Share News

High Court: దర్యాప్తునకు సహకరించండి

ABN , Publish Date - Jul 01 , 2025 | 05:33 AM

నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో జర్నలిస్ట్‌ కృష్ణంరాజుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే.. పలు షరతులు విధించింది.

 High Court: దర్యాప్తునకు సహకరించండి

  • వారానికి ఒకసారి పోలీసు స్టేషన్‌ అధికారి ముందు హాజరు అవ్వండి

  • అమరావతిపై నీచ వ్యాఖ్యల కేసులోజర్నలిస్ట్‌ కృష్ణంరాజుకు షరతులు

  • బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో జర్నలిస్ట్‌ కృష్ణంరాజుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే.. పలు షరతులు విధించింది. రూ.10 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, దర్యాప్తునకు సహకరించాలని, వారంలో ఓ రోజు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ‘సాక్షి’ చానల్‌ డిబేట్‌లో అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ కృష్ణంరాజు నీచ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంతానికి చెందిన దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నీచ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును ఏ1గా, యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును ఏ2గా, సాక్షి చానెల్‌ యాజమాన్యాన్ని ఏ3గా పేర్కొంటూ.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ2 కొమ్మినేనికి కొన్నాళ్ల కిందటే షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు అయింది.


తాజాగా తనకు కూడా బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ జర్నలిస్ట్‌ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది డీఎ్‌సఎన్వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపించారు. పిటిషనర్‌పై నమోదైన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనన్నారు. అయినప్పటికీ మేజిస్ట్రేట్‌ జ్యుడీషియల్‌ కస్టడీ విధించారని తెలిపారు. అర్నేష్కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు అనుసరించలేదన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కోర్టు ముందు ఉంచాలని గత విచారణ సందర్భంగా తమను ఆదేశించారని, పెన్‌డ్రైవ్‌లో సదరు వ్యాఖ్యల వీడియోలను కోర్టు ముందు ఉంచామని తెలిపారు. సాక్షి మీడియా నుంచి పిటిషనర్‌కు చెల్లింపులు జరిగాయని, కేసు దర్యాప్తులో భాగంగా ఆయన బ్యాంక్‌ ఖాతాలు పరిశీలించగా ఈ విషయం వెల్లడైందన్నారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జర్నలిస్టు కృష్ణంరాజుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

Updated Date - Jul 01 , 2025 | 05:33 AM