Share News

జగన్‌ పర్యటనలో రచ్చ రచ్చ

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:55 AM

పరామర్శ పేరుతో బలప్రదర్శన చేశారు. అనుమతులు లేకపోయినా భారీగా జనసమీకరణ చేసి రచ్చ రచ్చ చేశారు. బారికేడ్లను తోసివేసి, అడ్డుకోబోయిన పోలీసులను నెట్టివేశారు.

జగన్‌ పర్యటనలో రచ్చ రచ్చ

  • రెంటపాళ్లకు వంద మందికే అనుమతి

  • వేలాది మందిని తరలించిన నేతలు

సత్తెనపల్లి(నరసరావుపేట) జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): పరామర్శ పేరుతో బలప్రదర్శన చేశారు. అనుమతులు లేకపోయినా భారీగా జనసమీకరణ చేసి రచ్చ రచ్చ చేశారు. బారికేడ్లను తోసివేసి, అడ్డుకోబోయిన పోలీసులను నెట్టివేశారు. పోలీసుల నిబంధనలు ఉల్లంఘించి వారిపైనే దౌర్జన్యానికి దిగారు. ఇలా ఆద్యంతం రెచ్చగొట్టేలా బుధవారం వైసీపీ అధినేత జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన సాగింది. ఆయన పర్యటనకు వెళ్లిన రెంటపాళ్ల గ్రామంలో రోడ్లు ఇరుకుగా ఉంటాయి. వేలాది మంది వెళితే ప్రమాదకరమని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ముందుగానే హెచ్చరించారు. జగన్‌ సహా వంద మందిని మాత్రమే రెంటపాళ్లకు అనుమతిస్తామన్నారు. ఇందుకు విరుద్ధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బలప్రదర్శనకు దిగారు. పెద్దఎత్తున జనసమీకరణ చేశారు. పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. 12 గంటలకు రెంటపాళ్ల రావాల్సిన జగన్‌ జనసమీకరణతో బల ప్రదర్శనగా సాయంత్రం 4.45కు చేరుకున్నారు. ఏదైనా సంఘటన జరిగితే అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ కుట్రలో భాగంగా భారీగా జనసమీకరణ చేశారన్న విమర్శలు వస్తున్నాయి.


పోలీసులతో అంబటి వాగ్వాదం

పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా జనసమీకరణ చేయాల్సిందేనని మాజీ ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్ఠానం ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించినట్టు ప్రచారం జరిగింది. జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన సోదరుడు అంబటి మురళి ఓవర్‌ యాక్షన్‌ చేశారు. జగన్‌ పర్యటనలో ఆయన కాన్వాయ్‌తో పాటు మూడు వాహనాలు, వంద మందికి మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో మేడికొండూరు మండలం కొర్రపాడు వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. జగన్‌ కాన్వాయ్‌తో పాటు మరో మూడు వాహనాలను రెంటపాళ్ల వైపు వెళ్లనిచ్చారు. అటుగా వస్తున్న అంబటి రాంబాబు, ఇతరుల వాహనాలను ఆపారు. దీంతో అంబటి రాంబాబు, మురళి కిందకు వాహనాల్లో నుంచి దిగి బారికేడ్లను లాగి పడేశారు. దమ్ముంటే ఆపాలంటూ పోలీసులకు సవాల్‌ విసిరారు. ‘ప్రమాదాలు జరుగుతున్నాయి, ఐదు నిమిషాలు ఆగండి పంపిస్తాం’ అని పోలీసులు చెప్పినా వినకుండా.. ‘మాకు తెలుసు’ అంటూ అంబటి కార్యకర్తలను రెచ్చగొడుతూ రెంటపాళ్ల వైపు వాహనాల్లో వెళ్లారు.


పార్టీ శ్రేణుల అత్యుత్సాహం

జగన్‌ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు సత్తెనపల్లిలో హల్‌చల్‌ చేశాయి. అనుమతులు లేకపోయినా ప్రదర్శన నిర్వహించారు. బైకుల హారన్‌ మోగిస్తూ.. ఆర్టీసీ వాహనాలకు అడ్డుగా బైక్‌లను నిలిపి ప్రయాణికులను ఇబ్బంది పెట్టారు. జగన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు 25 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నందిగామ అడ్డరోడ్డులో ‘అమరావతి ద్రోహి జగన్‌.. గోబ్యాక్‌ జగన్‌’ అనే నినాదాలతో కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, బుధవారం తెల్లవారేసరికి పోలీసులు తొలగించారు. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వరకు జగన్‌, నాగమల్లేశ్వరరావు ఫ్లెక్సీలను పెట్టారు. ఫ్లెక్సీలను తొలగించబోయిన మున్సిపల్‌ సిబ్బందిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబా బు సత్తెనపల్లి పర్యటన సందర్భంగా టీడీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనీయకుండా అప్పటి మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు అడ్డుకున్నారు.


వారిపై చర్యలు తప్పవు: ఎస్పీ

జగన్‌ పర్యటనలో నిబంధనలను అతిక్రమించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు బుధవారం రాత్రి స్పష్టం చేశారు. రెంటపాళ్లకు భారీగా జనసమీకరణ చేశారన్నారు. సత్తె నపల్లి పట్టణంలో ట్రాఫిక్‌కు విఘాతం కలిగించా రన్నారు. అనుమతులు లేకుండా ద్విచక్ర వాహనాల తో ప్రదర్శనలు నిర్వహించారన్నారు. ప్రజలకు ఇబ్బం దులు కలిగించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు.


రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఫిర్యాదు

రాజుపాలెం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ‘2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం ఒక్కొక్కడిని’.. అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామానికి చెందిన మెరుగు రాధ అనే వైసీపీకి చెందిన మహిళ ప్రజలను రెచ్చగొట్టే విధంగా పలు వాట్సాప్‌ గ్రూపులలో పోస్టులు ఫార్వడ్‌ చేసింది.

Updated Date - Jun 19 , 2025 | 05:55 AM