Jagan: ఎవడినీ వదలను
ABN , Publish Date - May 09 , 2025 | 05:54 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ, తన అధికారంలోకి వస్తే తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులను ఎక్కడైనా పిలిపించి శిక్షిస్తానని అన్నారు. అలాగే, జెడ్ ప్లస్ భద్రత పొందేందుకు హైకోర్టులో పిటిషన్ వేశారు
వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన పోలీసు అధికారులు ఎక్కడున్నా పిలిపిస్తా: జగన్
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ‘ఈసారి అధికారంలోకి వస్తే జగన్ 2.0 మామూలుగా ఉండదు. వైసీపీ కార్యకర్తలపై పోలీసు అధికారులు ఎవడెవడైతే కేసులు పెట్టాడో.. అకారణంగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశాడో.. వాడు రిటైరయినా, విదేశాలకు వెళ్లిపోయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా ఇక్కడకు పిలిపిస్తా. ఎవడినీ వదలిపెట్టను’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. విత్తు ఏది నాటితే, పండు అదే వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రహించాలన్నారు.
మళ్లీ అదే అబద్ధం: రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలీదు కానీ విశాఖలో ఉర్సాకు రూ.3,000 కోట్ల విలువ జేసే భూములు రూపాయికే చంద్రబాబు ఇచ్చేశాడని జగన్ మళ్లీ అబద్ధం చెప్పారు. కన్ను మూసుకుంటే సంవత్సరం అయిపోయిందని, మరో మూడేళ్లు కన్ను మూసుకుంటే అయిపోతుందన్నారు. ఈ మూడేళ్లూ చంద్రబాబు ప్రభుత్వం పోయేదానికి గట్టిగా కష్టపడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత చంద్రబాబుకు సినిమా చూపిద్దామన్నారు.
జెడ్ ప్లస్ భద్రత కోసం హైకోర్టుకు జగన్
తనకు జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలంటూ మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకున్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపుచేసి భద్రతను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత భద్రతాధికారులు, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత, పనిచేసే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలని లేదా సొంత వాహనాన్ని వినియోగించుకొనేందుకు అనుమతిచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరుగనుంది.