Share News

Jagan Mohan Reddy: నవ్విపోదురు గాక..!

ABN , Publish Date - Nov 21 , 2025 | 04:19 AM

పరామర్శలకు వెళ్లినా, తుఫాను ప్రాంతాల పర్యటనలకు వెళ్లినా, చివరికి అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైనా సరే... పార్టీ శ్రేణులతో బలప్రదర్శనగా నానా హడావుడి చేసేయడం! వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ తీరు ఇదీ...

Jagan Mohan Reddy: నవ్విపోదురు గాక..!

  • పొరుగు రాష్ట్రంలోనూ జగన్‌ బలప్రదర్శన

  • తీరు మార్చుకోని వైసీపీ అధినేత

  • గతంలో చావు, తుఫాను పరామర్శల్లోనూ ఇదేవరస

(అమరావతి-ఆంధ్రజ్యోతి): పరామర్శలకు వెళ్లినా, తుఫాను ప్రాంతాల పర్యటనలకు వెళ్లినా, చివరికి అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైనా సరే... పార్టీ శ్రేణులతో బలప్రదర్శనగా నానా హడావుడి చేసేయడం! వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ తీరు ఇదీ! తాజాగా హైదరాబాద్‌లో ఇదే దృశ్యం కనిపించింది. అక్రమాస్తుల కేసులో జగన్‌ ఆరేళ్ల తర్వాత గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో జగన్‌ కాలు పెట్టినప్పటి నుంచి నాంపల్లి కోర్టుకు చేరుకునేంత వరకూ నానా హడావుడి చేశారు. జగన్‌ కారులో కూర్చుని రోడ్డు పక్కన తెచ్చిపెట్టుకున్న జనాన్ని చూస్తూ రెండు చేతులూ పైకెత్తి దండం పెడుతూ ర్యాలీగా వెళ్లారు. జగన్‌ విమానం ఖర్చు లక్షలాది రూపాయలు అయినట్టు తెలుస్తోంది.

సందర్భం ఏదైనా హంగామా

ఇటీవల చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్‌ వెళ్లిన సందర్భంలోనూ భారీ సమీకరణతో ఊరేగింపుగా వెళ్తున్నారు. వైసీపీ ముందస్తుగా అందించిన ‘జగన్‌ 2.0 రప్పా రప్పా’ పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. సంతాపం తెలిపే సమయంలో కూడా జగన్‌కు జై కొడుతూ నినాదాలు చేయిస్తున్నారు. పరామర్శల సమయంలో సీఎం.. సీఎం అంటూ నినదిస్తుంటే జగన్‌ వద్దని వారించకుండా చిరునవ్వులు చిందించడంపై విమర్శలు వస్తున్నాయి. సత్తెనపల్లి పర్యటన సమయంలో తన కారు కింద కార్యకర్త పడి నలిగిపోయినా పట్టించుకోలేదు. శబరిమలలో అయ్యప్ప దర్శనానికి వెళ్లే సమయంలోనూ వైసీపీ శ్రేణులు జగన్‌ ఫొటోను మెడలో వేసుకుని ‘జగన్‌ 2.0 రప్పా రప్పా’ అంటూ నినదించడంపై అయ్యప్ప భక్తులు విస్తుపోతున్నారు.

కొసమెరుపు

చిత్రమేమిటంటే.. జగన్‌ మీద ప్రేమతో హైదరాబాద్‌లో బలప్రదర్శనకు జనం వచ్చారని వైసీపీ నేతలు నమ్మబలుకుతున్నారు. అదే నిజమైతే.. ఆయన వెంట జనం చివరిదాకా ఉండాలి. అయితే న్యాయస్థానం నుంచి లోట్‌సపాండ్‌లోని జగన్‌ నివాసానికి వెళ్లినప్పుడు.. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు జనం పలుచగా కనిపించారు. అంటే.. ఉదయానికి ఉన్న అభిమానం మధ్యాహ్నానికి కరిగిపోయిందా అని రాజకీయవర్గాలు అంటున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు

రెండో రోజూ కొనసాగిన ర్యాలీ


జనసమీకరణ.. బలప్రదర్శన

కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం సృష్టించి, జగన్‌ వ్యక్తిగతంగా హాజరైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియజేసేలా వైసీపీ శ్రేణులు నానా హంగామా చేశారు. నాంపల్లి కోర్టుకు వచ్చే దారుల్లో ముందుగానే జన సమీకరణ చేసి బలప్రదర్శనకు దిగారు. లక్డీకపూల్‌, రవీంద్రభారతి, నాంపల్లి, బజార్‌ఘాట్‌, రెడ్‌హిల్స్‌ ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు, కటౌట్లతో జగన్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాట్లు చేశారు. సామాన్య ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది కలిగేలా ఎక్కడికక్కడ రోడ్లపై దుకాణాల ముందు కార్లు, ద్విచక్రవాహనాలను పార్కింగ్‌ చేశారు. ‘2029లో వైసీపీ అధికారంలోకి రాగానే రప్పా.. రప్పా పొట్టేళ్లు నరికినట్టు నరుకుతాం’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నాంపల్లి సిగ్నల్‌ వద్ద ఫ్లెక్సీలు పట్టుకొని హంగామా చేశారు.

పోలీసులతో మాజీ మంత్రుల వాగ్వాదం: నాంపల్లి క్రిమినల్‌ కోర్టు సముదాయం ప్రధాన ద్వారం వద్ద మాజీ మంత్రి పేర్ని నాని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జగన్‌ వెంట కేవలం ఆయన న్యాయవాదులకే అనుమతి ఉందని, ఇతరులకు ప్రవేశం లేదని పోలీసులు చెప్పారు. అయినా వినకుండా పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. నాంపల్లి కోర్టు సిగ్నల్‌ వద్ద మరో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తన అనుచరులతో కలిసి ఒకింత దూకుడుగా పోలీసుల భద్రతా వలయాన్ని దాటుకొని దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. రోప్‌ పార్టీ ఆయన్ను అడ్డుకుంది. తమను కోర్టులోకి ఎందుకు అనుమతించరని సురేశ్‌ కూడా పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు.

కోర్టు ప్రాంగణంలో నినాదాలు సబబు కాదు: కోర్టు సముదాయంలోని నాలుగో అంతస్తులో ఉన్న సీబీఐ కోర్టు వద్ద న్యాయవాదులు కాని వ్యక్తులు చాలామంది గుమిగూడి జై జగన్‌.. జై జగన్‌ అంటూ నినాదాలు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. కోర్టు కారిడార్‌లో నినాదాలు చేయడం సబబు కాదు. ఇలాంటి హైప్రొఫైల్‌ కేసుల విచారణ సాధ్యమైనంత వరకు సాయంత్రం 4 గంటల తర్వాత లేదా శనివారం పెట్టుకుంటే ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.

- రవి కిషోర్‌, నాంపల్లి క్రిమినల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

Updated Date - Nov 21 , 2025 | 06:57 AM