Share News

Jagan: షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేశారేమో

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:04 AM

తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో తన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేశారన్న వార్తలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారు. గురువారం మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా...

Jagan: షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేశారేమో

  • అయినా పొరుగు రాష్ట్రం సంగతి నాకెలా తెలుస్తుంది: జగన్‌

అమరావతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో తన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేశారన్న వార్తలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారు. గురువారం మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా.. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ నేను చేశానా? నా ప్రభుత్వ హయాంలో జరిగిందా? ఎవరు చేశారో చెప్పు స్వామీ.. నాకు అర్థం కాలేదు’ అని జగన్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటున్నారని వారు చెప్పగా.. ‘తెలంగాణలో అప్పుడు షర్మిల రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నందున ట్యాపింగ్‌ చేశారేమో’ అని బదులిచ్చారు. అంతలోనే పొరుగు రాష్ట్రం సంగతి తనకెలా తెలుస్తుందని వ్యాఖ్యానించారు.


బనకచర్లపైనా స్పష్టత లేదు..

పోలవరం-బనకచర్ల పథకంపై తెలంగాణ నేతలు చేస్తున్న విమర్శలను విలేకరులు ప్రస్తావించినప్పుడు జగన్‌ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించలేదు. వారి వాదనను ఖండించలేదు. గతంలో కేసీఆర్‌ తెలంగాణ భూభాగం నుంచే గోదావరి జలాలను నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలాశయానికి.. తర్వాత రాయలసీమకు తరలించాలని చేసిన ప్రతిపాదనలను కూడా జగన్‌ ప్రస్తావించలేదు. ఏకంగా 400 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని నాడు కేసీఆర్‌ ప్రతిపాదించారు. దీనిపైనా జగన్‌ దాటేశారు. నాలుగు నెలల పాటు గోదావరి వరద ఉంటుందని.. 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుందని.. ఈ వరద జలాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా పోలవరం కుడికాలువను అభివృద్ధి చేయడం.. విస్తరించడం.. బనకచర్లకు ఎత్తిపోయడానికి సమగ్రంగా పనులు చేపట్టాలని చెప్పారు. ఒకేసారి పనులన్నీ చేపట్టకుండా.. ఒకదాని తర్వాత ఒకటిగా చేసుకుంటూ పోవాలన్నారు. అంతలోనే.. అసలు బనకచర్ల పనులు ఎప్పుడు చేస్తారు.. ఎలా చేస్తారని ప్రశ్నించారు.

జగన్‌ చేతికి స్మార్ట్‌ హెల్త్‌ రింగ్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు 76 ఏళ్ల ముసలోడంటూ పదే పదే ఆయన వయసు గురించి మాట్లాడుతున్న జగన్‌కు ఆరోగ్యసమస్యల భయం పట్టుకుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఆయన జనం మధ్యకు రావడం పూర్తిగా తగ్గించేశారు. ఇటీవల కొన్ని పరామర్శలకు వెళ్లారు. ఆ సమయంలో చేతి వేలికి ‘స్మార్ట్‌ హెల్త్‌ ఉంగరం’ కనిపిస్తోంది. చంద్రబాబు చేతికి కూడా ఈ ఉంగరం ఉంటుంది. దాని విశిష్టత, పనితీరు గురించి ఒకట్రెండు సార్లు ఆయన చెప్పారు కూడా. ఇప్పుడు జగన్‌ చేతికీ ఈ రింగ్‌ కనిపిస్తోంది. ఇది ఫోన్‌ యాప్‌ ద్వారా పనిచేస్తుంది. ఈ రింగ్‌ పెట్టుకున్న వారి వద్ద కచ్చితంగా.. యాపిల్‌ ఐ ఫోన్‌ లేదా ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉండాలి. అంటే జగన్‌ వద్ద వీటిలో ఒక ఫోన్‌ ఉందని స్పష్టమవుతోంది.

Updated Date - Jun 20 , 2025 | 04:05 AM