింపు

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ తురకా కిశోర్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని తురకా కిశోర్‌ దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపింది. మున్సిపల్‌ చట్టంలోని సెక్షన్‌ 60(1) ఉల్లంఘించారని నిర్ధారించారు. అంతేకాకుండా అనుమతి లేకుండా వరుసగా 15 కౌన్సిల్‌ సమావేశాలకు గైర్హాజరయ్యారు. తురకా కిశోర్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ చూసుకొని ఎన్నో నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. 2022లో డిసెంబరు 16న మాచర్లలోని టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టిన కేసులో తురకా కిశోర్‌తోపాటు అతడి సోదరుడు శ్రీకాంత్‌పై కేసులు నమోదయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పిన్నెల్లి సోదరుల అండదండలు చూసుకొని తురకా కిశోర్‌, శ్రీకాంత్‌లు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. 2022 డిసెంబరు 16న ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అప్పటి టీడీపీ మాచర్ల ఇన్‌చార్జి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై వారు హత్యాయత్నంకు ఒడిగట్టారు. పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి, పోలింగ్‌ రోజు బూత్‌ల వద్ద టీడీపీ నేతలపై దాడితోపాటు, గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పరిశీలకులుగా మాచర్ల నియోజకవర్గ పర్యటనకు వచ్చిన టీడీపీ సీనియర్‌ నేత బుద్దా వెంకన్న, బొండా ఉమ, న్యాయవాదిలపై దాడి చేసి తురకా కిశోర్‌ హత్యాయత్నంకు తెగబడ్డారు. తురకా బ్రదర్స్‌పై దాదాపు 10 కేసులు దాకా నమోదయ్యాయి. ఎన్నికల్లో టీడీపీ విజయంతో తురకా సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏడు నెలలపాటు గాలించి హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ప్రస్తుతం పీడీ యాక్టు అమలు కావడంతో తురకా కిశోర్‌ రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.


తురకా కిశోర్‌ గ్యాంగ్‌పై హత్యాయత్నం కేసు

మాచర్లటౌన్‌, మే 14(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ తురకా కిశోర్‌, అతని అనుచరులపై పట్టణ పోలీస్‌ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. తమ ఇంటి స్థలాన్ని తురకా కిశోర్‌, అతని అనుచరులు కబ్జా చేశారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో మంత్రులకు పట్టణానికి చెందిన చల్లా శివకుమార్‌ ఫిర్యాదు చేశారు. పట్టణంలోని తన కుమార్తెకు ఇచ్చిన ఇంటిని ఆక్రమించుకుని కూల్చివేసి, అడ్డుకున్న తమపై దాడి చేసి చంపుతామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మాచర్ల పట్టణ పోలీసులు తురకా కిశోర్‌తోపాటు మరో ఐదుగురిపై ఐపీసీ 109, 290, 307, 327, 34, 386, 427, 447 సెక్షన్లు, నాలుగు ఏపీఎల్‌జీఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:11 AM