Share News

జనసేన జయకేతనం రేపు ఆవిర్భావ సభ

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:20 AM

‘జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100 శాతం స్ర్టైక్‌ రేట్‌ను ఒక ఉత్సవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం’ అని పార్టీ పీఏసీ చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

జనసేన జయకేతనం రేపు ఆవిర్భావ సభ

  • 100% స్ర్టైక్‌ రేట్‌ ఉత్సవం

  • ప్రవేశ ద్వారాలకు మహనీయుల పేర్లు

  • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు

  • సభ పోస్టరు ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్‌

కలెక్టరేట్‌(కాకినాడ), మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100 శాతం స్ర్టైక్‌ రేట్‌ను ఒక ఉత్సవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం’ అని పార్టీ పీఏసీ చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచన మేరకు సభకు ‘జయకేతనం’గా నామకరణం చేసినట్లు చెప్పారు. ఈనెల 14న జరగనున్న సభను పురస్కరించుకుని కాకినాడలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. బుధవారం అక్కడ మంత్రి నాదెండ్ల జయకేతనం పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. ‘సభా స్థలానికి వెళ్లే మూడు ప్రవేశ ద్వారాలకు ఈ ప్రాంతానికి ఎంతో పేరు తెచ్చిన ముగ్గురు గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టుకొని వారిని గౌరవించుకుంటున్నాం. మొదటి ద్వారానికి పిఠాపురం రాజాగా ఎన్నో విద్యాలయాలకు స్థలాలు దానం చేసి, నిధులు ఇచ్చి, ఈ ప్రాంతంలో ఎంతోమందికి అక్షర కాంతులను పంచిన పిఠాపురం రాజు శ్రీరాజా సూర్యారావు బహుదూర్‌ పేరును పెట్టాం. రెండో ప్రవేశ ద్వారానికి విద్యాసంస్థలకు, ధార్మిక, సేవా కార్యక్రమాలకు తన సంపాదన దానం ఇచ్చిన మల్లాడి సత్యలింగం నాయకర్‌ పేరును, అపర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరును మూడో ద్వారానికి పెట్టాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. ఆవిర్భావ సభ అద్భుతంగా జరిగేలా ఇప్పటికే పార్టీ నాయకులతో వివిధ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున కార్యకర్తలు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు’ అని తెలిపారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ పిడుగు హరిప్రసాద్‌ మాట్లాడుతూ... ‘పార్టీ ఆవిర్భావ సభకు మీడియాకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేక గ్యాలరీతోపాటు వారి విధులకు అవసరమైన సాంకేతిక సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని మంత్రి మనోహర్‌ అన్నారు.


ఆవిర్భావ సభకు విస్తృత ఏర్పాట్లు

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సభావేదిక, గ్యాలరీ నిర్మాణం, లైటింగ్‌, జనరేటర్ల ఏర్పాటు వంటి పనులు జరుగుతున్నాయి. సభ జరిగే మొత్తం 24 ఎకరాల్లో ఒక ఎకరం విస్తీర్ణంలో సభావేదిక నిర్మిస్తున్నారు. 12-14 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల మంది కూర్చొనేలా ఏడు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై 250 మంది వరకూ కూర్చొనే అవకాశం కల్పిస్తారు. సభకు తరలివచ్చే జనసైనికులు, వీరమహిళలకు నిరంతరాయంగా తాగునీరు, పండ్లు, మజ్జిగ అందజేసేందుకు స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. సభకు ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం ప్రధాన రహదారుల్లో మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Mar 13 , 2025 | 04:20 AM