Share News

Jagan False Claims: అబద్ధాలు.. అసత్యాలు

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:05 AM

చిత్తూరు జిల్లా పర్యటనలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎప్పటిలాగే అబద్ధాలు వల్లె వేశారు. కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారు.

Jagan False Claims: అబద్ధాలు.. అసత్యాలు

  • ఎప్పటిలాగే వల్లెవేసిన జగన్‌

  • కూటమి ప్రభుత్వంపై అక్కసు

  • చివరకు పోలీసులపైనా నిందలు

  • తన హయాంలో తోతాపురికి సాయం చేయకపోయినా గొప్పలు

చిత్తూరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పర్యటనలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎప్పటిలాగే అబద్ధాలు వల్లె వేశారు. కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారు. చివరకు పోలీసులపైనా నిందలు వేశారు. వాస్తవాలను దాచి అబద్ధాలను నమ్మించాలని చూశారు. బంగారుపాళ్యంలో మామిడి రైతుల్ని పరామర్శించేందుకు వచ్చిన ఆయన అక్కడి మార్కెట్‌ యార్డులో అరగంట మాట్లాడారు. అందులో చాలా వరకు అవాస్తవాలే ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని...

జగన్‌: మామిడి రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే ఇక్కడికి వచ్చా.

వాస్తవం: మామిడి రైతులు డిమాండ్‌ చేయకముందే సీఎం చంద్రబాబు పరిస్థితిని అర్థం చేసుకుని కిలోకు రూ.4 సబ్సిడీ ప్రకటించారు. ఫ్యాక్టరీలు ధర రూ.6 ఇస్తుండగా, సబ్సిడీతో కలిపి రైతుకు కిలోకు రూ.10 అందుతోంది.

జగన్‌: నేను వస్తున్నానని తెలిసి 2 వేలమంది పోలీసులతో రైతులు రాకుండా అడ్డుకున్నారు. జిల్లాలో 1200 మంది రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు.

వాస్తవం: జగన్‌ గత పర్యటనల్లో జరిగిన ప్రమాదాలు, మరణాలను దృష్టిలో పెట్టుకుని 500 మందిని అనుమతిస్తూ పోలీసులు ఆంక్షలు విధించారు. అయినా 10 వేల మంది వచ్చారు. 1200 మందిని కాదు కదా.. ఒకర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు.

జగన్‌: ఇదే మామిడిని మా ప్రభుత్వ హయాంలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారు.

వాస్తవం: వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్‌ నయా పైసా సబ్సిడీ కూడా రైతులకు ఇవ్వలేదు. 2021, 2023 సీజన్లలో తోతాపురి ధర ఘోరంగా పతనమైనా పట్టించుకోలేదు. ఈసారి దిగుబడి రెండు రెట్లు అధికంగా రావడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

జగన్‌: ఇక్కడ రూ.12 మద్దతు ధర అమలు కావడం లేదు. అదే కర్ణాటకలో కేంద్ర మంత్రి కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే రూ.16 చొప్పున కొంటున్నారు.

వాస్తవం: కర్ణాటకలో రూ.16 చొప్పున కొనడం లేదు. అది మద్దతుధర మాత్రమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కిలో తోతాపురికి అక్కడ రూ.4 సబ్సిడీ ఇస్తున్నాయి. కర్ణాటకలో ఓ రైతుకు గరిష్ఠంగా రూ.40 వేలు మాత్రమే సాయం అందుతోంది. అదే ఏపీలో మామిడి కొనుగోళ్లపై పరిమితి లేదు. రూ.2 లక్షలు సబ్సిడీ పొందిన రైతులూ ఉన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 03:05 AM