Jagan Mohan Reddy: గుర్తు పెట్టుకోండి.. వచ్చేది నాప్రభుత్వమే
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:07 AM
మామిడి రైతుల్ని పట్టించుకోని ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే బంగారుపాళ్యం వచ్చానని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
చిత్తూరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): మామిడి రైతుల్ని పట్టించుకోని ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే బంగారుపాళ్యం వచ్చానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానని, వచ్చేది తన ప్రభుత్వమేనని, గుర్తుపెట్టుకోండని హెచ్చరించారు. బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో రైతులతో ఆయన మాట్లాడారు. ‘‘నేను వస్తున్నానని తెలిసి 2 వేలమంది పోలీసులతో రైతులు రాకుండా అడ్డుకున్నారు. వరి, పెసర, జొన్న.. చివరికి మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు. ఇదే మామిడి (తోతాపురి)ని మా ప్రభుత్వ హయాంలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారు. ఈ ఏడాది మే మొదటి వారంలో కాకుండా జూన్ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో మొత్తం పంట మార్కెట్‌ను ముంచెత్తింది. దీంతో కంపెనీలు ధరల్ని తగ్గించాయి. ఇక్కడ రూ.12 మద్దతు ధర అమలు కావడం లేదు. కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే కర్ణాటకలో కిలో రూ.16కుకొంటున్నారు. మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29కి కొంటే, ఇప్పుడు రూ.12 కూడా రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి మొత్తం పంటను స్వయంగా కొని రైతుల్ని ఆదుకోవాలి. లేకుంటే రైతుల పక్షాన నిలబడి పోరాడతాం. ఇదే నా హెచ్చరిక. దాదాపు 1200 మంది రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఒకరి తల పగులగొట్టారు. అసలు మీరు మనుషులేనా’’ అని జగన్ అన్నారు.