Ex Minister Jogi Ramesh: భూముల విక్రయం పేరుతో జోగి మోసం
ABN , Publish Date - May 25 , 2025 | 05:47 AM
ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మోసంగా చూపి రూ. 90 లక్షలు వసూలు చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్‌పై బాధితులు ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం కృత్తివెన్ను పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా చూపి 2021లో విక్రయానికి సిద్ధపడ్డ మాజీ మంత్రి
90 లక్షలు వసూలు చేశాక ముఖం చాటు
కృత్తివెన్ను పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు
మచిలీపట్నం, మే 24(ఆంధ్రజ్యోతి): భూముల విక్రయం పేరుతో మాజీ మంత్రి, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన మోసం బయటపడింది. వైసీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా చూపి రూ. 90 లక్షల కాజేసిన వైనం వెలుగులోకి వచ్చిం ది. దీనికి సంబంధించి కృష్ణాజిల్లా కృత్తివెన్ను పోలీసు స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో ఎకరం రూ. 3 లక్షల చొప్పున 30 ఎకరాలు రైతులు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన తమ్ము వీరవెంకటప్రసాద్, ఆయన కుమారుడు కల్యాణ్‌కుమార్‌లను 2021లో జోగి రమేశ్, ఆయన అనుచరులు నమ్మించారు. ఏ ఇబ్బంది వచ్చినా తాము చూసుకుంటామని భరోసా ఇచ్చారు. విడతల వారీగా రూ. 90 లక్షలు చెల్లించిన తర్వాత ఆ భూమిని చూపకుండా, రిజిస్ట్రేషన్ చేయించకుండా రమేశ్ తప్పించుకు తిరిగారు. దీనిపై అనుమానం వచ్చి విచారణ చేస్తే అది ప్రభుత్వ భూమి అని తెలుసుకున్నారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా మాజీ మంత్రి పట్టించుకోవడంలేదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు.