Share News

Jagan: గ్రామం ఇరుకు.. జనసమీకరణ ప్రమాదకరం

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:49 AM

ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న తమ పార్టీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ, ఆయన విగ్రహ ఆవిష్కరణ పేరుతో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లనున్నారు.

Jagan: గ్రామం ఇరుకు.. జనసమీకరణ ప్రమాదకరం

  • వంద మంది కంటే ఎక్కువ అనుమతించలేం

  • పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టీకరణ

  • నేడు రెంటపాళ్లలో విగ్రహావిష్కరణకు జగన్‌

నరసరావుపేట, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న తమ పార్టీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ, ఆయన విగ్రహ ఆవిష్కరణ పేరుతో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లనున్నారు. జగన్‌ పర్యటనకు ఆ పార్టీ నేతలు జనసమీకరణకు సిద్ధమయ్యారు. అయితే గ్రామంలో రోడ్లు చాలా చిన్నవిగా ఉన్నందున, జనసమీకరణ ప్రమాదకరమని అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఆ పార్టీ నేతలకు సూచనలు చేశారు. జగన్‌ సహా వంద మందిని మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పొదిలి ఘటనల నేపథ్యంలో జగన్‌ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఏడాది క్రితం మృతిచెందితే.. ఇప్పుడు పరామర్శలు ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ తరఫున రూ.కోట్లు బెట్టింగ్‌లు కట్టి నష్టపోయి నాగమల్లేశ్వరావు ఆత్మహత్య చేసుకుంటే.. దీనిని రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. జగన్‌ పర్యటనను అడ్డుకుంటామని సత్తెనపల్లి కూటమి నేతలు ప్రకటించారు.


జగన్‌ రెంటపాళ్ల రావడం ఖాయం: వైసీపీ

ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా జగన్‌ రెంటపాళ్లకు రావడం ఖాయమని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. జగన్‌ పర్యటనకు అనుమతి కోసం వైసీపీ నేతలు మంగళవారం ఎస్పీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు, టీడీపీ నేతల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని రజిని ఆరోపించారు. జగన్‌ పర్యటనకు అనుమతుల విషయంలో పోలీసులు వేధిస్తున్నారని అన్నారు. జగన్‌ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కూటమి సర్కారు వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయన్నారు. జగన్‌ పర్యటనను అడ్డుకోవాలని చంద్రబాబు, లోకేశ్‌ అధికారులను ఆదేశించారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జగన్‌ ఒక్కడైనా రెంటపాళ్ల వస్తారని, బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని అన్నారు. రక్షణ సమస్య అంటున్న నేపథ్యంలో జనసమీకరణ చేయబోమని ఎస్పీకి తెలియజేశామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చెప్పారు.

Updated Date - Jun 18 , 2025 | 05:50 AM